ప్రజల మనిషి-శీనయ్య

- May 13, 2025 , by Maagulf
ప్రజల మనిషి-శీనయ్య

ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో నీతి, నిజాయితీలే ప్రాణంగా బ్రతికిన అతికొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు. జమీందారీ కుటుంబంలో జన్మించినప్పటికి విద్యార్ధి దశలోనే సోషలిస్టు భావజాలం పట్ల ఆకర్షితుడై , ఆ పంథాలోనే రాజకీయాలు నడిపారు. నమ్మిన దాన్ని తూచ తప్పకుండా ఆచరించడానికి సిద్దపడేవారు. ఐదు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఏనాడు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కాలేదు. పదవుల కంటే తనను నమ్మి గెలిపించిన ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగిన వ్యక్తి  సింహపురి రాజకీయ దిగ్గజం నల్లపరెడ్డి శీనయ్య.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నెస్సార్‌, కోట శీనయ్య, నల్లపరెడ్డి శీనయ్యగా సుపరిచితులైన నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 1933, ఏప్రిల్ 30న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త నెల్లూరు జిల్లా కోట తాలూకా కొత్తపట్నం గ్రామానికి చెందిన జమీందారు నల్లపరెడ్డి వీరరాఘవరెడ్డి, బుజ్జమ్మ దంపతులకు జన్మించారు. కోట, వెంకటగిరిలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న తర్వాత నెల్లూరులోని వి.ఆర్. కళాశాలలో ఇంటర్ మరియు డిగ్రీలను పూర్తి చేశారు. అనంతరం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు.

శ్రీనివాసులు రెడ్డి కుటుంబం తోలి నుంచి రాజకీయ కుటుంబం. తండ్రి రాఘవరెడ్డి వెంకటగిరి రాజులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మేనమామ పెల్లేటి గోపాలకృష్ణారెడ్డి గూడూరు నుంచి వరసగా మూడుసార్లు హ్యాట్రిక్ ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. విద్యార్ధి దశ నుంచే శీనయ్య నాయకత్వ లక్షణాలను కలిగి ఉండేవారు. నెల్లూరు వి.ఆర్.కాలేజీ రోజుల్లోనే ఆయన విద్యార్థి నేతగా చురుగ్గా ఉంటూ వచ్చారు. యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో యూనివర్సిటీ విద్యార్ధి సంఘం నాయకుడిగా, యూనివర్సిటీ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర స్టూడెంట్స్ విభాగం మెంబర్‌గా పనిచేశారు. యూనివర్సిటీలోనే సోషలిజం భావజాలం పట్ల ఆకర్షితులై చివరి వరకు అదే బాటలో నడిచారు.

ఆంధ్ర యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తి చేసి న్యాయవాదిగా స్థిరపడాలని భావిస్తున్న సమయంలోనే తన అన్న నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి నెల్లూరు జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో, అంతవరకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కోట సమితి అధ్యక్ష పదవికి 1962లో  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1962-72 వరకు దాదాపు దశాబ్దం పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన కోట సమితిని అభివృద్ధి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారు.

సమితి ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన వెంటనే సమితి ముఖ్య అధికారులును వెంటబెట్టుకొని గ్రామాల్లో పర్యటిస్తూ, ఆయా గ్రామాల ప్రజల  అవసరాలేమిటో విచారించి, స్వయంగా పరిశీలించి, ఎస్టిమేట్లు తయారు చేయించి, క్రోడికరించి, పట్టిక తయారు చేసి ఒక సమగ్ర సమితి అభివృద్ధి ప్రణాళికను తయారు చేశారు. సమితికి నిధులు కేటాయించగనే మళ్లీ గ్రామాలకు వెళ్లి ఎసిమేట్లు వగైరాలు జరిపించనక్కర  లేకుండానే వెంట వెంటనే ఆయా పథకాలకు నిధులను మంజూరు  చేసే వీలును, వేగాన్ని సాధించగలిగారు. ఒక రకంగా ఈ పద్ధతి ఆరోజుల్లో విప్లవాత్మకమైనది.

సమితిలోని ప్రతి గ్రామం అవసరాలు, సమస్యలు కరతలా మలకంగా వుండేవి. సమితిలో గ్రామాల్లో ప్రతి వ్యక్తి  శీనయ్యకు  పరిచయస్తుడిగా ఉండేవారు. సమితిలో ఉన్న అన్ని గ్రామాలకు రోడ్లు, కల్వర్టులు మరియు వంతెనలు కట్టించారు. సమితి పరిధిలోని గ్రామాల్లో ప్రైమరీ స్కూళ్ళు, కరెంట్, ఇరిగేషన్ వ్యవస్థలను సైతం ఏర్పాటు చేయించారు. సమితి వికాస్ మేళాలు నిర్వహించి ప్రజల్లో సహకార స్ఫూర్తిని పెంపొందించేందుకు కృషి చేశారు.

ఆరోజుల్లోనే పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమాన్ని సమితి పరిధిలో నిత్యకృత్యం చేశారు. కోటలో ఆయన తలపెట్టిన కార్యక్రమాల ఫలితాలను చూసిన ఆనాటి జిల్లా అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా అప్పటి జిల్లా కలెక్టర్ ఎం.వి.రాజగోపాల్ కోట మోడల్‌ను విశేషంగా ప్రశంసించారు.

కోట సమితి అధ్యక్షుడిగా ఉంటూనే వెంకటగిరి, గూడూరు మరియు సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో తమ కుటుంబ రాజకీయ బలాన్ని పెంచేందుకు కృషి చేశారు. అన్న చంద్రశేఖర రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఇస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని  రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. ఈ క్రమంలో తన ఎదుగుదలను ఆపాలని చుసిన ఆనం సంజీవ రెడ్డి, వెంకట రెడ్డి లాంటి వాళ్ళను సైతం ధైర్యంగా ఎదుర్కొంటు వచ్చారు. అలాగే, తన బావ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో జిల్లా రాజకీయాల్లో తిరుగులేని యువనేతగా ఎదుగుతూ వచ్చారు.  

 1967లో మేనమామ గోపాలకృష్ణారెడ్డి వయోభారం కారణంగా ఆ దఫా ఎమ్యెల్యేగా పోటీ చేయకపోవడంతో ఆయన స్థానంలో గూడూరు నుంచి వీరు ఎమ్యెల్యేగా చేయాలనుకున్నప్పటికి కొన్ని కారణాల వల్ల పోటీచేయలేకపోయారు. అయితే, గూడూరు నుంచి  పోటీ చేసిన ఆనం అభ్యర్థి పసుపులేటి సిద్దయ్య నాయుడు మీద వేమారెడ్డి రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి గెలిపించి తన సత్తా చాటారు. 1972లో సైతం గూడూరు నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడానికి ఆనం సంజీవ రెడ్డి సుముఖంగా లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి, తన సొంత బలంతో తొలిసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.

1972లో వచ్చిన జైఆంధ్ర ఉద్యమంలో ఎన్నెస్సార్ నెల్లూరు జిల్లా నుంచి చురుగ్గా పాల్గొన్నారు. ఆనాడు ఆంధ్ర యువసేన పేరుతో సంస్థను స్థాపించిన జిల్లా యువ నాయకుడు మాదాల జానకీరామ్, జనసంఘ్ విద్యార్ధి నాయకుడు వెంకయ్య నాయుడు వంటి వారు వీరితో కలిసి పనిచేశారు. ఈ ఉద్యమం మూలాన శీనయ్యకు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. అసెంబ్లీలో తనలా గెలిచిన స్వతంత్ర అభ్యర్థులతో కలిసి సోషలిస్టు ప్రజాస్వామ్య కూటమిగా ఏర్పడి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడారు.

1978లో నెల్లూరు జిల్లాలోని దిగ్గజ నాయకులందరూ జనతా లేదా రెడ్డి కాంగ్రెస్ పార్టీల్లో చేరారు. అదే సమయంలో అప్పటి నెల్లూరు జిల్లా జనతాపార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలిచి మరీ టిక్కెట్ ఇస్తా అన్నప్పటికి, ఎన్నెస్సార్ మాత్రం ఇందిరా కాంగ్రెస్ వైపు వెళ్లారు. అయితే, శ్రీనివాసులు రెడ్డిని రాజకీయంగా అణగదొక్కాలని భావించిన నాటి జిల్లా కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాల పునర్విభజనప్పుడు జనరల్ స్థానంలో ఉన్న గూడూరును రిజర్వ్ చేయడంతో వెంకటగిరి నుంచి పోటీచేశారు.

వెంకటగిరిలో శీనయ్యను అప్పటి ఇందిరా కాంగ్రెస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేదురుమల్లి జనార్దన రెడ్డి ఓడించేందుకు చేసిన ప్రయత్నాలను అధిగమించి మరీ రెండోసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో జిల్లా నుంచి గెలిచిన 10 మంది ఇందిరా కాంగ్రెస్ నేతల్లో 9 మంది జనార్దన రెడ్డి వర్గీయులు కాగా, శ్రీనివాసుల రెడ్డి ఒక్కరే హైకమాండ్ రికమాండ్ చేసిన అభ్యర్థి. ఇందిరా కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం మర్రి చెన్నారెడ్డికి దగ్గరయ్యారు. అయితే, మర్రి సీఎంగా ఉన్నంత కాలం మంత్రి పదవి దక్కలేదు.  

1981లో మర్రి స్థానంలో అంజయ్య సీఎం అయిన తర్వాత శ్రీనివాసులు రెడ్డికి రాజకీయంగా గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. మర్రి వర్గీయుడిగా ఉన్నప్పటికి శీనయ్యను రాజకీయంగా ప్రోత్సహించారు. రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఛైర్మన్ బాధ్యతల్లో వీరిని కూర్చోబెట్టారు. అక్కడితో ఆగకుండా తన జంబో మంత్రివర్గంలో సైతం చోటు కల్పించారు. 1981-82 వరకు అంజయ్య మంత్రివర్గంలో మైనింగ్ మరియు పంచాయితీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు.

1982లో భవనం మంత్రివర్గంలో మంత్రి పదవి రాకుండా నేదురుమల్లి ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేయడంతో తనకు జరిగిన అవమానానికి విసిగిపోయిన శీనయ్య 1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించాక, ఆయన ఆహ్వానం మేరకు ఆ పార్టీలో తన సోదరుడు చంద్రశేఖర రెడ్డి మరియు అనుచరులతో కలిసి చేరారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తాను ఎంతగానో అభిమానించే రాజకీయ కురు వృద్ధుడు బెజవాడ పాపిరెడ్డి గారు సైతం తెదేపాలో ఉండటం శీనయ్య  ఆ పార్టీలో చేరడానికి మరో ముఖ్య కారణం.

1983 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గాన్ని తన అన్న చంద్రశేఖర్ రెడ్డికి వదిలేసి పాపిరెడ్డి గారి సలహా మేరకు కోవూరుకు మారి అక్కడ పోటీ చేయగా మూడోసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1983-85 మధ్యలో రోడ్లు & భవనాలు, పీడబ్ల్యూడీ మరియు ఇరిగేషన్ శాఖల మంత్రిగా, ఆర్థిక & విద్యుత్ శాఖలకు ఇంఛార్జి మంత్రిగా పనిచేశారు. 1984లో వచ్చిన ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ పక్షాన నిలిచి తిరిగి సీఎం అవ్వడంతో కీలక పాత్ర పోషించారు. 1985 ఎన్నికల్లో కోవూరు నుంచి నాలుగోసారి ఎన్నికైన తర్వాత ఎన్టీఆర్ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ శాఖతో పాటుగా క్యాబినెట్లో నంబర్ 2 గా సైతం చక్రం తిప్పారు.

అయితే, 1987 మధ్య నాటికి ఎన్టీఆర్ గారితో ఏర్పడ్డ విభేదాల కారణంగా పార్టీకి దూరమయ్యారు. అంతేకాకుండా, "శీనయ్య సేన"  పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్టీఆర్ పాలనా విధానాలను తూర్పారబడుతూ 250 సభల్లో మాట్లాడారు. ఇదే సమయంలో అప్పటి దేశ ప్రధాని, ఎన్టీఆర్ బద్ద వ్యతిరేకి రాజీవ్ గాంధీ వీరిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కోవూరు నుంచి పోటీ ఐదోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

1989లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో రోడ్లు & భవనాలు మరియు పశు సంవర్థక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శీనయ్యకు తెదేపాలో ఉన్నంత స్వేచ్ఛ మరియు స్వాతంత్రం లేక ఉక్కపోతకు గురయ్యేవారు. 1990లో భాగ్యనగరంలో జరిగిన అల్లర్లకు నిరసనగా తన మంత్రి పదవులకు రాజీనామా చేశారు. చెన్నారెడ్డి తర్వాత వచ్చిన జనార్దన రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డిలు తమ మంత్రివర్గాల్లో స్థానం కల్పించక పోవడంతో సాధారణ ఎమ్యెల్యేగానే మిగిలిపోయారు.

శీనయ్య అంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది రెవెన్యూ సంస్కరణలు. తెలంగాణాలో ఉన్న పటేల్, పట్వారీ, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మునుసుబు, కరణం వ్యవస్థలను రద్దు చేసి వాటి స్థానే విఆర్వో మరియు ఎమ్మార్వో వ్యవస్థలను తీసుకొచ్చిన పూర్తి ఘనత వీరికే దక్కుతుంది. అలాగే, సమితిల స్థానంలో మండల వ్యవస్థ రావడంలోనూ శీనయ్య పాత్ర కీలకం. కోట సమితి రద్దై కోట మండలం ఏర్పడిన తర్వాత అక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాల స్కూళ్ళు, హాస్పిటల్ ఇలా ఒక మండల కేంద్రంలో లెక్కకు మించిన ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయించి పక్కనే ఉన్న సూళ్లూరుపేటకు మించిన గుర్తింపును కోటకు తెచ్చి  సొంతూరి పట్ల మమకారాన్ని చాటుకున్నారు.  

1984లో ఎన్టీఆర్ మానస పుత్రికగా భావించే తెలుగు గంగ ప్రాజెక్టు రూపకల్పనలో అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా శీనయ్య ముఖ్యపాత్ర పోషించారు. తెదేపా హయాంలోనే నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ వ్యవస్థ బలోపేతంలో భాగంగా కండలేరు జలాశయం నిర్మాణం, పాపిరెడ్డి కాలువ, సంగం బ్యారేజి కాలువల వ్యవస్థ పునర్నిర్మాణంతో పాటుగా జిల్లాలో అనేక మౌలిక సదుపాయాల కల్పనకు దండిగా నిధులు సైతం విడుదల చేయించి రికార్డు స్థాయిలో వాటిని పూర్తి చేపించారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీని లాభాల బాటలో నడిపించి, రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడంలో ఎంతో కృషి చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో సాగు, తాగు నీటి కోసం ప్రజలు  ఇబ్బందులు గురికాకుండా ఉన్నారు అంటే అది ఆయన చలవే!

శీనయ్య గొప్ప  వక్త. సమితి అధ్యక్షుడిగా ఉన్న నాటి నుంచే స్థానిక సంస్థల్లో ఉన్న లోటు పాట్ల గురించి అనర్గళంగా మాట్లాడేవారు. ఇక ఎమ్యెల్యే అయ్యాక చట్ట సభలకు ఒక్కరోజు డుమ్మా కొట్టని నేతగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోయారు. ప్రజా సమస్యలపై వీరు అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే తోటి సభ్యులు ఆసక్తిగా వినేవారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వామపక్ష నేత మద్దికాయల ఓంకార్,  సోషలిస్టు నాయకుడు పరిపాటి జనార్దన రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గార్లు మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజానీకం సైతం రేడియల్లో ఆసక్తిగా వినేవారు. అసెంబ్లీకి ఏనాడు ఒక్కరోజు కూడా గైర్హాజరు కాలేదు. అసెంబ్లీ చట్టాల మీద పూర్తి అవగాహనతో సభ మర్యాదలను పాటించేవారు. ఆరోజుల్లో ఆయన్ని అసెంబ్లీ టైగర్‌గా పిలిచేవారు.

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చట్టసభల్లో ఆయన వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అప్పటి మంత్రులు జంకేవారు. మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖల సంబంధించిన ప్రశ్నలకు ఆయనే లేచి సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చేవారు. చట్టసభల వెలుపల సైతం ఆయన మాట్లాడే బహిరంగ సభలకు జనం తండోపతండాలుగా వచ్చేవారు. 1989లో ఎన్టీఆర్ ఓటమిలో వీరు చేసిన విమర్శలు కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. చివరి వరకు ఆయన గొప్ప వాక్చాతుర్యం కలిగిన  నాయకుడిగానే మన్ననలు అందుకున్నారు.  

వీరికి  శీనయ్య పేరు రావడం వెనుక చిన్న కథ ఉంది. సంపన్న జమీందారీ కుటుంబంలో పుట్టిన శ్రీనివాసులు రెడ్డి బాల్యం మొత్తం రాచరికంగానే సాగింది. కాలేజీలోకి వచ్చిన తర్వాత నమ్మిన సోషలిజం భావజాలం మరియు సమితి అధ్యక్షుడిగా చేపట్టిన తర్వాత కులాలు, మాతాలకు అతీతంగా అందరి వాడిగా నిలవాలనే లక్ష్యంతో తన పేరులో ఉన్న కులాన్ని సూచించే రెడ్డిని తీసేసి శీనయ్యగా మార్చుకున్నారు. జిల్లాలో మిగిలిన రెడ్డి నాయకుల కంటే వీరి వద్దకు వచ్చి చెప్పుకుంటే సమస్యలు తీరుతాయని దళిత, బడుగు వర్గాల ప్రజలు భావించేవారు. వాళ్ళందరూ ఆయన్ని రెడ్డి గారు అని కాకుండా శీనయ్య అని ఆప్యాయంగా పిలిచేవారు. వీరు సైతం తన అసలు పేరు కంటే ఈ పేరుతోనే పిలిపించుకోవడానికి ఇష్టపడేవారు.        

శీనయ్య రాజకీయ జీవితంలో అవినీతి, బంధుప్రీతి వంటి విషయాలకు చోటివ్వలేదు. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించిన ఆయన అవినీతి, అక్రమాలకు చివరి దాక బహు దూరంగా ఉండేవారు. ప్రత్యర్థులు రాజకీయంగా విభేదించినప్పటికి,  శీనయ్య అవినీతి పరుడు కాడని నమ్ముతారు. దశాబ్దాల పాటు తన వెనక నడిచిన ప్రతి ఒక్కరిని రాజకీయాల్లో ఉన్నత స్థానానికి తేవడానికి కృషి చేశారు. వారసత్వ రాజకీయాల పట్ల తోలి నుంచి ఉన్న విముఖత వల్ల తన తుది శ్వాస వరకు సొంత కుమారులను రాజకీయాలకు దూరంగా ఉంచారు. మేనల్లుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని రాజకీయంగా ప్రోత్సహించినప్పటికి పదవుల విషయంలో మాత్రం సొంత ప్రతిభతోనే తెచ్చుకోమని ఖరాకండిగా చెప్పారు. ఒకవిధంగా ఆయన వల్ల సొంత కుటుంబం కంటే బయటి వారే ఎక్కువగా లాభపడ్డారు.

శీనయ్య మంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ కాన్సరెన్స్‌లు ఎంతో లైవ్‌లీగా ఉండేవి ! ఎంత రెచ్చగొట్టినా, గిల్లి కజ్జాలు పెట్టుకొనే ప్రశ్నలు చేసినా, కావాలని జర్నలిస్టులు అడుగుతున్నారని తెలిసినా సహనం కోల్పోయేవారు కాదు. సమాధానం చెప్పే సమయంలో మాట మాత్రం నవ్వుతో కలగలిసే వచ్చేది. ఎన్ని సందర్భాల్లో పుండు మీద కారం చల్లినట్లు ప్రశ్నలు వేసిన ఎప్పుడు మనసులో పెట్టుకునేవారు కాదు, సరికదా వారందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. రాజకీయ పోకడలకు, వ్యక్తిగత సంబంధాలకు స్పష్టమైన తేడా పాటించడం అందరికి చేతకాదు; అంతటి హృదయ వైశాల్యం కొందరిలో వీరు ఒకరు.    

 శీనయ్య ఏనాడు రాజకీయాల్లో వెనకడుగు వేయలేదు. తనకు ముందు నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన సొంతన్న చంద్రశేఖర రెడ్డి నెల్లూరు జిల్లాలో దాదాపు రాజకీయంగా తెరమరుగు అవుతున్న సమయంలోను అధైర్య పడకుండా ముందుకు సాగారు. రాజకీయంగా శ్రీనివాసులు రెడ్డికి అసంఖ్యాకమైన విరోధులుండవచ్చు, ఆయన పద్దతులు నచ్చని వారు కోకొల్లలుగా వుండవచ్చు. కాని ఆయన నాయకత్వ శైలిని, వాగ్దాటిని, ఉపన్యాస నైపుణ్యాన్ని, ప్రజాసేవా తత్పరతను అభిమానించని వారుండరు.

తాను ఒక విషయాన్ని బలంగా నమ్మితే, దాన్ని ఆరునూరైనా తూచ తప్పకుండా పాటించేందుకు ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఈ తరహా రాజకీయం వల్ల ఆయన చాలా నష్టపోయారు. ముఖ్యంగా తన ఉజ్వలమైన రాజకీయ జీవితం కోల్పోయే సంకేతాలు ఉన్నప్పటికి, ఎన్టీఆర్ గారిని విభేదించి తెదేపాకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడి రాజకీయాల్లో ఇమడ లేక ఉక్కిరిబిక్కిరయ్యారు.

మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో సమితి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓటమెరుగని అజేయుడిగా శీనయ్య నిలిచారు. అధికారంలోనే
ఉన్న పార్టీల్లో ఉండి కూడా విపక్షనేతగా వ్యవహరించిన సందర్భాలు అయన రాజకీయ జీవితంలో కోకొల్లలు ఉన్నాయి. ప్రజల కోసమే రాజకీయం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు కోసం కాదని నమ్మిన నాయకుడు వీరు. కక్షా, కార్పణ్యం, ఈర్యాద్వేషాలులు, పగలు సెగలతో ఎదుటి వారి వినాశనాన్నికోరుకోకుండా, తన ఉన్నతికి తన శక్తి సామర్థ్యాలను, ప్రజా సాన్నిహిత్య ప్రవృత్తిని, సేవానురక్తిని సద్వినియోగం చేసుకొని రాజకీయాల్లో పైకి ఎదిగారు.  

సింహపురి రాజకీయాల్లో ఎందరో హేమాహేమీలు ఉన్న సమయంలోనే రాజకీయాల్లో అడుగుపెట్టి తన సమర్థత, కార్యదీక్షతో ఒక్కో మెట్టు ఎక్కుతూ దిగ్గజ నాయకుడిగా నిలిచారు. చివరి వరకు ప్రజా సేవలో ఉంటూనే అనారోగ్యం కారణంగా 1993, ఫిబ్రవరి 23న తన 59వ ఏట భాగ్యనగరంలో కన్నుమూశారు. నెల్లూరు సీమ సస్యశ్యామలం కావడానికి ఆయన చేసిన కృషిని గుర్తించి నెల్లూరు పెన్నా బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పెన్నా బ్యారేజీగా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. నిర్చికుడైన, చైతన్యవంతుడైన, సమస్యార్థకుడైన, విశ్వసించడాని విస్మరించడానికి వీలు లేని అసాధ్యుడుగా తన పేరును ఉమ్మడి  ఆంధ్ర రాజకీయాల్లో శీనయ్య సుస్థిరం సంపాదించారు.
           
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com