సెక్యులర్ రైతు ప్రధాని-H.D.దేవెగౌడ

- May 18, 2025 , by Maagulf
సెక్యులర్ రైతు ప్రధాని-H.D.దేవెగౌడ

భారత దేశ రాజకీయాల్లో ఆయనకి ప్రాముఖ్యత దేశానికి దిశానిర్దేశం చేసే పదవిని చేపట్టిన తర్వాతనే వచ్చింది. ఉత్తరాది నేతల  ఆధిపత్యంలో పదిలమైన ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించిన దక్షిణాది నేత అతడు. లౌకికవాద రాజకీయ భావజాలానికి కట్టుబడి సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు హెచ్.డి.దేవెగౌడ. నేడు మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.. 

హెచ్.డి.దేవెగౌడ పూర్తి పేరు హరదనహళ్ళి దొడ్డేగౌడ దేవెగౌడ.1933 మే 18 న మైసూర్ రాజ్యంలోని హోలెనర్సిపుర తాలూకా హరదనహళ్ళి గ్రామంలోని మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన దొడ్డె గౌడ, దేవమ్మ దంపతులకు దేవెగౌడ జన్మించారు. హసన్ లోని ఎల్.వి.పాలిటెక్నిక్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తిచేశారు. అనంతరం కొంతకాలం వ్యవసాయం చేస్తూనే సివిల్ కాంట్రాక్టర్ గా తమ ప్రాంతంలో రోడ్లు, భవనాలు నిర్మించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా వ్యవసాయానికే పరిమితం అయ్యారు.  

దేవెగౌడకి చిన్నతనం నుండే రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. మహాత్మాగాంధీ పట్ల ఆరాధన భావం కల గౌడ  1953లో కాంగ్రెస్ పార్టీలో చేరి రైతు సమస్యలపై పోరాడుతూ హాసన్ ప్రాంతంలో రైతు నాయకుడిగా ఎదిగారు. హోలెనర్సిపురలోని ఆంజనేయ కో-ఆపరేటివ్ సొసైటీకి అధ్యక్షునిగా, హోలెనర్సిపుర తాలూకా డెవలప్‌మెంటు బోర్డు సభ్యుడిగా పనిచేసి ఆ ప్రాంత రైతుల్లో పట్టు సంపాదించారు.

దేవెగౌడ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక 1962లో ఆ పార్టీకి రాజీనామా చేసి, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హోలెనర్సిపుర నుంచి స్వతంత్ర ఎమ్యెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఆతర్వాత అదే నియోజకవర్గం నుంచి వరుసగా 1967,1972,1978,1983,1985ల్లో ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి గౌడ పెద్ద కుమారుడు మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.రేవణ్ణ సైతం ఆ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.  

దేవెగౌడ తొలిసారి ఎమ్యెల్యేగా ఉన్న సమయంలోనే సోషలిస్టు రాజకీయ దిగ్గజం, కర్ణాటక రైతు నాయకులు సంతవేరి గోపాల గౌడ సైతం  ఎమ్యెల్యేగా ఉండేవారు. రాజకీయ పార్టీలకు అతీతంగా గౌరవించబడే గోపాల గౌడ గారి శిష్యరికంలో సోషలిస్టు సిద్ధాంతల పట్ల మక్కువ పెంచుకున్నారు. గోపాల గౌడ తలపెట్టిన రాజకీయ పోరాటాల్లో పాల్గొంటూ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. 1969లో కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడగా మాజీ ముఖ్యమంత్రి నిజలింగప్ప ఆధ్వర్యంలోని కాంగ్రెస్ (ఓ) పార్టీలో వీరేంద్ర పాటిల్, రామకృష్ణ హెగ్డేలతో కలిసి చేరారు. ఆ తర్వాతి కాలంలో వీరు ముగ్గురు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు.

దేవెగౌడ కాంగ్రెస్ (ఓ) పార్టీ తరుపున1972 మార్చి నుండి 1976 మార్చి వరకు, 1976 నవంబరు నుండి 1977 డిసెంబరు వరకు శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా సేవలనందించారు. ఎమర్జెన్సీ కాలంలో (1975-77) ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోరాడి బెంగళూరు కేంద్రకారాగారంలో జైలుశిక్షను అనుభవించారు. 1977లో జనతాపార్టీలో చేరి కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా పాత మైసూరు ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా గౌడ ఎదిగారు.

1977-1989 వరకు జనతాపార్టీలో కీలకమైన నేతగా ఉంటూ మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డేతో కలిసి ఆ పార్టీని కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి దేవెగౌడ కృషి చేశారు. 1983 నుండి 1988 వరకు రామకృష్ణ హెగ్డే నాయకత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్, నీటిపారుదల శాఖల మంత్రిగా పనిచేశారు. 1988లో వీపీ సింగ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పూర్వ జనతా పార్టీ చీలిక పార్టీలను జనతా పార్టీలో కలుపుకొని జనతాదళ్ పార్టీగా అవతరించింది.

 రామకృష్ణ హెగ్డే మంత్రివర్గంలో ఉన్న సమయంలోనే సీఎం కావాలనే లక్ష్యంతో ఎమ్యెల్యేలను సమీకరించారు. అదే సమయానికి ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో చిక్కుకొని హెగ్డే పదవి కోల్పోయారు. హెగ్డే స్థానంలో సీఎం కావడానికి ఏంతో ప్రయత్నించినా సాధ్యపడలేదు. 1989 సార్వత్రిక ఎన్నికల్లో జనతాదళ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో మాస్ లీడర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కర్ణాటక జనతాదళ్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1994 ఎన్నికల్లో జనతాదళ్ ను అధికారంలోకి తీసుకురావడంలో గౌడ కీలకమైన పాత్ర పోషించారు. 1994, డిసెంబర్ 11వ కర్ణాటక రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గౌడ 1996,మే 31 వరకు ఆ పదవిలో ఉన్నారు. తన హయాంలో కర్ణాటక రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కృషి చేశారు. గౌడ హయాంలోనే బెంగళూరులో ఇండస్ట్రియల్ పార్క్స్ కు శంకుస్థాపన జరిగింది.

1996 సార్వత్రిక ఎన్నికల్లో జనతాదళ్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ (కాంగ్రెస్ యేతర, బి.జె.పి.యేతర ప్రాంతీయ పార్టీలతో కలసి)  ప్రభుత్వాన్ని బయట నుంచి కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ లు కీలమైన పాత్ర పోషించారు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ చంద్రబాబును సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించమని కోరినా చంద్రబాబు దేవెగౌడ వైపు మొగ్గుచూపారు. చంద్రబాబు ప్రతిపాదనను లాలూ, కమ్యూనిస్టు నాయకులు బలపరిచారు.
 
దేవెగౌడ 1996 జూన్ 1 న భారతదేశ 11వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1997 ఏప్రిల్ 11 వరకు కొనసాగారు. పి.వి నరసింహారావు తర్వాత దక్షిణాది నుంచి ప్రధానిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.గౌడ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఆయనకు జాతీయ రాజకీయాల్లో గుర్తింపు ఏర్పడింది. అయితే దాణా కుంభకోణంలో దోషిగా తేలిన బీహార్ సీఎం లాలూ జనతాదళ్ పార్టీని చీల్చడంతో గౌడ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. గౌడ స్థానంలో పంజాబ్ కు చెందిన సీనియర్ రాజకీయ వేత్త ఐ.కె.గుజ్రాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

1998 నాటికి జనతాదళ్ క్రమంగా వివిధ చిన్న చిన్న వర్గాలుగా విడిపోయింది, ఇవి ఎక్కువగా బిజూ జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్ , జనతాదళ్ (సెక్యులర్), జనతాదళ్ (యునైటెడ్) లాంటి ప్రాంతీయ పార్టీలుగా మారాయి. దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీలోనికి మధు దండావతే వంటి నాయకులతో పాటు అనేకమంది చేరారు. ఈ పార్టీ విభాగానికి దేవెగౌడ జాతీయ అధ్యక్షుడు అయ్యాడు.

2004 వరకు జాతీయ రాజకీయాల్లో బలంగా ఉన్న జనతాదళ్ (సెక్యులర్) క్రమంగా బలహీనపడుతూ కర్ణాటక రాష్ట్రానికే పరిమితం అయ్యింది. 2005 నుంచి జనతాదళ్ (సెక్యులర్) గౌడ కుటుంబ పార్టీగా మారిపోయింది. 2006లో తన కుమారుడు కుమారస్వామిని సీఎం చేసేందుకు తన రాజకీయ బద్ద వ్యతిరేకి  బి.జె.పితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం గౌడ కుటుంబం మొత్తం  జనతాదళ్ (సెక్యులర్)  పార్టీలోనే కీలక పదవుల్లో ఉన్నారు.

జనతాదళ్ (సెక్యులర్) కుటుంబ పార్టీగా ముద్రపడడటంతో కర్ణాటక ప్రజలకు సైతం ఆ పార్టీ పట్ల ఆసక్తి సన్నగిల్లింది. అయితే గౌడకు రాజకీయ చరిష్మాను చూసి ఇప్పటికి ఆపార్టీకి పాత మైసూరు ప్రాంతంలో పట్టం కడుతున్నారు. గౌడ ఇప్పటి వరకు 8 సార్లు లోక్ సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. గౌడ చిన్న కుమారుడు కుమారస్వామి రెండు సార్లు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.

7 దశాబ్దాల రాజకీయ జీవితంలో గౌడ రైతాంగ సంక్షేమం కోసం ఏంతో కృషి చేశారు. కౌలుదారీ దిగువ వ‌ర్గాల రైతుల‌ సంక్షేమం కోసం కోసం పాటుపడటమే కాకుండా వారి అభ్యున్నతికి కృషి చేశారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఉన్న సమయంలో రైతులకు ఎరువులపై సబ్సిడీలు అందజేయడంతో పాటుగా వారు పండించిన పంటలకు అధిక మద్దతు ధరలు ప్రకటించారు. కావేరి ప్రాంత రైతుల కోసం అనేక పోరాటాలు చేసిన ఘనత సైతం గౌడదే.

తన వద్దకు వచ్చిన ప్ర‌తీవ‌ర్గం వారి స‌మ‌స్య‌ల‌ను ఓపిగ్గా వింటార‌న్న వ్యాఖ్య‌ల‌తో హెచ్.డి.దేవెగౌడను అంద‌రూ భూమి పుత్రుడు లేదా మ‌ట్టి మ‌నిషి అంటుంటారు. శాస‌న‌స‌భ స‌భ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా వ్య‌వ‌హ‌రించిన రోజుల్లో, అసెంబ్లీ మరియు పార్లమెంట్ లైబ్ర‌రీల్లో  ఆయ‌న పుస్త‌క ప‌ఠ‌నంలో లీన‌మ‌య్యేవారు. దీంతోపాటు, చట్టసభల ఔన్న‌త్యాన్ని మ‌రియు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను కాపాడ‌డంలో గౌడ ప్రముఖ పాత్ర పోషించారు. 

సెక్యులరిజం పట్ల దేవెగౌడకు ఎంతో కమిట్మెంట్ ఉందని ఆయన సమకాలీన రాజకీయ నేతలు సైతం తప్పకుండా అంగీకరిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక మంది ముస్లింలను అసెంబ్లీకి పంపిన ఘనత వీరికే దక్కుతుంది. దేశంలో మతత్వానికి వ్యతిరేకంగా అభివృద్ధి, మానవతా విలువలతో రాజకీయాలు నడవాలని కోరుకునే నేతల్లో గౌడ ముందువరుసలో ఉంటారు. జనతాదళ్ పార్టీ చీలిన సమయంలో జనతాదళ్ (యునైటెడ్) భాజపాకు మద్దతుగా నిలవగా గౌడ నేతృత్వంలోని జనతాదళ్ పార్టీ సెక్యులరిజం వాదానికి కట్టుబడి జనతాదళ్ (సెక్యులర్) పార్టీగా మారింది. ఆనాటి నుండి ఈనాటి వరకు తన సెక్యులర్ ముద్రను చెరిపేసుకోవడానికి ఏనాడు సిద్ధపడలేదు. 

ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో రైతు నేతగానే రాజకీయాలు చేస్తూ వచ్చారు దేవెగౌడ. భారతదేశ రాజకీయాల్లో చౌధరి చరణ్ సింగ్, చౌధరీ దేవిలాల్ తర్వాత రైతాంగ విస్తృత ప్రయోజనాల కోసం పాటుపడిన నాయకుడిగా నిలిచారు. రైతులు, సమాజ నిర్మాణానికి పాటుపడే ప్రతి ఒక్క వర్గాన్ని కలుపుకొని రాజకీయంగా ముందుకు వెళ్లిన నాయకుడిగా గౌడ నిలిచారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com