కర్ణాటక కింగ్ పిన్ పొలిటీషియన్-సతీష్ జార్కిహోళి
- June 02, 2025
సతీష్ జార్కిహోళి....కర్ణాటక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు. వ్యాపారవేత్తగా జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టి అనతి కాలంలోనే రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని తమ కుటుంబ పెత్తనం కిందకు తేవడానికి ఎంతో కృషి చేసి విజయం సాధించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య ముఖ్య అనుచరుడిగా రాష్ట్రంలో అనధికారిక పాలనకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు.కర్ణాటక రాజకీయ శక్తివంతుడైన డి.కె.శివకుమార్ సీఎంను కానివ్వకుండా అడ్డుకున్నారు.నేడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మినిష్టర్ సతీష్ జార్కిహోళి మీద ప్రత్యేక కథనం...
సతీష్ జార్కిహోళి అలియాస్ సతీష్ లక్ష్మణ రావ్ జార్కిహోళి 1962, జూన్ 1న కర్ణాటక రాష్ట్రంలోని ఉమ్మడి బెల్గామ్ జిల్లాలో గోకాక్ అనే చిన్న పట్టణంలో సంపన్న వాల్మీకి నాయక్ కుటుంబంలో జన్మించారు. గోకాక్‌లోనే ఉన్న జె.ఎస్.ఎస్ సైన్స్ & కామర్స్ కాలేజీ నుంచి పీయూసీ పూర్తి చేశారు. ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించినప్పటికి తండ్రి వ్యాపారాల్లోకి ప్రవేశించారు. సతీష్ తండ్రి లక్ష్మణ్ రావ్ జార్కిహోళి ప్రముఖ లిక్కర్ కాంట్రాక్టర్‌గా మొదలై ఉత్తర కర్ణాటక ప్రాంతంలో లిక్కర్ సిండికేట్ వ్యాపారాన్ని నిర్వహించేవారు. లిక్కర్ సిండికేట్‌తో పాటుగా షుగర్ ఫ్యాక్టరీ స్థాపించారు.
తండ్రికి చేదోడువాదోడుగా నిలుస్తూ వ్యాపారాన్ని విస్తరించడం మొదలుపెట్టారు. తన సోదరులైన రమేష్, బాలచంద్రలతో కలిసి లిక్కర్ సిండికేట్ మూసేసి సివిల్ కాంట్రాక్ట్స్, షుగర్ పరిశ్రమలు, మైనింగ్ మరియు విద్యాసంస్థల్లోకి తమ వ్యాపారాలను విస్తరించారు.ముఖ్యంగా షుగర్ పరిశ్రమల రంగంలో ఉత్తర కర్ణాటక నుంచి మాండ్య వరకు పదుల సంఖ్యలో పరిశ్రమలు స్థాపించారు.వ్యాపారాల్లో బిజీగా ఉన్న సమయంలోనే సతీష్ రాజకీయాల్లోకి తమ కుటంబ ప్రాబల్యాన్ని పెంచేందుకు నిర్ణయించుకున్నారు.అందులో భాగంగానే తన అన్న రమేష్ జార్కిహోళి కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాను మాత్రం అప్పటి స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు.
1992లో బెల్గామ్ సహకార బ్యాంక్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. తర్వాత కాలంలో ఆ బ్యాంకును తమ కుటుంబ ఆధీనంలోకి తెచ్చారు. 1994లో దేవెగౌడ సమక్షంలో జనతాదళ్ పార్టీలో చేరిన సతీష్, అప్పుడు ఆ పార్టీలో ఉన్న ఇప్పటి కర్ణాటక సీఎం సిద్దరామయ్య గారికి క్రమంగా దగ్గరయ్యారు. జనతాదళ్ ప్రభుత్వంలో నంబర్ టూగా ఉన్న సిద్దరామయ్య వల్లే సతీష్ రాజకీయంగా, వ్యాపార పరంగా లబ్ది పొందుతూ వచ్చారు. 1994 నుంచి 1999 వరకు ఆ పార్టీలోనే కొనసాగారు.1998లో బెల్గామ్ స్థానిక సంస్థల నుంచి కర్ణాటక శాసనమండలికి ఎన్నికయ్యారు. 1999లో దేవెగౌడ జనతాదళ్(సెక్యులర్) పార్టీని స్థాపించిన తర్వాత సిద్దరామయ్యతో కలిసి అందులో చేరారు. ఉత్తర కర్ణాటకలో జనతాదళ్(ఎస్) పార్టీని అన్ని తానై నడిపిస్తూ వచ్చారు.
1999 అసెంబ్లీ ఎన్నికల్లో తన రమేష్ గోకాక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించారు. తన మరో సోదరుడైన బాలచంద్రను సైతం జనతాదళ్(ఎస్)లో చేర్పించారు. 2004లో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో తిరిగి రెండోసారి ఎమ్యెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో తన సోదరులైన రమేష్ (కాంగ్రెస్), బాలచంద్ర(జేడీఎస్)లు ఎమ్యెల్యేలుగా అడుగుపెట్టారు. ఆ మంత్రివర్గంలో సతీష్, బాలచంద్రాలు మంత్రులయ్యారు. 2005లో ధరమ్ సింగ్ ప్రభుత్వం కూలిన తర్వాత బీజేపీతో ఏర్పాటు చేయబోయే సంకీర్ణ ప్రభుత్వంలో సిద్దరామయ్య సీఎం అయ్యేందుకు కావాల్సిన అంగ, ఆర్థిక బలాన్ని సమకూర్చడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలోనే దేవెగౌడ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో 2006 వరకు స్వతంత్రంగా వ్యవహరించారు.
ఇదే దశలో సీఎం పదవిని తనకి కాకుండా తనయుడైన కుమారస్వామికి ఇప్పెంచేందుకు చేస్తున్న తెరవెనుక కుట్రలను నిరసిస్తూ చేసిన ఆరోపణలు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న గౌడ సిద్దరామయ్యని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సిద్దరామయ్య, సతీష్‌లు ఇద్దరు కలిసి తన సోదరుడైన రమేష్ ద్వారా కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపి 2006లో ఆ పార్టీలో చేరారు. మరో సోదరుడు బాలచంద్రను మాత్రం జేడీఎస్‌లోనే కొనసాగించారు. 2006 నుంచి 2008 వరకు సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీలో మద్దతు కూడగట్టేందుకు ఎంతో శ్రమించారు. అదే విధంగా ఉత్తర కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
ఆ తర్వాత 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో గోకాక్ నుంచి వేరై కొత్తగా ఏర్పడ్డ యమకన్‌మార్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఎన్నికల్లో గోకాక్ నుంచి రమేష్, ఆరభావి నుంచి బాలచంద్ర ఎన్నికయ్యారు. కర్ణాటక చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు అసెంబ్లీకి ఎన్నికైన అరుదైన రికార్డ్ వీరి పేరిట నమోదైంది. 2008-13 మధ్యలో రమేష్, సతీష్‌లు కలిసి ఉత్తర కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించారు.
2009లో రాజకీయ వ్యూహాత్మకంగా వ్యవహరించి జేడీఎస్‌లో ఉన్న బాలచంద్రను బీజేపీలోకి పంపించారు. బీజేపీలో వెళ్లిన కొద్దీ రోజులకే బాలచంద్ర మళ్ళీ మంత్రి అవ్వడంతో జిల్లాలో అన్నదమ్ములకు ధైర్యం వచ్చింది. బెల్గామ్ జిల్లా కేంద్రంగా ఉత్తర కర్ణాటకలో తమ కుటుంబానికి బలమైన అనుచర గణాన్ని తయారు చేస్తూ తమ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులైన కట్టి, జోలె, జిగజినాగి కుటుంబాలను దీటుగా ఎదుర్కుంటూ వచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్న సహకార సంస్థలను తమ కుటుంబ పెత్తనంలోకి తెచ్చుకుంటూ కుటుంబ పరపతిని పెంచుకుంటూ పోయారు.
2013 అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ములు మరోసారి ఎన్నికవ్వడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే కాకుండా తన రాజకీయ గురువైన సిద్దరామయ్య సీఎం కావడం సతీష్‌కు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. 2013లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సతీష్ ఉత్తర కర్ణాటక లిక్కర్ వ్యాపారాన్ని తమ కుటుంబ ఆధీనంలోకి తీసుకొచ్చారు. 2013-16 వరకు మంత్రిగా కొనసాగిన తర్వాత తన అన్న రమేష్‌ను మంత్రిని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి తమ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సతీష్ ఎదిగారు. 2018 అసెంబ్లీ తన స్థానం నుంచి పోటీ చేస్తూనే బాదామి నుంచి పోటీ చేసిన సిద్దరామయ్యను గెలిపించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పటికి ఉత్తర కర్ణాటక మీద జార్కిహోళి కుటుంబ పట్టును తెలియజేసింది.
2018-19 వరకు కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలోనే బాలచంద్ర కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఛైర్మన్ బాధ్యతలను చేపట్టడం జరిగింది. కూటమి ఎక్కువ కాలం నిలవదనుకున్న తరుణంలో తన అన్న రమేష్‌ను బీజేపీలోకి పంపించారు. సతీష్ అనుకున్నట్లే ప్రభుత్వం పడిపోయి బీజేపీ నేత యడ్యూరప్ప సీఎం కావడంతో పాటుగా రమేష్ ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సోదరులిద్దరూ బీజేపీలో కీలకంగా ఉండగా, సతీష్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టారు.
2023 ఎన్నికల్లో ఉత్తర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలిపించి, సిద్దరామయ్య రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. సిద్దు మంత్రివర్గంలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం వరకు కొనసాగుతున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో చిక్కొడి లోక్ సభ నుంచి తన కుమార్తె ప్రియాంకను గెలిపించుకున్నారు. తన కుమార్తె విజయంలో సతీష్ సోదరులైన రమేష్, బాలచంద్రలు కీలక పాత్ర పోషించారు.
సతీష్ జార్కిహోళి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య రాజకీయ వైరం గత కోనేళ్ళుగా కొనసాగుతుంది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్గామ్ రూరల్ లక్ష్మీ హెబ్బాల్కర్ ద్వారా ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్న దాన్ని సతీష్ తీవ్రంగా నిరసించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య రాజకీయ వైరం మొదలైంది. ఈ వైరం వల్ల సతీష్ ఆర్థికంగా బలవంతుడవ్వడానికి తోడ్పడింది. ముఖ్యంగా తమ వ్యాపార సామ్రాజాన్ని ఉత్తర కర్ణాటక నుంచి మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తూ ముందడుగు వేశారు. డీకే సైతం రాజకీయంగా శక్తివంతమైన నేతగా ఎదిగినప్పటికి తన లక్ష్యమైన సీఎం పదవి దక్కలేదు.
డీకేకు సీఎం పదవి దక్కకుండా సతీష్ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తూ ఉంటారు అని ఆ పార్టీ నేతలే చెబుతుంటారు. ఒకవేళ డీకే సీఎం అయితే ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఇన్నాళ్ళుగా పెత్తనం చెలాయిస్తున్న జార్కిహోళి కుటుంబాన్ని రాజకీయంగా అణిచివేయడమే లక్ష్యంగా చేసుకుంటాడనే భయం సతీష్‌లో ఉంది. ఆ భయం వల్లే డీకే సీఎం కాకుండా ఉండేందుకు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని, మరీ పరిస్థితి చేయి దాటిపోతే కాంగ్రెస్ పార్టీని చీల్చి తన మద్దతుదారు ఎమ్యెల్యేలతో కలిసి బీజేపీలోకి వెళ్లే ఆలోచన కూడా ఆయనకి ఉందని ఆ రాష్ట్ర వ్యవహారాలను పరిశీలించే విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సతీష్‌కు సిద్ధాంత భావజాలం కంటే తమ కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం. ఆయనకే కాదు బీజేపీలో ఉన్న ఆయన సోదరులది అదే బాట. ప్రజా క్షేత్రంలో సోదరులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నా, వ్యక్తిగతంగా మాత్రం చాలా ఆత్మీయంగా ఉంటారు. ఐదుగురు సోదరుల్లో రెండో వాడైన సతీష్ జార్కిహోళి మాటకు ఎంతో విలువిస్తారు. సిద్దరామయ్య ద్వారా కర్ణాటక ప్రభుత్వాన్ని తెరవెనుక శాసిస్తున్న సతీష్ జార్కిహోళి ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూ స్థానం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!