హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం...ఆరుగురు అరెస్ట్

- June 02, 2025 , by Maagulf
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం...ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కేసు సంచలనం రేపుతోంది. ఈసారి కూకట్‌పల్లి పరిధిలో డ్రగ్స్ ముఠా పట్టుబడి కలకలం సృష్టించింది. స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) పోలీసులు పక్కా సమాచారంతో దాడికి దిగారు.అద్దంకి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో మకాం వేసి డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డారు. SOT పోలీసులు జరిపిన ఆకస్మిక దాడిలో మొత్తం ఆరుగురు నిందితులు పోలీసుల చేతికి చిక్కారు.ఈ ముఠా నుంచి పోలీసులు 800 గ్రాముల హెరాయిన్‌, ఎపిడ్రిన్‌, 5 మొబైల్ ఫోన్లు, రూ. 50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో పోలీస్ డిపార్ట్మెంట్‌కు చెందిన ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు సమాచారం. అతను తిరుపతికి చెందినవాడిగా గుర్తించబడినప్పటికీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్‌లోనూ మరో డ్రగ్స్ రాకెట్‌
ఇక మరోవైపు, సికింద్రాబాద్‌లో కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను టీఎస్ నాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా దేశానికి చెందిన ఇమాన్యుయల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఈ నైజీరియన్ వ్యక్తి దగ్గర నుంచి 150 గ్రాముల కొకైన్‌తో పాటు ఎక్స్టెసీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ రెండు కోట్ల రూపాయలకుపైగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. చదువు పేరుతో ఇండియాకు వచ్చిన ఇమాన్యుయల్, వస్త్రాల ఎగుమతి పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

వస్త్రాల వ్యాపారం కవర్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్
వాస్తవానికి వస్త్రాల ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ కవర్ పెట్టుకొని, పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేశాడు. నెల రోజుల వ్యవధిలోనే కోటి రూపాయల విలువైన డ్రగ్స్ అమ్మినట్లు సమాచారం. భారత్ మరియు నైజీరియా మధ్య అనేకసార్లు ప్రయాణించి డ్రగ్స్ రవాణా చేశాడని అధికారులు తెలిపారు.ఈ సంఘటనలతో మరోసారి హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వ్యాప్తి భయానక స్థాయికి చేరిందని స్పష్టమవుతోంది. ఎస్‌ఓటీ, టీఎస్ నాబ్ బృందాలు డ్రగ్స్ ముఠాలపై కఠినంగా నజర్ పెట్టాయి. యువతను డ్రగ్స్ నుంచి దూరం ఉంచే చర్యలు అవసరమన్నది స్పష్టమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com