గాన గంధర్వుడు-ఎస్పీబి

- June 04, 2025 , by Maagulf
గాన గంధర్వుడు-ఎస్పీబి

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చెబితే ఇప్పటికీ ప్రేక్షకుల మది పులకరించిపోతుంది. ఇండస్ట్రీలో ఎంత మంది సింగర్స్ ఉన్నా ఆయన స్థానాన్నిఎవరు భర్తీ చేయలేరు. ఐదు దశబ్దాల సినీ కెరీర్లో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలు కేవలం గాయకుడు మాత్రమే కాదు నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా అలరించారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...

ఎస్పీబి అలియాస్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పూర్తి పేరు శ్రీపతి పండితరాధ్యుల బాలసుబ్రమణ్యం.1946, జూన్ 4న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త  నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణంలో వీరశైవ ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ప్రముఖ హరికథకుడు శ్రీపతి పండితరాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం నెల్లూరులోనే సాగింది. బాలసుబ్రహ్మణ్యం అనంతపురం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ సీటు వచ్చినప్పటికీ వ్యక్తిగత కారణాలతో మద్రాస్ లో  ఎ.ఎం.ఐ.ఇ పూర్తి చేసి ఇంజినీర్ హోదా అందుకున్నారు.

1966లో ప్రముఖ నటుడు, నిర్మాతగా రాణించిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకునిగా జీవితం ప్రారంభించాడు. ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్‌కు “కోదండపాణి ఆడియో ల్యాబ్స్” అని పేరే పెట్టుకున్నాడు. చాలా మంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు.

పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా, ఏక్ తుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు ఆయన పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. చిత్ర పరిశ్రమలో స్వర రారాజుగా వెలుగుతున్న దశలోనే మన బాలు గారు 40 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించి, 11 భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే అరుదైన రికార్డును సృష్టించారు.

బాలు గారికి ఎటువంటి శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకుండానే గాయకుడిగా సినీరంగ ప్రవేశం చేసి ఎన్నో మరుపురాని పాటలను అందించారు.  బాలు 1969లో మొదటిసారిగా పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైన చిత్రాల్లో నటించారు.

బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమినీ గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేశాడు. ఆయన సినిమాల్లోనే కాక టీవీ రంగంలో కూడా పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎందరో నూతన ఔత్సాహిక గాయనీ గాయకులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో సైతం తన గాన మాధుర్యాన్ని వినిపించారు.

బాలు ఒక రోజులో అత్యధిక పాటలు పాడిన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. కన్నడ స్వరకర్త ఉపేంద్ర కుమార్ కోసం 12 గంటల్లో 21 పాటలను రికార్డ్ చేశారు. ఒక రోజులో 19 తమిళ పాటలు, హిందీలో ఒక రోజులో 16 పాటలను రికార్డ్ చేశాడు. 'కెళది కన్మణి' చిత్రం కోసం 'మన్నిల్ ఇంత' అనే పాటలో ఊపిరి తీసుకోకుండా పాడిన పాటలు అందరినీ అలరించాయి.

బాలసుబ్రహ్మణ్యం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ చిత్రా ల్లో పనిచేశారు. భారతదేశ అత్యున్నత పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులు మరియు ఎన్టీఆర్ జాతీయ అవార్డు వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులతో పాటుగా సన్మాన సత్కారాలు అందుకున్నారు. ఇళయరాజా మరియు రెహమాన్‌లతో కలిసి  సుదీర్ఘ కాలం పనిచేయడంతో వారి ఆస్థాన గాయకుడిగా ప్రసిద్ధి చెందారు.

‘‘నాకు మ్యూజిక్ తెలియదు. స్వరాల గురించి నేను రాసుకుంటూ వాటి గురించి లెక్కలు వేసుకుంటూ నేర్చుకుంటాను. 50 ఏళ్ల పాటు నాకు అస్సలు అర్థం కాని క్లాసికల్ పాటలను నాతో పాడించారు. చిన్నపిల్లలు చాలా బాగా ట్రైనింగ్ తీసుకొని నా ముందు వచ్చి పాడతారు. అసలు వాళ్లను నేను జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఒక్కొక్కసారి వాళ్లు ఏ రాగంలో పాడుతున్నారని వాళ్లనే అడిగి తెలుసుకుంటాను’’ అని బాలు పేర్కొన్నారు. సంగీత ప్రియులను అలరిస్తూ ఉన్న సమయంలోనే కరోనా బారిన పడి 2020, సెప్టెంబర్ 25న తన 74వ ఏట చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో కనుమూశారు. బాలు గాత్రం అజరామరం, సంగీత ప్రపంచం ఉన్నంతవరకూ బాలు ఉంటాడు, పాట ఉన్నంతవరకూ బాలు ఉంటాడు, మనం పాటలని పాడుకునే అంతవరకూ బాలు ఉంటాడు. ఆయన పాడిన పాటలోని లిరిక్స్ నే ఆయనకి అంకితం ఇస్తూ “బాలు… పాటగా బ్రతకవా మా అందరి నోటా”

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com