ఆర్బీఐ: తగ్గనున్న గృహ,ఇతర రుణాల ఈఎంఐలు

- June 06, 2025 , by Maagulf
ఆర్బీఐ: తగ్గనున్న గృహ,ఇతర రుణాల ఈఎంఐలు

ముంబై: భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్సాహపరిచేలా కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్లు (0.50%) తగ్గించి 5.5 శాతంగా ప్రకటించింది. ఈ నిర్ణయం దేశంలోని కోటి మంది రుణ గ్రహీతలకు, ముఖ్యంగా గృహ రుణాలు తీసుకున్నవారికి పెద్ద ఊరటగా మారనుంది. ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలిక రుణాలు, ముఖ్యంగా గృహ రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం తగ్గే అవకాశం ఉంది.

రుణ భారాన్ని తగ్గించే మార్గం
రుణాలు తీసుకున్నప్పుడు బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటు ప్రాథమికంగా ఆర్బీఐ నిర్ణయించే రెపో రేటుపై ఆధారపడుతుంది. ఈ నిర్ణయం రుణగ్రహీతలకు, ప్రత్యేకించి ఇల్లు కొనాలనుకునే వారికి పెద్ద ఊరటనిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దీని ఫలితంగా గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) తగ్గుముఖం పడతాయి. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచి, ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.

వృద్ధి ప్రోత్సాహానికి దోహదం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, భారత్ లోని అంతర్గత వాణిజ్యం, ఉపభోగ సామర్థ్యం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి రెండు నెలలకోసారి జరిగే ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిరేటు అంచనాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలపై లోతైన చర్చ జరిగిన అనంతరం వడ్డీ రేట్ల తగ్గింపునకు కమిటీ సభ్యులందరూ ఆమోదం తెలిపారు. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఆర్బీఐ గవర్నర్ విశ్లేషణ
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఇంకా కొంత బలహీనంగానే ఉందని, ప్రపంచ వాణిజ్య అంచనాలను కూడా తగ్గించారని గుర్తుచేశారు. అయినప్పటికీ, భారతదేశం వేగంగా వృద్ధి చెందుతూనే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

“భారతదేశ ఆర్థిక బలానికి ఐదు కీలక రంగాల్లోని పటిష్టమైన ఆర్థిక స్థితిగతులే కారణం. భారత ఆర్థిక వ్యవస్థ స్థానిక, విదేశీ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలను అందిస్తోంది. మనం ఇప్పటికే వేగంగా అభివృద్ధి చెందుతున్నాం, భవిష్యత్తులో మరింత వేగంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాం” అని గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరించారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక ప్రగతికి మరింత దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com