ఏరువాక పున్నమి....!
- June 11, 2025
మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశ ప్రగతి మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన దేశంలో ఎన్నటికీ రైతే రాజు. అలాంటి అన్నదాతలకు ప్రత్యేకమైన పండుగ ఒకటుంది. అదే ఏరువాక పౌర్ణమి. సాధారణంగా మనం మత సంబంధమైన పండుగలు, జాతీయ పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు వంటివి ఎన్నో చేసుకుంటూ ఉంటాము. కానీ రైతులకు మాత్రమే ప్రత్యేకమైన ఓ పండుగ ఉంది. 'ఏరువాక పున్నమి' పేరిట జరుపుకునే ఈ పండుగ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
నాగరికత ఎంత ముందుకు సాగినా.. సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా.. నాగలి లేనిదే పని జరగదు.. దుక్కి దున్నందే తినడానికి తిండి కూడా దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు, పట్టెడన్నం పుట్టదు.. జాతికి వెన్నెముకగా నిలిచిన రైతన్నలు జరుపుకొనే పండుగనే ఏరువాక పున్నమి.. ఇంతటి ప్రత్యేకతలు ఉన్న ఈ వేడుకను ఘనంగా జరుపుకొనేందుకు పల్లెలు సిద్ధమయ్యాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి.. పంటలు బాగా పండాలని పిండి వంటలతో దేవతామూర్తులకు నైవేద్యాలు సమర్పించేందుకు సిద్ధమవుతారు.
హిందూ సంప్రదాయంలో ప్రతి తెలుగు మాసంకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతినెలలో సైతం పండగలు ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం జ్యేష్టమాసం నడుస్తుంది. మనం ఈసారి ఏరువాక పున్నమిని జూన్ మాసం 11 వ తేదీన జరుపుకోబోతున్నాం. దీన్ని జ్యేష్టపౌర్ణమి అని కూడా పిలుస్తారు. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి రోజును వేడుకగా జరుపుకుంటారు.
రైతన్న ఆనందంగా ఉంటే.. దేశం అంతా బాగుంటుంది. రైతన్న దేశ ప్రజల ఆకలిని తీరుస్తాడు. అదే విధంగా…ఏరువాక మీద పాటలు కూడా ఉన్నాయి.. ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా… అనే గేయం. ఈ సమయంలో ఆకాశం నుంచి చిరుజల్లులు పడుతాయని అనాదీగా విశ్వసిస్తుంటారు.
ఈ రోజున మట్టిని నమ్మి కష్టించి పని చేసే రైతులు భూమి పట్ల, సమస్త ప్రకృతి పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకుంటూ తమకు వ్యవసాయంలో చేదోడుగా ఉండే ఎద్దులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, రకరకాల గజ్జెలు, గంటలు, పూసల దండలతో, పూల దండలతో సర్వాంగసుందరంగా అలంకరిస్తారు. అనంతరం పొంగలి ప్రసాదాలతో, మంగళ వాయిద్యాలతో పొలాలకు ఊరేగింపుగా వెళ్లి అంగరంగ వైభవంగా పొలం దున్నడం ప్రారంభిస్తారు.
అదే రోజు సాయంత్రం గ్రామంలో ఊరి ముంగిట గోగు నారతో చేసిన తోరణాలను కడతారు. ఈ తోరణాల మధ్యలో అక్కడక్కడా జిలేబీలు, గారెలు, కరెన్సీ కాగితాలు ఎత్తులో కడతారు. దీనినే 'ఏరువాక తోరణం' అని అంటారు. రైతులు తమ తమ పశువులను ఈ ఏరువాక తోరణం కిందుగా పరుగులు పెట్టిస్తారు. అప్పుడు వారు ఏరువాక తోరణం నుంచి తమకు దొరికిన వాటిని తీసుకు వెడతారు. దీనిని వారు అత్యంత పవిత్రంగా భావించి తమ పొలాల్లో, ధాన్యాగారంలో దాచి ఉంచుతారు. అలా చేయడం వలన పంటలు సమృద్ధిగా పండి కరువు ఉండదని రైతుల విశ్వాసం.
ఏరువాక పున్నమి పండుగ ఒక్క అన్నదాతకు మాత్రమే కాదు. మనందరికీ ముఖ్యమైన పండుగే! ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశమంటే మనమందరం కదా! అందుకే ఈ పండుగ మనందరికీ కూడా పండుగే! ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరం ఏరువాక పౌర్ణమి పండుగను ఆనందంగా జరుపుకుందాం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!