ప్రపంచ ఆరోగ్యానికి యోగా దిక్సూచి: వెంకయ్య నాయుడు

- June 20, 2025 , by Maagulf
ప్రపంచ ఆరోగ్యానికి యోగా దిక్సూచి: వెంకయ్య నాయుడు
హైదరాబాద్: విశ్వమంతా పరిపూర్ణ ఆరోగ్యంతో, శాంతితో ముందుకు సాగాలన్నదే యోగ దినోత్సవ సంకల్పమని, మనమంతా ఇదే సంకల్పాన్ని తీసుకుని వసుధైవ కుటుంబ భావనతో ముందుకు సాగాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. 
 
శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శాఖ జి.కిషన్ రెడ్డి  ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ"ఒకే భూమి... ఒకటే ఆరోగ్యం కోసం యోగ" అనే సంకల్పంతో ఈ ఏడాది యోగ దినోత్సవాన్ని జరుపుకోవడం యోగ దినోత్సవంలోని అసలైన అంతరార్థాన్ని ఆవిష్కరించుకోవడమేనన్నారు. ప్రపంచ ఆరోగ్యానికి యోగా దిక్సూచి అన్నారు.
 
"భారత దేశం మీద జరిగిన విదేశీ దాడులు...మన సంపదలను హరించడమే కాకుండా... మన కళలను, శాస్త్రాలను మన నుంచి దూరం చేసే ప్రయత్నాలు బలంగా చేశాయి. యోగ శాస్త్రం కనుమరుగు అవుతోందా అనుకుంటున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది." అని చెప్పారు.
 
అంతర్జాతీయ యోగ దినోత్సవం స్ఫూర్తితో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యోగ మార్గాన్ని సాధన చేస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. వి దేశీయులంతా యోగ మార్గాన్ని తలకెత్తుకుని ముందుకు సాగుతుంటే, ఈ నేల మీద పుట్టిన మనం యోగ మార్గానికి ఇంకెంత గౌరవం ఇవ్వాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉత్తమ సాధనమైన యోగాకు కుల మతాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. 
 
ఆరోగ్యం అంటే శారీరకమైనదే కాదు, మానసికమైంది కూడా అని చెబుతూ యోగా వల్ల ఈ రెండూ సిద్ధిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగ శాస్త్రాన్ని మానవాళికి పరిచయం చేసిన పతంజలి మహర్షిని స్మరించుకోవడం మన ధర్మం అని వెంకయ్య నాయుడు అన్నారు. వారు అక్షరబద్ధం చేసిన “పతంజలి యోగ సూత్రాలు” సర్వకాలాలకు ఆచరణీయమైనవి అని స్పష్టం చేశారు. “యోగః  |  చిత్త వృత్తి  |  నిరోధః”  |  అని పతంజలి మహర్షి తెలియజేశారని అన్నారు. 
 
యోగ అంటే చిత్త, వృత్తులను నిగ్రహించడమే అని దీని భావమని చెప్పారు.చిత్తం అంటే మనసు, వృత్తి అంటే చేసే పని అని తెలిపారు. అభ్యాసం, వైరాగ్యం ద్వారానే చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమౌతుందని పెద్దలు చెబుతారని, అభ్యాసం అంటే అవసరమైనది నేర్చుకోవడం, వైరాగ్యం అంటే అనవసరమైన దానిని విడిపెట్టడం అని పేర్కొన్నారు. అది శారీరకంగా కావచ్చు.మానసికంగా కావచ్చు అన్నారు.ఇప్పుడు ఎందరో మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ విషయాలను పతంజలి మహర్షి చెప్పడమే కాదు, మన పెద్దలు ఆచరణలో చూపించారని చెప్పారు. కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,
 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తదితరులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com