గోదావరి రాజకీయ దిగ్గజం - దండు శివరామరాజు
- June 23, 2025
దండు శివరామరాజు ... మచ్చలేని రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన నాయకుడు. లేమి గల కుటుంబం నుంచి వచ్చినప్పటికి తన స్వశక్తితో ఉన్నత స్థానానికి చేరుకున్నారు రాజు గారు. గాంధేయవాది మూర్తిరాజు శిష్యరికంలో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆయన అన్న గారి పిలుపుతో తెలుగుదేశం బాధ్యతలను భుజానవేసుకొని పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీని విజయతీరాలకు చేర్చారు. దేవాదాయ భూములను అన్యాక్రాంతం కాకుండా కఠినమైన చట్టాలను తెచ్చిన ఘనత ఆయనదే! ఎమ్యెల్యేగా, ఎమ్యెల్సీగా, మంత్రిగా ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించారు. నేడు గోదావరి రాజకీయ దిగ్గజం స్వర్గీయ దండు శివరామరాజు గారి మీద ప్రత్యేక కథనం..
దండు మాస్టార్ లేదా దేవుడు రాజు గారని పిలుచుకునే దండు శివరామరాజు 1936, జులై 14న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర తాలూకా పొలమూరు గ్రామంలో దిగువ మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన దండు వెంకట్రాజు, సుభ్రదమ్మ దంపతులకు జన్మించారు. అదే గ్రామంలో ఎస్ఎస్ఎల్‌సీ వరకు చదువుకున్నారు. పై చదువులు చదవడానికి ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో ఎస్ఎస్ఎల్‌సీ తర్వాత చదవలేకపోయారు. అయితే, చిన్నతనం నుంచి విద్యాభ్యాసంతో పాటు క్రీడలపై ఆయనకు ఆసక్తి ఎక్కువ! కబడ్డీ, షాట్‌పుట్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ లాంటి క్రీడల్లో ప్రావీణ్యం సాధించారు.
క్రీడలపై ఉన్న మక్కువతో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ పూర్తి చేసి పీఈటీ ఉద్యగంలో చేరారు. తాడేపల్లిగూడెం దగ్గర్లోని గణపవరంలో స్థాపించిన బాపిరాజు ధర్మ విద్యా సంస్థల్లో పీఈటీగా చేరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోచాలా ఎక్కువ కాలం పనిచేశారు. అనపర్తి, అమలాపురం, కోమరగిరిపట్నం, రాజోలు ప్రాంతాల్లో పనిచేసిన తర్వాత ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(పీఈడీ)గా పదోన్నతి అందుకున్నారు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే విద్యా సంస్థల వ్యవస్థాపకుడైన మూర్తిరాజు గారు వీరిలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతను అప్పగించారు. సెక్రెటరీ & కరెస్పాండెంట్‌గా విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేశారు.
బాపిరాజు విద్యా సంస్థల నిర్వహణలోనే ఉన్నప్పుడే మూర్తిరాజు గారి వద్ద రాజకీయ ఓనమాలు దిద్దారు. 1972లో వచ్చిన ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్యెల్సీ ఎన్నికల్లో మూర్తిరాజు గారి అభ్యర్థిగా బరిలోకి దిగి ఘనవిజయం సాధించారు. 1978లో సైతం అదే స్థానం నుంచి రెండోసారి కూడా భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. ఎమ్యెల్సీగా మండలిలో ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు, వేతన కష్ఠాలు తీరేందుకు తనవంతు కృషి చేశారు. 1984లో ఎన్టీఆర్ మండలి రద్దు చేయడాన్ని తీవ్రంగా నిరసించిన వారిలో శివరామరాజు గారు కూడా ఉన్నారు.
మండలి రద్దైన తర్వాత బాపిరాజు విద్యాసంస్థల బాద్యతల్లోనే నిమగ్నమై ఉన్న దశలోనే అప్పటి టీడీపి నేత ఎర్ర నారాయణ స్వామి గారి ద్వారా పార్టీలో చేరమని ఎన్టీఆర్ ఆహ్వానం పలికారు. మొదట పార్టీలో చేరేందుకు నిరాకరించినప్పటికి మూర్తిరాజు గారి సలహా మేరకు విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతల నుండి వైదొలిగి 1988లో ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోచేరారు. పార్టీలో చేరిన నాటి నుండి చివరి శ్వాస వరకు పార్టీయే ప్రాణంగా బ్రతికారు. 1995-99 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జిల్లా కేంద్రమైన ఏలూరులో పార్టీకి సొంత కార్యాలయ భవనాన్ని నిర్మించారు. 1999 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరియు కార్యనిర్వాహక ప్రచార కార్యదర్శిగా పనిచేశారు.
1989 ఎన్నికల్లో అప్పటి అత్తిలి సిట్టింగ్ శాసనసభ్యుడు వేగేశ్న కనకదుర్గ వెంకట సత్యనారాయణరాజు గారి అనారోగ్యం కారణంగా అయన స్థానంలో శివరామరాజు గారు తెదేపా నుంచి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు మీద విజయం సాధించారు. 1989-94 మధ్యలో అసెంబ్లీలో పార్టీ విప్ బాధ్యతల్లో కొనసాగారు. 1994 ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం అత్తిలిలో మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు చేతిలో ఓటమి పాలయ్యారు.1998లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా బాపిరాజు ఎన్నికైన తర్వాత వచ్చిన అత్తిలి ఉప ఎన్నికలో గెలిచి తిరిగి రెండోసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1999 ఎన్నికల్లో అత్తిలి నుంచి భారీ మెజారిటీతో మూడోసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో దేవాదాయ & ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
దేవదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ శాఖ ప్రక్షాళనకు నడుం బిగించారు. సిబ్బందిలో జవాబుదారీ తత్వం పెంచడంతో పాటు ఆలయ ఆస్తుల పరిరక్షణపై శివరామరాజు గారు ప్రధానంగా దృష్టిపెట్టారు. తిరుపతి దేవస్థానానికి సామాన్య భక్తునిగా మారువేషంలో వెళ్లి అక్కడ తితిదేకు చెందిన పై అధికారులు & సిబ్బంది పనితీరును పరిశీలించారు. అప్పట్లో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. 2002లో వచ్చిన గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని రూ.25 కోట్లతో గోదావరి పరివాహన ఉన్న దేవాలయాలను సుందరంగా తీర్చిదిద్ది పుష్కరాలను విజయవంతం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది.
ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు చెందిన సుమారు 2.68 లక్షల ఎకరాల భూములు నుంచి కేవలం రూ.18 కోట్ల ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి సమకూరేది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆలయాల చెందిన భూముల వ్యవహారాలను కదలించారు. దేవాదాయ భూముల కౌలుదారుల చట్టంలో సవరణలు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలకు ఎన్నో అవరోధాలు ఎదురైనప్పటికి ధైర్యంగా ముందుకు సాగి చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. ఐదారు బస్తాలతో నడిచే దేవాదాయ భూముల కౌలుని 27 బస్తాలకు పెంచడంలో శివరామరాజు గారి ప్రయత్నం ఫలించింది. చట్టంలో తెచ్చిన మార్పుల వల్ల ప్రభుత్వానికి దాదపు రూ.500 కోట్ల ఆదాయం సమకూరుతూ వచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలోని దేవాదాయ భూములు అన్యక్రాంతం కాకుండా ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి వెనుకడుగు వేసేవారు కాదు. ఆలయాలకు దాతలు ఇచ్చిన భూములను కాపడటానికి ఎటువంటి రాజీపడే స్థితి రాకుండా, ఆ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రత్యేక జీవో తీసుకువచ్చారు. సేద్యానికి పనికిరాని భూములు అవసరమైతే అమ్మి దాని ద్వారా వచ్చిన సొమ్మును ఆయా ఆలయాల పేరిట బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి ధూప, దీప నైవేద్యాలకు ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖను శివరామరాజు గారు నిర్వహించినంత సమర్థవంతంగా మరెవరు నిర్వహించలేదని ఆ శాఖ అధికారులే బహిరంగంగా ఒప్పుకున్నారు.
పన్నెండేళ్ళ పాటు అత్తిలి ఎమ్యెల్యేగా పనిచేసిన శివరామరాజు గారు నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అత్తిలి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం గావించారు. రూ. 1 కోటి 20 లక్షలతో యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెన నిర్మించారు. అలాగే, పిప్పర వద్ద యనమదుర్రు డ్రెయిన్‌పై కూడా నూతన వంతెన నిర్మాణానికి కృషిచేశారు. కట్టవపాడు, గణపవరం, కోముట్లపాలెం, వాకపల్లి తదితర గ్రామాల్లో ఫుట్‌పాత్ వంతెలను నిర్మించారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో అప్పటి రాష్ట్ర సీఎం జలగం వెంగళరావు ద్వారా రూ.1 కోటి 30 లక్షలు మంజూరు చేయించి వెంకయ్య వయ్యేరు కాలువ మరమ్మతులు చేయించారు.
ఎమ్యెల్యేగా ఎన్నికైన మొదటిసారి వచ్చిన తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అప్పటి ప్రధానీ విపి సింగ్‌ను కలిసి పంటల బీమా, నష్టపరిహరం ఇప్పించారు. పెంటపాడు - మార్టేరు స్టేట్ హైవే నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.32 కోట్లు మంజూరు చేయించారు. స్వజలధార, డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు, జన్మభూమి కార్యక్రమం కింద పలు అభివృద్ధి కార్యక్రమాలు, విద్యుత్ సబ్ స్టేషన్స్ నిర్మాణం చేయించారు. స్వచ్ఛత, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఆయన నియోజకవర్గవ్యాప్తంగా దాదాపు 200 సాముహిక మరుగు దొడ్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించి రాష్ట్రస్థాయిలో అత్తిలికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.
2004 అసెంబ్లీ ఎన్నికల్లో అత్తిలి నుంచి ఐదోసారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీరంగనాథ రాజు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో రెండోసారి ఓడిపోయారు. 2006లో మళ్ళీ శాసనమండలి పునః ఏర్పాటు అయిన వచ్చిన ఉపాధ్యాయ ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అత్తిలిని రద్దు చేయడంతో పాటుగా అనారోగ్యం, వయోభారం కారణంగా క్రియాశీలక రాజకీయాల నుంచి విరమణ పొందారు. అత్తిలి నియోజకవర్గం నుంచి ఎన్నికైన చివరి మంత్రిగా చరిత్రకెక్కారు.
అధికార పక్షం లేదు.. విపక్షం లేదు. ప్రజాసమస్యల పరిష్కారంలో దండు శివరామరాజు ఎంతటి వాడినైనా నిలబెట్టేస్తారు అనుకున్నది సాధించుకొస్తారు. జిల్లా వాసులని ఎవరిని కదలించినా శివరామరాజు గురించి చెప్పేమాట ఇదే. వ్యక్తిగతంగా కోపిష్టిగా కనబడే రాజు గారికి కోపం వచ్చి కేకలు వేసినా మరుక్షణం పాల పొంగులా కోపం కరిగిపోతుందని అనుచరులు, అభిమానులు చెబుతుంటారు. మంత్రిగా ఉన్న సమయంలో పనిచేయని అధికారులు నిలదీయడం, దులిపివేయడం ఆయన నైజం. పదవిలో ఉన్నా లేకపోయినా గ్రామగ్రామాన తిరగడం, కార్యకర్తలను ప్రజలను కలుసుకోవడం అతని విలక్షణ శైలి. మోటర్‌సైకిల్, సైకిల్, పాదయాత్ర సంస్కృతిని మొట్టమొదట శివరామరాజు గారు ప్రవేశపెట్టారంటే అతిశయోక్తికాదు.
శివరామరాజు గారు తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుండి చివరి వరకు ఆ పార్టీ కోసం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేశారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుతోనే ఆయన ప్రయాణం ఎక్కువగా సాగింది. బాబు గారు అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేసేవరకు నిద్రపోయేవారు కాదు. వృత్తిరీత్యా డ్రిల్ మాస్టర్ అయిన ఆయన ఆధ్వర్యంలో అప్పటి పార్టీ మహానాడుల్లో జరిగే డ్రిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. ఎన్టీఆర్ సైతం తన వయస్సును లెక్కచేయకుండా రాజు గారి ఆధ్వర్యంలో జరిగే డ్రిల్స్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన ఆయన యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించారు. మాజీ రాజ్యసభ ఎంపీ తోట సీతామహాలక్ష్మీ, మాజీ మంత్రులైన పీతల సుజాత, తానేటి వనితలు మరియు ఎందరో ఉన్నారు.
శివరామరాజు గారు గొప్ప వితరణశీలి. తన ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన డబ్బుతో కొన్న భూములను, వంశ పారంపర్యంగా వచ్చిన భూములను దానం చేశారు. హైదరాబాద్ నగరంలో ఆయనకున్న మూడున్నర ఎకరా భూమిలో ఒక ఎకరం తెలుగుదేశం పార్టీకి, మిగిలిన భూమిని మియాపూర్ ఓల్డేజ్ హోంకు ఇచ్చారు. తన పేరిట ఉన్న 11 ఎకరాల భూమిలో 9 ఎకరాలను బువ్వనపల్లి గ్రామంలో ఉన్న ఉమా మార్కెండేయస్వామి ఆలయానికి, పోలమూరు గ్రామంలోని ఉమామార్కండేయస్వామి ఆలయానికి, అత్తిలిలో కొలువై ఉన్న వల్లీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి మరియు ఇతర ప్రాయోజిత కార్యక్రమాలకు దానం చేశారు. మిగిలిన రెండు ఎకరాల్లో కూడా ఒక ఎకరాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మిత్రునికి ఇచ్చారు.
నాలుగు దశాబ్దాల పాటుగా రాజకీయ ప్రయాణాన్ని సాగించిన శివరామరాజు గారు అవినీతి మకిలి అంటని స్వచ్ఛమైన నాయకుడిగా చివరి వరకు నిలిచారు. సంతానం లేని తనకు అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించాల్సిన అవసరం లేదని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఎన్నికల్లో గెలవడం కోసం విపరీతంగా డబ్బు ఖర్చు చేయడాన్ని ఎప్పుడు నిరసించేవారు. అయితే 2004లో తన ప్రత్యర్థి వెదజల్లిన డబ్బుల కారణంగానే ఓడిపోయారు. రాజుగారు రాజకీయాల్లో అజాతశత్రవు ! స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి కావాల్సిన పనులు చేసిపెట్టేవారు. జీవిత చరమాంకం వరకు ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన దండు శివరామరాజు గారు అనారోగ్యంతో బాధపడుతూ 2010, నవంబర్ 14న మందలపర్రులోని తన స్వగృహంలో కన్నుమూశారు. రాజు గారు మరణించి రెండు దశాబ్దాలు కావొస్తున్నా, అభివృద్ధి రాజకీయాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!