కెమికల్‌ ఫ్యాక్టరీ ప్రమాదంలో 42కి చేరిన మృతుల సంఖ్య

- July 01, 2025 , by Maagulf
కెమికల్‌ ఫ్యాక్టరీ ప్రమాదంలో 42కి చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్: తెలంగాణలోని పశమైలారంలోని సిగాచీ కెమికల్ పరిశ్రమలో సోమవారం సంభవించిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది.ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేడు సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య 42కి చేరింది. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం రాత్రి వరకు 12గా ఉన్న మృతుల సంఖ్య, మంగళవారం ఉదయానికి 34కి పెరిగింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు లభ్యం కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. "శిథిలాలను తొలగిస్తుండగా మరికొన్ని మృతదేహాలు బయటపడ్డాయి. సహాయక చర్యలు చివరి దశలో ఉన్నాయి" అని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు.

గవర్నర్ దిగ్భ్రాంతి..సహాయక చర్యలపై ఆదేశాలు
ఈ విషాద ఘటనపై తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. డాన్ కిషోర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పేలుడు బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని వెంటనే అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com