సినిమా రివ్యూ: ‘తమ్ముడు’

- July 04, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘తమ్ముడు’

నితిన్ హీరోగా వేణు  శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే ‘తమ్ముడు’. ‘వకీల్ సాబ్’ తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. దాంతో అంచనాలు బాగున్నాయ్. అలాగే రీసెంట్‌గా ‘రాబిన్ హుడ్’ సినిమాతో నిరాశలో వున్న నితిన్‌కి ‘తమ్ముడు’ అయినా కలిసొచ్చిందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
జై (నితిన్) ఒక ఆర్చర్. అయితే ప్రతిసారీ బుల్ ఐ  కొట్టడం మిస్ చేస్తుంటాడు. బుల్ ఐని సరిగ్గా ఫోకస్ చేస్తే తప్ప నువ్వు నీ లక్ష్యాన్ని అందుకోలేవు అందుకోసం నువ్వు సాధన చేయాలి. నీలో వున్న ఆ లోపాన్ని సరి చేసుకోవాలి,. అని కోచ్ చెబుతాడు. దాంతో ఆ పనిలో బిజీ అవుతాడు. ఈ క్రమంలోనే చిన్నతనంలోనే కొన్ని కారణాలతో వదిలి వెళ్లిన అక్క ఝాన్సీ (లయ) దగ్గరికి వెళతాడు. అక్కడికి వెళ్లాకా తెలుస్తుంది అక్క ఒక ప్రమాదంలో వుందని. గవర్నమెంట్ ఆపీసర్ అయిన ఝాన్సీని ఓ తప్పుడు పని కోసం సంతకం చేయమని బలవంతం చేస్తాడు విలన్ సౌరభ్ సత్యదేవ్. అతని నుంచి అక్కను తమ్ముడు ఎలా కాపాడుకున్నాడు.? అసలు ఝాన్సీ ఊరికిచ్చిన మాటేంటీ.? ఆ మాట ఎందుకు తప్పాల్సి వచ్చింది.? అక్క మాటను నిలబెట్టేందుకు తమ్ముడు ఏం చేశాడు.? తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టాల్సినంత బలమైందా.. ఆ మాట.? ఇవన్నీ తెలియాలంటే ‘తమ్ముడు’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
కొత్త కొత్త ప్రయోగాలు బాగానే చేస్తున్నాడు నితిన్. కానీ, కలిసి రావడం లేదు. కథల ఎంపికలో ఇంకాస్త ఆచి తూచి వ్యవహరిస్తే బావుంటుందేమో. అయినా, తనకు దక్కిన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తున్నాడనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలోనూ జై పాత్రకు ప్రాణం పెట్టేశాడు. కానీ, కథలో బలం లేదు. స్క్రీన్‌ప్లే ఆశించిన రీతిలో లేదు.. దాంతో నితిన్ కష్టం ఫలిస్తుందా.? లేదా.? అన్న దానిపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయ్. ఇక, నితిన్ తర్వాత  ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్ర లయ. లాంగ్ గ్యాప్ తర్వాత ఫుల్ లెంగ్గ్ రోల్‌లో ఈ సినిమాలో నటించింది లయ. ఆ పాత్రలో లయ బాగా నటించింది. కానీ, ఎందుకో అక్క, తమ్ముడి సెంటిమెంట్ అంతగా అతికినట్లు అనిపించదు. హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ తమ పాత్రల పరిధి మేర నటించారు. మరో ముద్దుగుమ్మ స్వస్తిక విజయ్ నెగిటివ్ షేడ్స్‌లో బాగా నటించి మెప్పించింది. విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు సౌరభ్ సత్య‌దేవ్ ఓకే. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. 

సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు వేణు శ్రీరామ్ పని తనంపై ఓ అవగాహన వుంది ఆయన అభిమానులకి. అదే నమ్మకంతో ఈ సినిమాని స్క్రీన్‌ప్లే పరంగా ఉన్నతంగా తీర్చి దిద్ది వుంటాడని భావించారంతా. కానీ, ఆల్రెడీ అందరికీ తెలిసిన కథనే పట్టుకొచ్చాడు వేణు. పోనీ స్క్రీన్‌ప్లే అయినా మ్యాజికల్‌గా రాసుకున్నాడా.? అంటే అదీ లేదు. సో, రొటీన్ రొట్ట కొట్టుడు ఖాతాలోకే ‘తమ్ముడు’ వెళ్లిపోయేలా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ గతంలో నేచురల్ స్టార్ నాని, భూమిక కాంబినేషన్‌లో వచ్చిన సినిమా గుర్తుందిగా ‘ఎమ్.సి.ఎ’. ఆ సినిమా తరహాలోనే పాత్రల చిత్రీకరణ, కథ, కథనాలుంటాయ్. అక్కడక్కడా కొంచెం కొత్తగా అనిపించినప్పటకీ, పెద్దగా ప్రభావం చూపించదు. లయ పాత్ర చిత్రీకరణ బాగుంది. కానీ, ‘ఎమ్.సి.ఏ’ సినిమాలో భూమిక పోషించిన పాత్ర తరహాలోనే లయ పాత్ర వుంటుంది. మనిషి చచ్చిపోయినా ఇచ్చిన మాట మాత్రం బతికే వుండాలి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే.. ఆ మనిషి బతికున్నా చచ్చినట్లే.. అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అయితే, ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొంత బలాన్ని చేకూర్చిందని చెప్పొచ్చు. అంతేకాదు, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సెకండాఫ్‌లో రెండు ఫైట్ సన్నివేశాలు.. అలాగే ఫారెస్ట్ లొకేషన్లను గుహన్ అండ్ టీమ్  బాగా చిత్రీకరించారు. డైలాగ్స్ ఓకే. ఎడిటింగ్ విషయంలో ప్రవీణ్ పూడి ఇంకాస్త ఫోకస్ పెట్టి వుంటే బాగుండేది. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలకు కత్తెర పడాల్సిన అవసరం వుందనిపిస్తుంది. దిల్ని రాజు మరియు శిరీష్ నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఎక్కడా రాజీ పడలేదు. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ ఓకే. 

ప్లస్ పాయింట్స్:
నితిన్, లయ పర్‌పామెన్స్, సెకండాఫ్‌లోని యాక్షన్ ఘట్టాలు, సినిమాటొగ్రఫీ మొదలైనవి.

మైనస్ పాయింట్స్:
పాత కథే, ఆకట్టుకోని స్క్రీన్ ప్లే, సెకండాఫ్‌లో బోరింగ్ సన్నివేశాలు..

చివరిగా:
‘తమ్ముడు’..  నితిన్ మళ్లీ  గురి తప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com