తొలి ఏకాదశి
- July 06, 2025
ఆషాఢంలో అన్నీ పండుగలే! ముఖ్యంగా ఆషాఢంలో శుద్ధ ఏకాదశి నుంచి తెలుగు వారి పండుగలు మొదలవుతాయని శాస్త్రవచనం.అందుకే తొలి ఏకాదశితో పండుగలు తోసుకొస్తాయని ఒక సామెత కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి. జులై 6వ తేదీ ఆదివారం తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? ఈ పండుగ ఎలా జరుపుకోవాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒక ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనినే పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ నాటి నుంచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అందుకే దీనిని శయనైకాదశి అని కూడా అంటారు. ఈ ఏడాది జులై 6వ తేదీ ఆదివారం రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి తిధి ఉంది కాబట్టి ఈ రోజునే తొలి ఏకాదశి పండుగ జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం. తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. దేవతలకు రాత్రి సమయమని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహా విష్ణువు తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుంచి మేల్కొంటాడని స్కాందపురాణం ద్వారా తెలుస్తోంది.
మకర సంక్రాంతి నుంచి నాలుగు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తి అయి ఇక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణ దిక్కు వైపుకు ప్రయాణం సాగిస్తాడు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఉపవాసాలు, పూజల పేరిట పాటించే నియమాలలో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి.
తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసి శ్రీ లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గంధం కుంకుమలతో శ్రీలక్ష్మీనారాయణుల విగ్రహాలను అలంకరించాలి. తొలి పండుగ కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది. ఆవునేతితో దీపారాధన చేసి, పసుపు రంగు పువ్వులతో, తులసి దళాలతో, అక్షింతలతో శ్రీమన్నారాయణుని పూజించాలి. పులిహోర, చక్రపొంగలి, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి నైవేద్యాలు సమర్పించాలి.
ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని విష్ణు ఆలయ దర్శనం చేయాలి. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. రాత్రంతా భగవన్నామ స్మరణ చేస్తూ, భారత భాగవత కధలు చదువుకుంటూ జాగారం చేయాలి. అనంతరం మరుసటి దినం ద్వాదశి ఘడియలు ప్రవేశించగానే ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమణ చేయాలి. ఇలా చేయడం వల్ల సంపూర్ణ ఏకాదశి వ్రతం చేసిన ఫలం వస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.
ఇక తొలి ఏకాదశి రోజున మరొక విశేషం ఏమిటంటే ఈ రోజున పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల ఈ రోజు మన పితృదేవతలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. వేయించిన పేలాలు, బెల్లం నెయ్యి , ఏలకులు శొంఠి కలిపి రోట్లో దంచి తయారు చేసేదే పేలాల పిండి. వర్షా కాలం ఆరంభంలో వచ్చే తొలి ఏకాదశి పండుగ రోజున పితృ దేవతల పేరుతో పేలాల పిండిని తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తొలకరి వానలు కురిసే ఈ సమయంలో రైతులు తమ పొలాల్లో కూడా ఈ పేలాలు పిండి చల్లుతారు. ఇందువలన వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం.
చాతుర్మాసం ప్రారంభమైన ఈ రోజు నుంచి సుమారు 4 నెలల పాటు పెళ్లిళ్లు, గృహప్రవేశం సహా ఏ ఇతర శుభ కార్యాలు చేయరు. ఈ పవిత్ర దినం నాడు పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు సైతం ఉన్నాయి. కొందరు తెలిసి తెలియక చేసే పనుల వలన పాపాల బారిన పడతారు. జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తొలి ఏకాదశి నాడు చేయకూడని పనులు ఇవే..
* తొలి ఏకాదశి నాడు తులసి ఆకులు కోయడం అశుభంగా చెబుతారు. తులసి ఆకులు శ్రీమహా విష్ణువుకు చాలా ప్రీతి ప్రదమైనవి. అందుకనే తులసి ఆకులని విష్ణు ప్రియ అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజున తులసి మొక్కను తాకడం లేదా దాని దళాలను కోయడం లాంటివి చేయరాదు. ఒక వేళ, విష్ణువు పూజ కోసం తులసి దళాలను అవసరమైతే.. వాటిని ఒక రోజు ముందుగానే కోసుకుని పెట్టుకోవాలి.
* జుట్టు, గోర్లు కత్తిరించడం, షేవింగ్ చేయడం లాంటివి కూడా తొలి ఏకాదశి రోజు నాడు చేయరాదు. ఈ రోజున ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం ఏర్పడే అవకాం ఉండటంతో పాటు అశుభాలు వస్తాయి.
* ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా ఇతరులతో గొడవ పడడం, దుర్భాషలాడటం వంటివి చేయొద్దు. మనస్సు, మాట, చర్యలో స్వచ్ఛతను కాపాడుకోవాలి. ఈ రోజు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు కోపాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి. అలాగే, ఈ ఏకాదశి నాడు పగలు నిద్రపోవడం మంచిది కాదు. రోజంతా విష్ణువును పూజించడంతో పాటు భజనలు, కీర్తనలు పాడటం కోసం పూర్తి సమయం కేటాయించాలి. వీలైతే రాత్రి నిద్రపోకుండా జాగరణ చేస్తూ ఆ విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
* తొలి ఏకాదశి రోజున ఇతరులను అవమానించడం లేదా వారిపై చాడీలు చెప్పడం, ఇతరుల పట్ల ద్వేషం పెంచుకోవడం చేయొద్దు. ఈరోజు దానధర్మాలు చేయడం చాలా మంచిది. అలాగే, ఎవరైనా దానం ఇస్తే నిరాకరించవద్దు.. దానిని సంతోషంగా స్వీకరించండి.. దానం నిరాకరించడం వల్ల మీకు పాపం తగులుతుంది.
రానున్న తొలి ఏకాదశి పండుగను మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం.ఆ ఆదివిష్ణువు కృపకు పాత్రులవుదాం...!
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..