వాహనదారులకు గమనిక.. ఇకనుంచి ఈ హెల్మెట్స్ మాత్రమే వాడాలి..

- July 06, 2025 , by Maagulf
వాహనదారులకు గమనిక.. ఇకనుంచి ఈ హెల్మెట్స్ మాత్రమే వాడాలి..

న్యూ ఢిల్లీ: టూవీలర్‌‌తో రోడ్లు పైకి వచ్చిన వారు తలకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. లేకుంటే ఫైన్ పడటం ఖాయం. దీంతో వాహనదారులు హెల్మెట్లు పెట్టుకొని రోడ్లపైకి వస్తున్నారు. అయితే, చాలా మంది నాణ్యత లేని హెల్మెట్లు ధరిస్తున్నారు. తద్వారా ప్రమాదాలు జరిగిన సమయంలో హెల్మెట్ ఉన్నప్పటికీ తలకు గాయాలై ప్రాణాలుపోతున్న పరిస్థితి. దీంతో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది.

సబ్ స్టాండర్డ్ (నాణ్యత లేని) హెల్మెట్లు అమ్మే తయారీదారులు, రిటైలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. టూవీలర్ రైడర్ల భద్రత కోసం ఈ చర్యలు చేపట్టింది. బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్లు మాత్రమే ఉపయోగించాలని బీఐఎస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ సూచించాయి. ఈ ఏడాది జూన్ నాటికి 176 తయారీ కంపెనీలు బీఐఎస్ లైసెన్సులు కలిగి ఉన్నాయి. అయినప్పికీ రోడ్డు పక్కన విక్రయించే అనేక హెల్మెట్లు బీఐఎస్ లేకుండా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగిన సమయంలో మరణాలు పెరుగుతున్నాయి.

మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 ప్రకారం హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. భారతదేశంలో 21 కోట్ల టూవీలర్లు ఉన్నందున, నాణ్యతలేని హెల్మెట్ల వలన రైడర్ల భద్రత ప్రమాదంలో పడుతుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. 2021 నుంచి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ అమల్లో ఉంది. ఇది ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లు తప్పనిసరి చేసింది. అయితే, రహదారుల పక్కన, స్థానిక మార్కెట్లలో నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్లు అధికంగా విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జిల్లా అధికారులు, కలెక్టర్లు హల్మెట్ల విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టి నిబంధనలు అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే చెన్నైలో మానక్ మిత్ర వలంటీర్ల ద్వారా క్వాలిటీ కనెక్ట్ క్యాంపెయిన్ నిర్వహించి వినియోగదారులకు బీఐఎస్ గుర్తింపుపై ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తం చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com