రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

- July 06, 2025 , by Maagulf
రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఎంతో మంది ఆరాటపడుతుంటారు. కాలినడకను కొండకు చేరుకుని తలనీలాలు సమర్పించి ఆ ఏడుకొండలవాడి దర్శనం చేసుకుని మొక్కులు, ముడుపులు చెల్లిస్తుంటారు. మీరు కూడా జులైలో తిరుమల వెళ్లేందుకు ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీకో అలర్ట్​. ఈ నెలలో రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఆణివార ఆస్థానం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన రిలీజ్​ చేసింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఆ రెండు రోజులు రద్దు: ఈ నెల 16వ తేదీ బుధవారం రోజు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. అందులో భాగంగానే జులై 15న కోయిల్​ ఆళ్వార్​ తిరుమంజనం చేపడతారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, ముక్కోటి ఏకాదశి పండగల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే జులై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా ముందురోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించున్నారు. ఇందులో భాగంగానే ఈ రెండు రోజుల(జులై 15, 16) పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. జులై 14, 15వ తారీఖుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు తీసుకోమని వెల్లడించింది.

ఆణివార ఆస్థానం అంటే: ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం ఆఖరి రోజున నిర్వహించే పండగ కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చింది. ఇక ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారువాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా వేంచేపు చేస్తారు. ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు సమర్పిస్తారు. ఆరోజు సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పుష్పపల్లకీపై తిరుమల మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా జులై 15వ తేదీ మంగళవారం రోజు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామి వారి మూల విరాట్టును వస్త్రంతో కప్పి ఉంచుతారు. ఆలయ శుద్ధి పూర్తైన తర్వాత సంప్రోక్షణ చేపడతారు. శ్రీచూర్ణం, నామకోపు, కస్తూరి పసుపు, కుంకుమ, గడ్డ కర్పూరం, పచ్చాకు, గంధం పొడి, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాల తర్వాత శ్రీవారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com