క్రికెట్ మాంత్రికుడు-మహేంద్ర సింగ్ ధోని
- July 07, 2025
అతడు ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన దిగ్గజ ఆటగాడు, టీమిండియా మాజీ సారథి ఎం.ఎస్.ధోని. ఆయన గురించి చెప్పాలంటే తరిగిపోనంత ఉంది. భారత క్రికెట్‌లో ధోనీకి ముందు.. ధోనీకి తర్వాత.. అంతలా దేశ క్రికెట్ ను ప్రభావితం చేసిన వ్యక్తి. అతడి రాక ఇండియాలో క్రికెట్‌కు కొత్త వెలుగును తీసుకొచ్చింది. టీమిండియాను ప్రపంచ క్రికెట్‌లో మేటి జట్టుగా నిలిపిన సారథి అతడు. జట్టులో తనదైన శైలిలో ప్రయోగాలు చేసి అద్భుతమైన ఫలితాలను రాబట్టిన క్రికెట్ మాంత్రికుడు మన మహేంద్రుడు. నేడు భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్.ధోని పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం
ఎం.ఎస్.ధోని పూర్తి పేరు మహేంద్ర సింగ్ ధోనీ, అవిభాజిత బీహార్ రాష్ట్రంలోని రాంచీలో 1981 జులై 7న పాన్ సింగ్, దేవకీదేవి దంపతులకు జన్మించాడు. ధోని స్కూల్లో చదువుకునే రోజుల్లో ఫుట్ బాల్ గేమ్ మీద ఆసక్తి ఉండేది. స్కూల్ టీమ్ తరుపున గోల్ కీపర్ గా రాణించాడు. అయితే, ధోని అద్భుతమైన ఆట తీరును గమనించిన స్కూల్ కోచ్ కేశవ్ బెనర్జీ సూచనల మేరకు ఫుట్ బాల్ వదిలి క్రికెట్ మీద దృష్టి సారించాడు. 1995 నుంచి 2000 వరకు పలు దేశవాళీ టోర్నీల్లో ఆడాడు.
ధోని ఆట తీరుకు ముగ్దులైన బీహార్ స్టేట్ క్రికెట్ టీమ్ సెలెక్టర్లు రంజీ ట్రోఫీకి సెలెక్ట్ చేశారు. 2000- 2004 వరకు రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ మరియు దేవధర్ ట్రోఫీలలో అద్బుతమైన ఆటతీరును కనబరచాడు. ఇదే సమయంలో ధోనికి ఆర్థికంగా తోడ్పడేందుకు తూర్పు రైల్వేస్ టీసీ ఉద్యోగాన్ని ఇచ్చింది. 2003 వరకు టీసీగా పనిచేస్తూనే క్రికెట్ ఆడుతూ వచ్చాడు. 2003లో తొలిసారిగా ఇండియన్ టీం సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2004లో జింబాబ్వేలో పర్యటించబోయే ఇండియా ఏ టీంలో చోటు సంపాదించి బాగా ఆడటంతో భారత జట్టుకు ఎంపికయ్యాడు.
సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో భారత జట్టు తరఫున డెబ్యూ చేశాడు. ఆ మ్యాచ్‌లో ఒక బంతి మాత్రమే ఎదుర్కొన్న ఎంఎస్.. రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. ఏ ఆటగాడికైనా తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అంటూ ఒకటి ఉంటుంది. ధోనీ కెరీర్‌లో అది 2005లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్. అప్పట్లో జులపాల జట్టుతో కన్పించే ధోనీ.. విశాఖపట్నం వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచులో పెను విధ్వంసం సృష్టించాడు. 123 బంతుల్లో 148 పరుగులు చేశాడు. అదే సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో 145 బంతుల్లో 183 పరుగులు చేశాడు. ఇక అంతే.. ఆ ఇన్నింగ్స్ తర్వాత ధోనీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం అనూహ్య పరిణామాల మధ్య జరిగింది. 2007 వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత్ అనూహ్యంగా గ్రూప్ దశ నుంచే వెనుదిరిగింది. వాస్తవానికి అప్పట్లో టీ20 మ్యాచ్‌లకు బీసీసీఐ అంత ప్రాధాన్యత ఇచ్చేది కాదు. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్ కోసం జట్టును పంపించడానికి కూడా బీసీసీఐ సిద్ధంగా లేదు. కానీ ఐసీసీ విజ్ఞప్తి మేరకు జట్టును పంపాలని నిర్ణయించింది. అయితే అప్పటికే వన్డే ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన చేసిన భారత జట్టును ప్రక్షాళన చేయాలని బీసీసీఐ భావించింది. దీంతో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లాంటి సీనియర్లు ఉన్నా.. ధోనీనే సారథిగా నియమించింది.
ఇండియా టీం కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేంద్రుడు... తొలి టీ20 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టును ఓడించి భారత జట్టును విశ్వ విజేతగా నిలిపాడు. అప్పటినుంచి భారత క్రికెట్ జట్టు రూపురేఖలు మారిపోయాయి. 2011 వరల్డ్ కప్ లక్ష్యంగా జట్టును తయారు చేయాలనే తలంపుతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. ధోని చేసిన ప్రయోగాల కారణంగా ఎందరో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు అవకాశాలు లభించాయి.
2011లో ధోనీ కెప్టెన్సీలో 28 ఏళ్ల తర్వాత భారత్ వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్సర్.... క్రికెట్ ప్రేమికుల మనసులపై ఒక చెరగని సంతకం. ఆ సిక్స్‌తో ధోనీ భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. 2013లో ఛాంపియన్స్‌ని గెలిచి భారత్‌కు ఈ మహేంద్రుడు మరో ఐసీసీ ట్రోఫీని అందించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. ధోనీ నాయకత్వంలో 2010, 2014లో మూడు ఫార్మాట్లలో భారత జట్టు నంబర్ 1 జట్టుగా నిలిచింది. ధోనీ కెప్టెన్సీ శకం భారత్‌కు స్వర్ణయుగం.
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ధోని 17,266 పరుగులు చేశాడు. ధోని 90 టెస్టుల్లో 4, 876 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ చేశాడు. టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా ధోని నిలిచాడు. 350 వన్డేలు ఆడిన ధోనీ... 10,773 పరుగులు చేశాడు. వన్డేల్లో ధోనీ 10 శతకాలు చేశాడు. 98 టీ 20ల్లో 1617 పరుగులు చేశాడు. 2019 వరల్డ్ కప్ సెమీస్‌లో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ రనౌట్... భారత్ అభిమానులను తీవ్ర వేదనకు గురిచేసింది. అప్పుడే ధోనీ శకం ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ప్రపంచకప్ తర్వాత సంవత్సరం పాటు క్రికెట్‌కు దూరమైన ధోనీ.. 2020 ఆగస్టు 15న రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ధోనీ శకం గురించి ఎంత చెప్పినా తక్కువే. 2008 లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి తన సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును తిరుగు లేని జట్టుగా నిలిపి తమిళనాడు రాష్ట్ర ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్కే అభిమానులకు "తలా"(అన్నగారు)గా మారిపోయాడు. ఇక అప్పటినుంచి ధోనీ మైదానంలో దిగుతున్నాడంటే స్టేడియంకు చెన్నై అభిమానులు పోటెత్తెడం ఆరంభమైంది. ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే ఐదు IPL టైటిళ్లను గెలుచుకుంది. ఐపీఎల్-2024కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగించి ఆటగాడిగా మాత్రమే కొనసాగాడు. ఐపీఎల్ 2026లో ఆడతాడా లేదా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పనుంది.
ధోని వ్యక్తిగత జీవితానికి వస్తే తన జీవిత భాగస్వామి పేరు సాక్షి సింగ్ రావత్ , కుమార్తె జీవా. ధోనికి వ్యవసాయం , బైకులు, కార్స్ అంటే ఎంతో ఆసక్తి. ఒకవైపు క్రికెట్ ఆడుతూనే పలు వాణిజ్య ప్రకటనల్లో విస్తారంగా నటించాడు. ధోనికి పలు స్టార్టప్ కంపెనీల్లో భాగస్వామ్యం ఉంది. ధోనికి రాంచీ, ముంబై వంటి పలు నగరాల్లో ఖరీదైన ఇళ్ళు, స్థలాలు ఉన్నాయి. ఇవే కాకుండా తనకు ఆసక్తి ఉన్న రంగంలో పెట్టుబడులు పెడుతూ బాగానే ఆర్జిస్తున్నాడు ఈ కెప్టెన్ కూల్.
దూకుడు బ్యాటింగ్‌తో టీమిండియాలోకి దూసుకొచ్చి... ఆ తర్వాత భారత జట్టు వెన్నెముకగా మారి... యువ ఆటగాళ్లకు గురువుగా... అసలైన కెప్టెన్‌గా ధోని భిన్న పాత్రలను సమర్థంగా నిర్వహించాడు.టీమిండియాను నెంబర్ వన్‌గా చేసి ఇక సాధించాల్సింది ఏమీ లేదని నిరూపించి మరీ రిటైరయ్యాడు. కెప్టెన్సీ అంటే ఇలాగే చేయాలేమో... బౌలర్లకు సలహాలు ఇలాగే ఇవ్వాలేమో.. బ్యాటింగ్ అంటే ఇంతే ప్రశాంతంగా చేయాలేమో... అని క్రికెట్ ప్రపంచానికి పాఠాలు నేర్పిన ధోని భారత క్రికెట్‌లో చెరగని ముద్ర వేశాడు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!