ఆంధ్రా కాంగ్రెస్ ఉద్దండ నేత-కళా వెంకట్రావు
- July 08, 2025
కళా వెంకట్రావు... స్వాతంత్య్రానికి పూర్వం ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీని నడిపించిన నాయకుడు. పట్టాభి సీతారామయ్య శిష్యరికంలో రాజకీయాలను అవపోసన పట్టి, ఉమ్మడి మద్రాస్ రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయోగ్యులను సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చి దిగ్గజ రాజకీయవేత్తలుగా తీర్చిదిద్దారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కారణభూతులైన వ్యక్తుల్లో వీరు ఒకరు. రాజకీయ అసూయతో ఆయన చేసిన చారిత్రాత్మక తప్పిదాల వల్ల గొప్ప నాయకులు రాష్ట్రాన్ని నడిపించేందుకు అవకాశాలను కోల్పోయారు. నేడు ఆంధ్రా కాంగ్రెస్ ఉద్దండ నేత కళా వెంకట్రావు మీద ప్రత్యేక కథనం...
కళా వెంకట్రావు 1900, జూలై 7న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్‌లోని అవిభక్త గోదావరి జిల్లాలోని అమలాపురం ఫిర్కాలోని ముక్కామల గ్రామంలో వైష్ణవ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కళా బ్రహ్మయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించారు. వీరి స్వస్థలం మాత్రం ప్రస్తుత పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ తాలూకా నడిపూడి గ్రామం. తండ్రి హయాంలోనే నడిపూడి నుంచి తమ అమ్మమ్మ గారి ఊరైన ముక్కామల గ్రామానికి తరలి వచ్చారు. వెంకట్రావు బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ముక్కామలలోనే సాగింది. ఆ తర్వాత పై తరగతుల కోసం పుల్లేటికుర్రు, అమలాపురం ప్రాంతాలకు వెళ్లారు. అమలాపురంలో హైస్కూల్ విద్యను పూర్తి చేసిన తర్వాత బంధువుల ప్రోత్సాహంతో విజయనగరం వెళ్లి మహారాజా కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అయితే అక్కడే బిఏ చదవడానికి ప్రయత్నాలు చేసినా కుదరక మచిలీపట్నం (బందరు) నోబుల్ కళాశాలలో డిగ్రీ చదువుతూ ఆపేశారు.
వెంకట్రావు చిన్నతనం నుంచి స్వతంత్ర భావాలను కలిగి ఉండేవారు. విజయనగరంలో చదువుతున్న సమయంలోనే దేశ స్వాతంత్య్ర ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. బ్రిటిష్ వ్యతిరేక భావాల వల్ల అక్కడ డిగ్రీ చదవకుండా, జాతీయ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న బందరులో చదవడానికి పూనుకున్నారు. బందరు నోబుల్ కళశాలలో చేరి డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగా గాంధీ ఇచ్చిన బహిష్కరణ ఉద్యమం పిలుపుతో చదువుకు స్వస్తి పలికి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1922లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రావు ఆనాడు కాంగ్రెస్ రాజకీయ ప్రముఖుడైన భోగరాజు పట్టాభి సీతారామయ్యకు దగ్గరయ్యారు. గాంధీకి ఆంధ్రాలో ముఖ్య అనుచరుడైన పట్టాభి బందరులో పలు వ్యాపార సంస్థలకు అధ్యక్షత వహించారు. తమ సముదాయానికి చెందిన పట్టాభి సహచర్యంలో ఒకవైపు స్వాతంత్య్ర పోరాటంలో క్రియాశీలకంగా ఉంటూనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు.
పట్టాభి ప్రభావంతో చదువుకు స్వస్తి పలికి స్వగ్రామానికి చేరుకున్న తర్వాత అమలాపురం కేంద్రంగా కోనసీమ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పలువురు ఆయనకు మద్దతుగా నిలిచారు. కోనసీమనే కాకుండా మెట్ట సీమలో సైతం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న బులుసు సాంబమూర్తి వంటి ఉద్దండ నాయకునితో కలిసి పనిచేయడం రావుకు చాలా ఉపకరించింది. సాంబమూర్తి ద్వారా బిక్కిన వెంకటరత్నం, మల్లిపూడి పళ్ళంరాజు, మలీనిడి సత్యనారాయణ రెడ్డి వంటి కాంగ్రెస్ యువనేతలతో పరిచయం ఏర్పడింది. అప్పటికే అవిభక్త గోదావరి జిల్లాను తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలుగా విడదీయండంతో వీరు తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ ప్రముఖుడిగా ఎదిగారు.
వెంకట్రావు జిల్లా రాజకీయాల కంటే మద్రాస్ రాష్ట్ర రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందువల్లే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కోనసీమ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో పలువురు యువకులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నడింపల్లి రామభద్రరాజు, అల్లూరి వెంకట కృష్ణంరాజు, మంతెన వెంకట సూర్య సుబ్బరాజు, రుద్రరాజు రామలింగరాజు వంటి వారితో పాటుగా ఆరుమిల్లి వెంకటరత్నం, రాయవరం మునుసుబుగా సుప్రసిద్దులైన ఉండవల్లి సత్యనారాయణ మూర్తి వంటి వారిని రాజకీయాల్లోకి తెచ్చారు..ఆయన తయారు చేసుకున్న యువ బృందం మొత్తం సంపన్న, రాజకీయ పలుకుబడి కలిగిన కుటుంబాలకు చెందిన వారు కావడంతో జస్టిస్ పార్టీకి చెందిన దిగ్గజ రాజకీయవేత్త, మద్రాస్ ప్రావిన్స్ అధ్యక్షుడిగా ఉండిన సర్ కుర్మా వెంకట రెడ్డి నాయుడు గారికి దీటుగా ఎదిగారు.
1937లో వచ్చిన మద్రాస్ ప్రావిన్స్ అసెంబ్లీ ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి జస్టిస్ పార్టీ తరపున పోటీ చేసిన సర్ వెంకట రెడ్డి నాయుడు గారి మీద కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి తన అనుచరుల సహకారంతో పాటుగా నాటి స్వాతంత్య్ర ఉద్యమ పరిస్థితుల వల్ల విజయం సాధించారు. ఆ ఎన్నిక ద్వారా మద్రాస్ రాష్ట్ర రాజకీయాల్లో వెంకట్రావు బిజీగా మారారు. ముఖ్యంగా తన గురువు పట్టాభి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంతో పట్టాభి తరపున ఆంధ్ర ప్రాంతం నుంచి కాంగ్రెస్ ప్రతినిధిగా మారారు.తనతో పాటు గెలిచిన మల్లిపూడి పళ్ళంరాజుకు తూర్పు గోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించేసి తను మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మారారు. పట్టాభి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయనకు మరింత దగ్గరయ్యారు.
మద్రాస్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఆచార్య రంగా, ప్రకాశం పంతులు నుంచి వెంకట్రావుకు గట్టి పోటీ ఉండేది. పైగా ఆ ఇరువురూ ఆంధ్రదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులు. వారితో పోల్చుకుంటే వెంకట్రావు చాలా తక్కువ వ్యక్తి. అయితే, జాతీయ అధ్యక్షుడైన పట్టాభి అండదండలు ఉండటంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పలు క్రియాశీలక పదవులు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తన సమవయస్కుడైన రంగాకు బడుగు, బలహీన మరియు రైతాంగ వర్గాల్లో ఉన్న ఆదరణ పట్ల అసూయ పడేవారు. ముఖ్యంగా రంగా రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలను సైతం లెక్కచేయకుండా ప్రజా ఉద్యమాలు నిర్వహించేవారు. రంగా రాజకీయాల పట్ల అసంతృప్తితో కూడిన ఆత్మనూన్యత భావాన్ని పెంచుకొని తన గురువు పట్టాభికి పితూరీలు చెప్పడంతో కాలం గడిపేవారు. 1940-46 మధ్యలో మద్రాస్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
రంగాకు ఆంధ్రదేశంలో వస్తున్న ప్రజాదరణను నిలువరించేందుకు పట్టాభి మార్గదర్శనంలో పలువురు కొత్తవారిని రాజకీయాల్లోకి తేవడం ప్రయత్నించారు. క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా జైలుకు వెళ్లిన నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, ఆలపాటి వెంకట్రామయ్య, మంతెన వెంకట్రాజు వంటి వారికి కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేయడం మొదలుపెట్టారు. వెంకట్రావుకు దీటుగా రంగా సైతం రైతు, జమిందారీ వ్యతిరేక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన పాటూరి రాజగోపాల్ నాయుడు, కందుల ఓబుల్ రెడ్డి, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, గౌతు లచ్చన్న మొదలగు వారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. వీరి ఇద్దరి వర్గాలతో పాటుగా బెజవాడ గోపాల్ రెడ్డి, కల్లూరి చంద్రమౌళి, ప్రకాశం పంతులు, కడప కోటిరెడ్డి, కల్లూరి సుబ్బారావు, జాగర్లమూడి చంద్రమౌళి, తెన్నేటి విశ్వనాథం వంటి వారు మధ్యస్థులుగా ఉండేవారు.
1946 అసెంబ్లీ ఎన్నికల్లో అమలాపురం నుంచి రెండోసారి ఎన్నికైన నాటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీద పట్టు సాధించాలని తపనతో ఉండేవారు. 1946లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాభి సూచనల మేరకు రాజగోపాలాచారి పక్షంలో వెంకట్రావు ఉంటె, ప్రకాశం పంతులకు మద్దతుగా రంగా ఉండేవారు. ఆ ఎన్నికల్లో రంగా అనుచర వర్గం నుంచి అత్యధికులు అసెంబ్లీకి ఎన్నికవ్వడంతో ప్రకాశం పంతులు సీఎం అవ్వడానికి తోడ్పడ్డారు. ప్రకాశం పంతులును సీఎం చేయడం వల్ల అప్పటి వరకు మధ్యస్థంగా ఉన్న కల్లూరి, బెజవాడలు వెంకట్రావు వర్గానికి దగ్గరయ్యారు.
1946లో రంగా వెంకట్రావు వర్గాన్ని చిత్తుగా ఓడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ శాఖ అదేక్షుడయ్యారు. రంగా చేతిలో వరుస పరాభవాలు వెంట్రావును ఉన్మాద స్థితికి చేర్చాయి. రంగా మీద పై చేయి సాధించేందుకు పార్టీలో ఉన్న ఆయన వ్యతిరేక వర్గాన్ని మొత్తం ఒకటిగా చేయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో రంగాకు మద్దతుగా ఉన్న ప్రకాశం పంతులును సీఎం పీఠం నుంచి దింపేయడానికి రాజగోపాలాచారితో చేతులు కలిపి సీఎం పదవి నుంచి దింపేసి, చారి ముఖ్య అనుచరుడైన రామస్వామి రెడ్డియార్ సీఎం అవ్వడానికి దోహదపడ్డారు. అందుకు ప్రతిఫలంగా రెడ్డియార్ మంత్రివర్గంలో 1947-49 వరకు రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రధాని అయిన నెహ్రూకు తన గురువు పట్టాభి ద్వారా దగ్గరయ్యారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పట్టాభి ఉన్న సమయంలో 1949లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి 1951 వరకు కొనసాగారు. ఈ సమయంలోనే రంగా పట్ల కొంత అసంతృప్తి ఉన్న నెహ్రూకు సైతం వెంకట్రావు పదే పదే పితూరీలు మోస్తూ రంగా మీద చెడు అభిప్రాయాన్ని కలిగించడంలో సఫలీకృతం అయ్యారు. అందుకు ఫలితంగా నెహ్రూ ఆదేశాల మేరకు 1951లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ శాఖ అధ్యక్ష ఎన్నికల్లో రంగాను ఓడించాల్సిందిగా రహస్యంగా నెహ్రు అనుమతిని తీసుకోని ఆ ఎన్నికల్లో రంగా ప్రత్యర్థి వర్గాన్ని, కాంగ్రెస్ పార్టీ విధేయవర్గాన్ని సమన్వయం చేసుకుంటూ తన అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డిని గెలిపించడానికి అల్లూరి సత్యనారాయణరాజు, కాసు బ్రహ్మానందరెడ్డిని వినియోగించారు. వెంకట్రావు ఎత్తుగడలు ఫలించి ఆ ఎన్నికల్లో రంగా కేవలం 50 ఓట్ల తేడాతో ఓడారు.
ఎన్నికల్లో రంగా ఓడిన నాటి నుంచి వెంకట్రావు వర్గం చేసిన అవమానాలను తట్టుకోలేక ఆయన మరియు అనుచర వర్గం కాంగ్రెస్ పార్టీని వీడింది. (ఆరోజు తమకు ఎటువంటి అపకారం చేయని రంగా మీద కత్తికట్టి మరీ ఓడించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవితాలు తర్వాత కాలంలో చాలా దారుణంగా సాగాయి. ముఖ్యంగా ఆ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అల్లూరి సత్యనారాయణరాజు గారికి పలు మార్లు రాజకీయ అవమానాలు, సొంత వారి చేతిలోనే పరాభవాలు ఎదురయ్యాయి. సీఎం పదవి చేపట్టడానికి అన్ని అర్హతలు ఉన్నా ఆ పదవి దక్కకుండా నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి చేసిన ఫ్యాక్షన్ రాజకీయాలు ఆయనకు జీవితపర్యంతం మానసిక క్షోభను మిగిల్చాయి) సంజీవ రెడ్డిని అధ్యక్షుడిగా కూర్చోబెట్టడం ద్వారా, తన సీఎం పదవి ఆకాంక్షను వదిలేసుకున్నారు. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ ఆధిపత్యం నుంచి రెడ్ల చేతుల్లోకి వెళ్ళింది. ఈ పని చేసినందుకు వెంకట్రావును బ్రాహ్మణ సామాజిక వర్గ మేధావులు ఏనాడు క్షమించలేదు.
1951-52 మధ్య పూసపాటి కుమారస్వామి రాజా మంత్రి వర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. మద్రాస్ రాజకీయాల్లో బిజీగా ఉండి పోవడం వల్ల అమలాపురంలో సైతం చాలా పరిణామాలు వేగంగా మారాయి. వెంకట్రావు తమను రాజకీయంగా ఎదగనీయకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అనుచరులు భావించారు. అందుకు కారణం మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత అమలాపురం కేంద్రంగా ఉన్న కోస్తా సహకార బ్యాంకు పదవిని తన వద్ద పెట్టుకోవడం, అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికే ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఇతర వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. ఒకప్పుడు అన్ని వర్గాల వారికి దగ్గరై గెలిచిన ఆయన కేవలం తన సామాజిక వర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని సహించలేకపోయారు.దీనితో పాటు తనతో పాటు రాజకీయంగా ఎదుగుతున్న నడింపల్లి రామభద్రరాజు లాంటి ప్రజా నాయకుడి పట్ల అసూయ, ద్వేషంతో దూరం చేసుకున్నారు. దాని మూల్యమే 1952 అసెంబ్లీ ఎన్నికల్లో అమలాపురం నుంచి బరిలోకి దిగి రామభద్రరాజు గారి చేతిలో ఘోరమైన ఓటమిని చవిచూశారు.
అమలాపురం ఓటమి వెంకట్రావు రాజకీయ కలలను కుప్ప కూల్చిందనే చెప్పాలి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం మంతనాలు ప్రారంభం అవుతున్న దశలో, పట్టాభి ప్రోద్బలంతో విభజన కమిటీలో సభ్యుడయ్యారు. సంజీవరెడ్డి పీసీసీ అధ్యక్షుడైన నాటి నుంచి వెంకట్రావు సూచనలు, సలహాలు పట్టించుకోవడం దాదాపు మానేశారు. అయితే, తాను పెంచి పోషించిన సంజీవరెడ్డిని విడిచి పెట్టడానికి సిద్దపడక, తనకు జరిగిన అవమానాలను దిగమింగుతూ వచ్చారు. 1953లో పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కిసాన్ మజుద్దూర్ ప్రజాపార్టీ నేతగా ఉన్న ప్రకాశం పంతులు కాంగ్రెస్, రంగా నాయకత్వంలోని కృషికార్ లోక్ పార్టీల మద్దతుతో సీఎం అయ్యారు. సంజీవ రెడ్డి డిప్యూటీ సీఎం అయ్యారు.
ప్రకాశం సీఎం అవ్వడం, రంగా ప్రభుత్వాన్ని శాసించడం వంటివి వెంకట్రావుకు మింగుడు పడలేదు. కానీ, ఏమి చేయలేని అశక్తతతో ఉన్న దశలోనే 1954లో సంజీవరెడ్డికి పార్టీ వ్యవహారాల్లో సహాయకుడిగా ఉండేందుకు పీసీసీ ఉపాధ్యక్ష పదవిని కాంగ్రెస్ హైకమాండ్ కట్టబెట్టింది. నూతన పదవితో కొంత పలుకుబడి వచ్చినప్పటికి రంగా ప్రాబల్యాన్ని మాత్రం మునుపటిలా అడ్డుకోలేక లోలోపల మదన పడుతూ ఉండేవారు. 1954, నవంబర్ నెల మధ్యలో ప్రకాశం ప్రభుత్వం కూలిపోయింది. అప్పటికే ఎనిమిది పదుల వయస్సులో ఉన్న ప్రకాశం రాజకీయంగా క్రమంగా తెరమరుగవుతూ వచ్చారు. ఇదే క్రమంలో అప్పటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులను అనుసరించి నెహ్రూ రంగాను పార్టీలోకి సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానించారు. సాక్షాత్తు ప్రధాన మంత్రే రంగాను ఆహ్వానించడం వెంకట్రావును ఆత్మనూన్యత భావంలోకి నెట్టేసింది. ఇలా 1952-55 వరకు వెంకట్రావు రాజకీయ జీవితం చాలా కష్టంగా గడిచింది.
1955 అసెంబ్లీ ఎన్నికల్లో నెహ్రూ సూచనల మేరకు రంగా, బెజవాడ గోపాల్ రెడ్డి, సంజీవరెడ్డిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ మీద జయభేరి మోగించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈసారి అమలాపురం నుండి కాకుండా కొత్తగా ఏర్పడ్డ కొత్తపేట నుంచి పోటీ చేసి గెలిచారు. 1955-56 వరకు బెజవాడ గోపాల్ రెడ్డి మంత్రివర్గంలో భూ సంస్కరణల మంత్రిగా పనిచేశారు. 1956లో తెలంగాణ ప్రాంతం కూడా కలవడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది. నీలం సంజీవ రెడ్డి మొదటి సీఎం అయ్యారు. సంజీవరెడ్డి మంత్రివర్గంలో 1956-59 వరకు ఆర్థిక మరియు రెవెన్యూ, భూ సంస్కరణల శాఖల మంత్రిగా పనిచేశారు.
మంచి ప్రాధాన్యత కలిగిన మంత్రి పదవులు దక్కినప్పటికి ఒకప్పటి రాజకీయ వైభవం పొందలేకపోయారు. పైగా రాజకీయంగా తనకు మద్దతుగా నిలిచిన గురువు పట్టాభి సైతం వయోభారంతో క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగడం, తానూ పెంచి పెద్ద చేసిన నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజుల హవా మొదలవ్వడంతో, తానూ కూడా రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలిగి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద కూడా చెప్పగా, వారు కూడా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అంగీకరించారు. అందుకు తగినట్లే సన్నాహకాలు చేసుకుంటున్న సమయంలో అనారోగ్యం బారిన పడ్డారు. ఆ తర్వాత కొద్దీ కాలానికే కోలుకున్నప్పటికి మంత్రి బాధ్యతల ఒత్తిడి వల్ల జ్వరంతో బాధపడుతూ ఉన్న దశలోనే 1959, మార్చి 29 రాత్రి 10 గంటల సమయంలో తీవ్రమైన గుండె పోటు కారణంగా తన 60వ ఏట కన్నుమూశారు.
వెంకట్రావు రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే, ప్రజాదరణ విషయంలో సమకాలీకుడైన రంగాను ఏనాడు దాటలేకపోయినా, మేధోపరమైన వ్యవహారాల్లో మాత్రం ఆయన అందరికంటే ముందుండేవారు. రెవెన్యూ మంత్రిగా ఉమ్మడి మద్రాస్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు సంస్కరణలకు ఆద్యుడయ్యారు. కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టుల నుంచి ఏర్పడ్డ సవాళ్ళను దీటుగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహరచన చేశారు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజాదరణ కంటే వ్యవహార దక్షత, మేధోపరమైన కార్యదక్షతల ద్వారా కూడా సాధ్యపడుతుందని వెంకట్రావు నిరూపించారు. అయితే, ఎన్నో గొప్ప లక్షణాలను కలిగి ఉన్నా తన ప్రత్యర్థులపై కోపం, అసూయ, ద్వేషం కారణంగా అందుకోవాల్సిన ఉన్నత పదవులను అందుకోలేకపోయారు. పరిపాలనా వ్యవహారాల్లో సమర్థులైన అల్లూరి సత్యనారాయణ రాజు, కల్లూరి చంద్రమౌళి వంటి వారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టకుండా అడ్డుకోవడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాన్ని కోల్పోయారు. ఏది ఏమైనా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తిగా వెంకట్రావు నిలిచారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక