జీవితకాల గోల్డెన్ వీసా వార్తలు అవాస్తమని ఖండించిన యూఏఈ

- July 09, 2025 , by Maagulf
జీవితకాల గోల్డెన్ వీసా వార్తలు అవాస్తమని ఖండించిన యూఏఈ

అబూధాబి: యూఏఈ ప్రభుత్వం కొన్ని జాతీయులకు జీవితకాల గోల్డెన్ వీసా మంజూరు చేస్తోందన్న వార్తలు అసత్యమని, అవి అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవని ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ ఫెడరల్ అథారిటీ (ICP) ఖండించింది.

ఐసీపీ తెలిపిన ప్రకారం, గోల్డెన్ వీసా మంజూరుకు సంబంధించిన కేటగిరీలు, అర్హతలు, నిబంధనలు స్పష్టంగా ఆధికారిక చట్టాలు, నియమాలు మరియు మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం నిర్ణయించబడ్డాయి. వీసాలకు సంబంధించి సరైన సమాచారం కోసం ఐసీపీ అధికారిక వెబ్‌సైట్ లేదా స్మార్ట్ యాప్‌ను ఉపయోగించాలని సూచించింది.

గోల్డెన్ వీసా దరఖాస్తులు యూఏఈలోని అధికారిక ప్రభుత్వ ఛానళ్ల ద్వారానే పరిష్కరించబడతాయని స్పష్టం చేసింది. దేశీయంగా లేదా విదేశాలలోని ఎటువంటి కన్సల్టెన్సీ సంస్థలు అధికారికంగా గుర్తించబడలేదని తెలియజేసింది.

ఇటీవల కొన్ని విదేశీ కన్సల్టెన్సీలు బయట దేశాల నుంచే గోల్డెన్ వీసా పొందవచ్చని, సరళమైన నిబంధనలతో అన్ని వర్గాలకూ మంజూరవుతుందని పేర్కొంటూ ప్రకటనలు విడుదల చేసినట్లు ఐసీపీ గుర్తించింది. ఈ వ్యాఖ్యలకు ఎలాంటి చట్టపరమైన ప్రాతిపదికా లేదని తెలిపింది.

భద్రతతో కూడిన, పారదర్శకమైన సేవలందించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఐసీపీ స్పష్టం చేసింది. అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే సేవలు మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది.

తప్పుడు ప్రచారాలు నిర్వహించి ప్రజల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేసే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.యూఏఈలో నివాసం, పర్యటన లేదా పెట్టుబడులపై ఆసక్తి ఉన్నవారు ఇలాంటి తప్పుదారి చూపించే వార్తలపై నమ్మకం ఉంచకూడదని, ఎవరూ ఎటువంటి ఫీజులు చెల్లించకూడదని సూచించింది.

తదుపరి చర్యల కోసం ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా 600522222 నంబరులో 24/7 అందుబాటులో ఉండే కాల్ సెంటర్‌ను సంప్రదించాల్సిందిగా ఐసీపీ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com