మహానటుడు-గుమ్మడి
- July 09, 2025
గుమ్మడి వెంకటేశ్వరరావు..ఈ పేరు వినగానే సాత్వికమైన నిలువెత్తు మనిషి మన ఊహల్లోకి వస్తాడు. మంచితనం మూర్తీభవించిన వ్యక్తి మనకు కనిపిస్తాడు.దాదాపు 60 సంవత్సరాల కెరీర్‌లో 500కి పైగా సినిమాల్లో తనకు లభించిన ప్రతీపాత్రకూ న్యాయం చేస్తూ నటించిన మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయన ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినా, అందులో తన జాడ కనిపించకుండా పాత్ర నీడనే చూపించేవారు. మన దేశం గర్వించదగ్గ ‘మెథడ్ ఆర్టిస్ట్స్’లో గుమ్మడికి సైతం ప్రత్యేక స్థానం ఉంది. జానపదమైనా, పౌరాణికమైనా, సాంఘికమైనా ఇలా తను చేసే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దాన్ని జనరంజకంగా పోషించడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నేడు మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
గుమ్మడిగా సుపరిచితులైన గుమ్మడి వెంకటేశ్వరరావు 1927, జూలై 9న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలోని ఓ సాధారణ రైతు కుటుంబంలో బసవయ్య, బుచ్చెమ్మ దంపతులకు జన్మించారు. బాల్యం నుంచీ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలనే తపన ఉండేది. ఎస్.ఎస్.ఎల్.సి. దాకా చదువుకున్న గుమ్మడికి పుచ్చలపల్లి సుందరయ్య ఉపన్యాసాలు భలేగా నచ్చేవి. దాంతో గుమ్మడి కూడా కమ్యూనిస్టు భావజాలాన్ని ఒంటపట్టించుకున్నారు. కాలేజీలో చేరితే చెడిపోతాడని భావించిన గుమ్మడి కన్నవారు ఆయనకు 17 ఏళ్ళ వయసులోనే మేనమామ కుమార్తె లక్ష్మీ సరస్వతితో పెళ్ళి చేశారు. చివరకు ఎలాగోలా హిందూ కళాశాలలో చేరి ఇంటర్ చదివారు.
ఇంటర్ పాస్ కాకపోవడంతో వ్యవసాయంలో దింపారు పెద్దలు. వ్యవసాయం చేస్తూనే పుస్తకాలను విపరీతంగా చదివేవారు గుమ్మడి. ఆ సమయంలోనే ఆయన మనసు నటనవైపు మళ్ళింది. మెల్లగా నాటకాలు వేయసాగారు. తరువాత మిత్రుల ప్రోత్సాహంతో మదరాసు చేరి, సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘అదృష్టదీపుడు’ చిత్రంలో తొలిసారి గుమ్మడి తెరపై కనిపించారు. ‘అదృష్ట దీపుడు’ తరువాత గుమ్మడి నటించిన చిత్రాలేవీ అంతగా ఆయనకు పేరు సంపాదించి పెట్టలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ స్వస్థలం పోదామని నిర్ణయించిన గుమ్మడికి, ఎన్టీఆర్ తమ ఎన్.ఏ.టి. సంస్థ నిర్మించిన చిత్రాలలో మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. అలా రామారావు సొంత చిత్రాలు – “పిచ్చి పుల్లయ్య, తోడుదొంగలు, జయసింహ”లలో గుమ్మడి కీలక పాత్రలు పోషించారు.
ఆ తరువాత గుమ్మడి మరి వెనుదిరిగి చూసుకోలేదు. ‘తోడుదొంగలు’లో గుమ్మడి వయసు మీరిన పాత్ర ధరించడం చూసిన పి.పుల్లయ్య తన ‘అర్ధాంగి’ చిత్రంలో ఏయన్నార్, జగ్గయ్యకు తండ్రిగా నటించే పాత్రను గుమ్మడికి ఇచ్చారు. తన కన్నా వయసులో పెద్దవారయిన నటులకు తండ్రిగా నటించడంతో అప్పటి నుంచీ గుమ్మడికి అధికంగా తండ్రి పాత్రలే పలకరించసాగాయి. ఒకే రకం పాత్రలు ధరించినా, వాటిలో తనదైన బాణీ ప్రదర్శించడానికి గుమ్మడి ప్రయత్నించేవారు. గుణచిత్ర నటునిగా గుమ్మడి తిరుగులేని వైభవం చూశారు. ప్రతినాయక పాత్రల్లోనూ తేనె పూసిన కత్తిలా నటించడంలో గుమ్మడి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కడదాకా తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలనే తపించారు గుమ్మడి. ఆయన చివరి చిత్రంగా ‘అవధూత కాశినాయన చరిత్ర’ నిలచింది.
అనేక విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా నటించిన గుమ్మడికి ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రం ఎనలేని పేరు సంపాదించి పెట్టింది. ఈ చిత్రం ద్వారా ఆయనకు రాష్ట్రపతి బహుమతి కూడా లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. రాష్ట్రప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’తో గౌరవించింది. సాత్వికాభినయంలో తనకు తానే సాటి అనిపించుకున్న గుమ్మడి పేరు తలచుకోగానే ఆయన ధరించిన అనేక వైవిధ్యమైన పాత్రలు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి.అదీ గుమ్మడి అభినయంలోని ప్రత్యేకత! గుమ్మడి పేరు తలచుకోగానే ఈ నాటికీ ఆయన పోషించిన వందలాది వైవిధ్యమైన పాత్రలే ముందుగా మన మదిలో మెదలుతాయి. తన చివరి రోజుల్లో చిత్రసీమలో తన అనుభవాలను “తీపి జ్ఞాపకాలు – చేదు గుర్తులు’ పేరుతో పుస్తకం రాసుకున్నారు. 2010 జనవరి 26న గుమ్మడి తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్రసీమ చూసిన మహానటుల్లో గుమ్మడి పేరు శాశ్వతంగా నిలచిపోతుంది. నవతరం ప్రేక్షకులు సైతం గుమ్మడి మెథడ్ యాక్టింగ్ చూసి ముగ్ధులవుతున్నారు. భౌతికంగా ఆయన లేకపోయినా తను చేసిన సినిమాల ద్వారా ప్రతిరోజూ ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంటారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు