ఏడేళ్లు పైబడిన పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి!

- July 15, 2025 , by Maagulf
ఏడేళ్లు పైబడిన పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి!

న్యూఢిల్లీ: ఏడు సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రులు, సంరక్షకులకు విజ్ఞప్తి చేసింది.ఇప్పటికే ఐదేళ్లు నిండినా బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్ చేయని పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) చేయించుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) స్పష్టంచేసింది.

ఇందుకోసం UIDAI రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు SMS అలర్ట్‌లు పంపించడం ప్రారంభించింది. చిన్నపిల్లలు ఐదేళ్లు నిండే వరకు ఆధార్ కోసం ఫోటో, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా రుజువులు మాత్రమే తీసుకుంటారు. చిన్నారుల శరీర లక్షణాలు అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆ వయసులో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ తీసుకోరు.

పిల్లలకి ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, కొత్త ఫోటోలను నమోదు చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియను 5 – 7 సంవత్సరాల మధ్య ఉచితంగా చేయవచ్చు. ఏడు సంవత్సరాల వయస్సు తర్వాత, బయోమెట్రిక్‌లను నవీకరించడానికి UIDAI నామమాత్రపు రుసుము రూ.100 మాత్రమే నిర్ణయించింది.

పాఠశాల అడ్మిషన్లు, ప్రవేశ పరీక్షలు, స్కాలర్‌షిప్‌లు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పథకాలు వంటి వివిధ ప్రభుత్వ సేవలను పొందేందుకు నవీకరించబడిన ఆధార్ అవసరం.. ప్రభుత్వ పథకాలను సజావుగా పొందేందుకు, సేవలలో అంతరాయం కలగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల ఆధార్ బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయ‌డం తప్పనిసరి అని ప్రభుత్వం, UIDAI పునరుద్ఘాటిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com