సహజ నటి-సౌందర్య

- July 18, 2025 , by Maagulf
సహజ నటి-సౌందర్య

సౌందర్య…ఈ పేరు వినగానే ఇప్పటికీ ఎంతోమంది మదిలో వీణలు మోగుతాయి. సౌందర్య అందమైన అభినయం మరపురాకుండా మధురూహలలో పయనించేలా చేస్తుంది. సౌందర్య ముగ్ధమనోహర రూపం చూసి, ఇలాంటి అమ్మాయి పరిచయమయితే ఎంత బాగుంటుందో అనుకుంటూ కలల్లో తేలిపోయినవారూ ఉన్నారు.సౌందర్య లాంటి అమ్మాయి కావాలని కోరుకున్న తల్లిదండ్రులూ లేకపోలేదు.అలాంటి నేస్తం ఉంటే బాగుంటుందని భావించిన మనసులకూ కొదువలేదు.ఏమయితేనేమి, సౌందర్యను ఆమె మాతృభూమి కన్నడ నేలకన్నా మిన్నగా తెలుగువారు అభిమానించారు.నేడు సహజ నటి సౌందర్య జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...

సౌందర్య అసలు పేరు కె.యస్.సౌమ్య. 1972 జూలై 18న బెంగళూరులో జన్మించారు. సౌందర్య తండ్రి సత్యనారాయణకు చిత్రసీమతో అనుబంధం ఉంది. ఆయన రచయితగా, నిర్మాతగా కన్నడ నాట సాగారు. అందువల్ల చదువుల్లో ఎంతో తెలివైన సౌందర్యకు సినిమాల్లో కనిపించాలన్న ధ్యాస కూడా అధికంగా ఉండేది. దాంతో ఎమ్.బి.బి.ఎస్. తొలి సంవత్సరం పూర్తి కాగానే, తన మనసులోని మాటను కన్నవారి ముందు పెట్టింది. అసలే, ఆమె తండ్రి కూడా చిత్రసీమకు సంబంధించిన వారు కావడంతో కూతురు కోరికను కాదనలేకపోయారు.

‘గంధర్వ’ అనే కన్నడ చిత్రంలో తొలిసారి నటించిన సౌందర్య అదే సంవత్సరం తెలుగులో పి.ఎన్.రామచంద్రరావు రూపొందించిన ‘మనవరాలి పెళ్ళి’లో నటించారు. ఆ సమయంలోనే కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘రైతు భారతం’లోనూ ఆమెకు అవకాశం లభించింది. ఆ చిత్రాలు ఆమెకు అంతగా కలసి రాకున్నా, అప్పట్లోనే దర్శకునిగా మారిన ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలు “రాజేంద్రుడు – గజేంద్రుడు, మాయలోడు, నంబర్ వన్” సౌందర్యకు స్టార్ డమ్ సంపాదించి పెట్టాయి. సక్సెస్ రూటులో సాగుతున్న సౌందర్యకు టాప్ హీరోస్‌తో నటించే ఛాన్స్ దక్కింది. కృష్ణతో ‘నంబర్ వన్’, నాగార్జునతో ‘హలో బ్రదర్’, బాలకృష్ణతో ‘టాప్ హీరో’, వెంకటేశ్ తో ‘సూపర్ పోలీస్’మోహన్ బాబుతో ‘పెదరాయుడు’, చిరంజీవితో ‘రిక్షావోడు’ వంటి చిత్రాలలో నటించేశారామె. వీటిలో కొన్ని బంపర్ హిట్స్ అయ్యాయి. దాంతో సౌందర్యకు జనాల్లో మరింత క్రేజ్ పెరిగింది.

సౌందర్య ఎందరు హీరోలతో నటించి విజయాలు చూసినా, ఆమె సక్సెస్ రేట్ వెంకటేశ్ తోనే ఎక్కువగా ఉంది. వెంకటేశ్ హిట్ పెయిర్‌గా ఆమె జైత్రయాత్ర చేసిందనే చెప్పాలి. “ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం, రాజా, జయం మనదేరా” వంటి వెంకటేశ్ చిత్రాలలో సౌందర్య అందాల అభినయం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. జనం సౌందర్యను ‘మరో సావిత్రి’ అని కీర్తించారు. చీరకట్టులోనే కుర్రకారును కిర్రెక్కించిన సౌందర్య, ‘మరో సావిత్రి’ అన్న పేరు నిలుపుకోవడానికి అభినయ ప్రాధాన్యం  చిత్రాలకే జై కొట్టారు.

ఆమె నటించిన పలు కుటుంబకథా చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. తరువాతి రోజుల్లో సౌందర్య చుట్టూ తిరిగే కథలతోనే చిత్రాలు రూపొందడం మొదలయ్యాయి. అందువల్ల టాప్ హీరోస్ సినిమాల్లో సౌందర్య వెలగడం తగ్గింది. కానీ, అప్పట్లో సౌందర్య చిత్రాలను చూడటానికి జనం థియేటర్లకు పరుగులు తీశారు. సౌందర్య నటిగా మూడు నంది పురస్కారాలు, రెండు కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఆరు సౌతిండియా ఫిల్మ్ ఫెర్ అవార్డ్స్ మరియు నిర్మాతగా జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే, దక్షిణ భారత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ యాక్ట్రస్‌గా ఇప్పటికి కొనియాడబడుతూనే ఉన్నారు.  

సౌందర్య గొప్ప నటిగానే కాదు సామాజిక సేవా రంగంలో సైతం క్రియాశీలక పాత్ర పోషించారు. అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' (ASSET) ద్వారా తన భర్త, ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్నాటక, ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి పరచారు. ఓ అనాథాశ్రమాన్ని, 'అమర సౌందర్య విద్యాలయ' పేరుతో ఓ పాఠశాల స్థాపించారు. తన తమ్ముడు అమరనాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అంతేగాక తన భర్త, ఆడపడుచుల కలలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు, సహాయ సహకారాలను అందించారు. వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉంది.

2004 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు ప్రచారం చేయడానికి  ప్రచారం చేయడానికి వెళ్తూ హెలికాప్టర్ క్రాష్‌లో మరణించారు. అలా తన 31వ ఏట కన్నుమూశారు. ఆ ప్రమాదంలో ఆమెకు తొలి నుంచీ అండగా నిలచిన ఆమె అన్న అమర్ కూడా కన్నుమూశారు. సౌందర్య సినీ పరిశ్రమలోని అగ్ర హీరోలందరి సరసన నటిస్తుందని, 8 ఏళ్ళు చాలా బిజీగా ఉంటుందని, 2004లో ఆమె కెరీర్‌ ఎండ్‌ అవుతుందని తొలి సినిమా సమయంలోనే సౌందర్య తండ్రి సత్యనారాయణ ఆమె జాతకం చెప్పారు. ఏది ఏమైనా సౌందర్య అందాల అభినయాన్ని తెలుగువారు ఎన్నటికీ మరచిపోలేరు. బుల్లితెరపై సౌందర్య చిత్రాలు ప్రదర్శితమవుతున్న సమయంలో ఆ నాటి అభిమానులు ఆమె అభినయాన్ని చూసి ఇప్పటికీ పరవశించి పోతూనే ఉన్నారు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com