మహిళలకు ఫ్రీ బస్సు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

- July 21, 2025 , by Maagulf
మహిళలకు ఫ్రీ బస్సు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పుడు మరికొన్ని స్కీమ్స్ అమలుపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దీని అమలుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇందులో భాగంగా వారికి పలు ఆదేశాలు ఇచ్చారు.

మహిళలకు జీరో ఫేర్‌ టికెట్‌ ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? ఉచిత ప్రయాణంతో ఎంత మేర డబ్బులు ఆదా అయ్యాయి? వంటి వివరాలు మహిళలకు ఇచ్చే జీరో ఫేర్ టికెట్ లో పొందుపరచాలని చెప్పారు. మహిళకు ఫ్రీ బస్సు స్కీమ్ తో ఏ రాష్ట్రాలకు ఎంత భారం అనే అంశంపైనా సీఎం చర్చించారు.

ఈ పథకం ఆర్టీసీకి భారం కాకుండా ఆదాయ మార్గాలు అన్వేషించాలని అధికారులతో చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నిర్వహణ వ్యయం తగ్గింపుతో సంస్థను లాభాల బాట పట్టించాలన్నారు. లాభాల ఆర్జన విధానాలు, మార్గాలపై కార్యాచరణ రూపొందించాలన్నారు. అంతేకాదు ఇక నుంచి ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులతో చెప్పారు. ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్‌గా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఇందుకు అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలన్నారు. అన్ని ఆర్టీసీ డిపోల్లో ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com