తెలంగాణ రాజకీయవేత్త-కేటీఆర్

- July 24, 2025 , by Maagulf
తెలంగాణ రాజకీయవేత్త-కేటీఆర్

కేటీఆర్..తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్న నాయకుడు. వారసత్వ రాజకీయాలే పూనాదిగా వచ్చినా...అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు. తెలంగాణ ఐటీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో ఆయన చరిష్మా ప్రధాన పాత్ర పోషించింది.పార్టీలతో సంబంధం లేకుండా గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా కితాబులు అందుకున్నారు. పదేళ్ల పాలన తర్వాత ప్రతిపక్షంలో వచ్చిన దగ్గర నుండి ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలను చైతన్య పరుస్తూ పోతున్నారు.నేడు తెలంగాణ రాజకీయవేత్త కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం... 

కేటీఆర్ , రాము అని పిలుచుకునే కల్వకుంట్ల తారక రామారావు 1976, జూలై 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల తాలూకా కొదురుపాక గ్రామంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, శోభ దంపతులకు తొలి సంతానంగా జన్మించారు. కేటీఆర్ హైదరాబాద్ నిజాం కాలేజీ నుంచి బీఎస్సి మైక్రోబయలాజీ, పూణేలో పీజీ పూర్తి చేసి అమెరికాలో ఎంబీఏ చదివారు. అక్కడ ప్రముఖ సంస్థల్లో మనేజర్ హోదాలో పనిచేశారు. 

కేటీఆర్ తండ్రి కేసీఆర్ ఉరఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు..విద్యార్థి నేత నుంచి తెలంగాణ రాష్ట్రానికి మొదట ముఖ్యమంత్రి అయ్యేదాక అవిశ్రాంతంగా పోరాటాలు చేశారు.తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు చరిత్రలో కనీవినీ ఎరుగరు.తండ్రి తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలోనే కేటీఆర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. తండ్రి స్థాపించిన టీఆర్ఎస్ (ఇప్పటి బిఆర్ఎస్)లో చేరి ఉద్యమంలో భాగమయ్యారు. అప్పటికే మేనబావ హరీశ్ రావు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉండగా, కేటీఆర్ సైతం బావకు తోడుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.2009లో సిరిసిల్ల నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికైన కేటీఆర్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలోనే కేటీఆర్ తన గళాన్ని అసెంబ్లీ లోపల, వెలుపల గట్టిగా వినిపించేవారు. ముఖ్యంగా తండ్రి కేసీఆర్, బావ హరీష్ తర్వాత పార్టీలో నిర్ణయ శక్తిగా అవతారం ఎత్తారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన అసెంబ్లీలో తెరాస ఘన విజయం సాధించి కేసీఆర్ సీఎం కాగా, కేటీఆర్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.2014 నుండి 2019 వరకు హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పకడ్బందీగా తన ప్రణాళికలు అమలు పరిచారు.కేటీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. 

2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ వచ్చారు. అయితే, మంత్రివర్గంలో కేటీఆర్ లేని లోటును గుర్తించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత 2019లో ఐటీ, పరిశ్రమలు మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డవలెప్మెంట్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2023 వరకు కేటీఆర్ కొనసాగారు. ఆ ఐదేళ్ళ కాలంలో కేటీఆర్ కీర్తి ఖండూతి ఎక్కవ కావడం, తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల  వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్ ఈ విషయాల్లో కొంచం కూడా శ్రద్ద వహించక తన ధోరణిలోనే కొనసాగడం వల్ల రాజకీయంగా భారీ మూల్యాన్ని 2023 ఎన్నికల్లో చెల్లించారు. 2023లో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ రాజకీయ వారసత్వ పోరులో మొదట వెనకబడ్డా, ఆ తర్వాత తన బావ మీద పై చేయి సాధించేందుకు పోటీ పడుతున్నారు. 

రాజకీయ అంతర్గత కలహాలు కారణంగా బిఆర్ఎస్ పార్టీ కూడా కొంత బలహీనంగా కనిపిస్తున్నా, వాటిని కనిపియకుండా చూసేందుకు చూస్తూ ఉన్నారు.రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో కేటీఆర్ తెలంగాణలో మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలించాలని కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

--డి.వి.అరవింద్(మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com