ఎస్తోనియా తో తెలంగాణ ప్రభుత్వ పరస్పర సహకారం..

- July 25, 2025 , by Maagulf
ఎస్తోనియా తో తెలంగాణ ప్రభుత్వ పరస్పర సహకారం..

హైదరాబాద్: ఇ-గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ‘ఎస్తోనియా’ సహకారం తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ఆయన ప్రశంసించారు.శుక్రవారం ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ ఆధ్వర్యంలో సచివాలయంలో తనను కలిసిన వాణిజ్య ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వీరిలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజి, కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఆరోగ్యరంగాల ప్రతినిధులున్నారు.తెలంగాణా రాష్ట్ర ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని, వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా తమకు సాంకేతిక సహకారం అందించాలని శ్రీధర్ బాబు కోరారు.

వాణిజ్యం, ఏఐ సాంకేతికతలో కూడా కలిసి పనిచేయాలన్న‌ ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. ప్రజా సేవల విభాగాలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఇ-గవర్నెన్స్ కీలకమని ఆయన తెలిపారు. ‘ఇందులో ఎస్తోనియా తోడ్పాటును కోరుతున్నాం.సైబర్ సెక్యూరిటీలో కూడా పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.డ్రోన్ టెక్నాలజీలో తెలంగాణాలో గణనీయ అభివృద్ధి సాధించిందన్నారు.ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో హైదరాబాద్ లో తయారైన డ్రోన్లు త‌మ శత్రుదేశానికి భారీ నష్టం కలిగించాయన్నారు.భవిష్యత్ యుద్ధాలు డ్రోన్లు, సైబర్ దాడులతోనే జరుగుతాయన్నారు.ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తిలో ముందున్నామ‌న్నారు.

ఈ రంగాల్లో కూడా కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలన్నారు.సెప్టెంబరులో తమ దేశం సందర్శించాలని ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ చేసిన అభ్యర్థనకు శ్రీధర్ బాబు స్పందించారు. తమ ప్ర‌భుత్వ‌ అధికారుల బృందం వస్తుందని, విద్య, ఇ గవర్నెన్స్, ఏఐ, రోబోటిక్స్ లో పరస్పరం సహకరించుకునే విషయంపై చర్చిస్తారని తెలిపారు.ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్,ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీ సేవ) కార్పోరేషన్ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com