న‌వ‌ర‌స న‌ట‌నాసార్వ‌భౌమ-కైకాల

- July 25, 2025 , by Maagulf
న‌వ‌ర‌స న‌ట‌నాసార్వ‌భౌమ-కైకాల

తెలుగు చిత్ర‌సీమ‌లో ఎంద‌రో త‌మ‌దైన అభిన‌యంతో జ‌నాన్ని విశేషంగా ఆక‌ట్టుకొని అల‌రించారు.వారిలో కొంద‌రు న‌ట‌సార్వ‌భౌములుగా, మ‌రికొంద‌రు న‌ట‌చ‌క్ర‌వ‌ర్తులుగా, న‌ట‌స‌మ్రాట్టులుగానూ, ఇంకొంద‌రు న‌ట‌విరాట్టులుగానూ విరాజిల్లారు. తెలుగు చిత్ర‌సీమ‌లో అల‌రించిన అరుదైన న‌టుల‌లో నిస్సందేహంగా కైకాల స‌త్య‌నారాయ‌ణ పేరు చెరిగిపోని, త‌రిగిపోని చ‌రిత్ర‌ను సొంతంచేసుకుంది అన‌డం అతిశ‌యోక్తి కాదు.నేడు టాలీవుడ్ దిగ్గజ నటుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...

కైకాల స‌త్య‌నారాయ‌ణ 1935 జులై 25న కృష్ణాజిల్లా కౌతారంలో జ‌న్మించారు. గుడ్లవ‌ల్లేరులో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన స‌త్య‌నారాయ‌ణ‌. విజ‌య‌వాడ‌లో ఇంట‌ర్మీడియ‌ట్, గుడివాడ కాలేజీలో ప‌ట్టా పుచ్చుకున్నారు. చ‌దువుకొనే రోజుల్లోనే నాట‌కాలు వేస్తూ సాగారు. కొన్ని నాట‌కాల్లో స్త్రీ వేషాలూ వేసిఆక‌ట్టుకున్నారు. మిత్రులు ఆయన్ను `అచ్చు ఎన్టీఆర్‌లా ఉన్నావ్` అనేవారు. ఆ మాటలే ఆయ‌న‌లో ఆత్మ‌విశ్వాసం పెంచింది. ఓ సారి స‌త్య‌నారాయ‌ణ వేసిన నాట‌కాన్ని చూసిన కొంద‌రు సినిమా జ‌నం ప్ర‌ముఖ నిర్మాత డి. ఎల్. నారాయ‌ణ‌కు అత‌ను ఎన్టీఆర్‌ పోలిక‌ల‌తో ఉన్నార‌ని చెప్పారు. డి. య‌ల్ . నారాయ‌ణ తాను తీస్తోన్న `సిపాయి కూతురు`లో జ‌మున స‌ర‌స‌న నాయ‌కునిగా స‌త్య‌నారాయ‌ణ‌ను ఎంచుకున్నారు.

కొత్త హీరో,అందునా జ‌మున వంటి సీనియ‌ర్ స‌ర‌స‌న ఏమి బాగుంటుంద‌ని ఫైనాన్సియ‌ర్స్ పెద‌వి విరిచారు. డి. య‌ల్. మాత్రం జంకకుండా స‌త్య‌నారాయ‌ణ‌నే ఎంచుకున్నారు. మొత్తానికి తొలి చిత్రం ‘సిపాయి కూతురు’లోనే జ‌మున స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కింది. కానీ, ఆ చిత్రం ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో స‌త్య‌నారాయ‌ణ‌కు మ‌రి వేషాలు ద‌క్క‌లేదు. ఆ స‌మ‌యంలో బి.విఠ‌లాచార్య స‌త్య‌నారాయ‌ణ‌ను ప్రోత్స‌హించారు.తాను తెర‌కెక్కించిన ‘క‌న‌క‌దుర్గ పూజా మ‌హిమ‌’లో స‌త్య‌నారాయ‌ణ‌కు కీల‌క పాత్ర‌ను ఇచ్చారు.అదే స‌మ‌యంలో ఎన్టీఆర్‌కు స‌న్నిహితుడైన య‌స్. డి. లాల్ ద‌ర్శ‌కునిగా తొలి ప్ర‌య‌త్నంలో ‘స‌హ‌స్ర శిర‌చ్ఛేద అపూర్వ చింతామ‌ణి’ తెర‌కెక్కిస్తూ అందులో రాజ‌కుమారుని పాత్రను స‌త్య‌నారాయ‌ణ‌కు ఇచ్చారు.ఈ రెండు చిత్రాలు స‌త్య‌నారాయ‌ణ‌కు న‌టునిగా మంచి మార్కులు సంపాదించిపెట్టాయి.

ఎన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేసిన ‘రాముడు–భీముడు’లో ఎన్టీఆర్‌కు `బాడీ డ‌బుల్`గా స‌త్య‌నారాయ‌ణ నటించారు. ఆ సినిమా విడుద‌ల‌యి, ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో ఎన్టీఆర్ బాడీ డ‌బుల్‌గా న‌టించిన స‌త్య‌నారాయ‌ణ‌కు కూడా మంచి గుర్తింపు ల‌భించింది. ఆ త‌రువాత య‌న్టీఆర్ అనేక చిత్రాల‌లో స‌త్య‌నారాయ‌ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తూ సాగారు. ఆయ‌న‌కు న‌టునిగా ట‌ర్నింగ్ పాయింట్ ఎన్టీఆర్ ‘ఉమ్మ‌డి కుటుంబం’తోనే ల‌భించింది. అందులో ఎన్టీఆర్‌కు రెండో అన్న‌గా స‌త్య‌నారాయ‌ణ న‌టించారు. క‌రుణ‌ర‌స ప్ర‌ధాన‌మైన ఆ పాత్ర‌తో న‌టునిగా స‌త్య‌నారాయ‌ణ‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. చాలా చిత్రాల‌లో స‌త్య‌నారాయ‌ణ క్రూర పాత్ర‌లే ధ‌రించారు. అప్ప‌టి దాకా రాజ‌నాల‌, నాగ‌భూష‌ణం వంటివారు ప్ర‌తినాయ‌కులుగా రాణించారు.

ఎన్టీఆర్ హీరోగా కె. విశ్వ‌నాథ్ తెర‌కెక్కించిన `నిండు హృద‌యాలు`లో స‌త్య‌నారాయ‌ణ ప్ర‌ధాన ప్ర‌తినాయ‌కుడు. ఆ సినిమా విజ‌యంతో ఇత‌ర హీరోలు సైతం స‌త్య‌నారాయ‌ణ‌నే త‌మ చిత్రాల‌లో విల‌న్ గా న‌టించాల‌ని కోరారు. అలా ఒక్క యేడాదిలోనే స‌త్య‌నారాయ‌ణ స్టార్ యాక్ట‌ర్ అయిపోయారు. ఎన్టీఆర్, ఏయ‌న్నార్ చిత్రాల‌లోనే కాదు అప్ప‌ట్లో వ‌ర్ధ‌మాన క‌థానాయ‌కులుగా రాణిస్తున్న శోభ‌న్ బాబు, కృష్ణ చిత్రాల‌లోనూ ఆయ‌నే విల‌న్ గా న‌టించి మెప్పించేవారు. కె.విశ్వ‌నాథ్ రూపొందించిన `శార‌ద‌` చిత్రంలో నాయిక అన్న పాత్ర‌లో స‌త్య‌నారాయ‌ణ కరుణ ర‌సం కురిపించారు. ఆ సినిమా కూడా జ‌నాన్ని విశేషంగా అల‌రించింది. దాంతో కైకాల కేవ‌లం జ‌డిపించే పాత్ర‌లే కాదు, క‌న్నీరు పెట్టించే పాత్ర‌ల్లోనూ మెప్పించ‌గ‌ల‌ర‌ని నిరూపించుకున్నారు.

తెలుగునాట మ‌న‌కు క‌నిపించే న‌ట‌సార్వ‌భౌములు ముగ్గురే – వారు విశ్వ‌విఖ్యాత న‌టసార్వ‌భౌమ ఎన్టీఆర్, విశ్వ న‌ట‌ సార్వ‌భౌమ ఎస్వీఆర్, న‌వ‌ర‌స న‌ట‌నాసార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ‌. ప్ర‌తినాయ‌కునిగా స‌త్య‌నారాయ‌ణ జ‌డిపించారు. గుణ‌చిత్ర‌న‌టునిగా మురిపించారు. హాస్యంతో అల‌రించారు. క‌రుణంతో క‌ట్టిప‌డేశారు. ఒక్క‌టేమిటి న‌వ‌ర‌సాల‌నూ స‌త్య‌నారాయ‌ణ అల‌వోక‌గా పండించారు. అందుకే జ‌నం ఆయ‌న‌ను `న‌వ‌ర‌స న‌ట‌నాసార్వ‌భౌమ‌` అంటూ కీర్తించారు. పౌరాణిక‌, జాన‌ప‌ద‌, చారిత్ర‌క‌, సాంఘికాల్లో స‌త్య‌నారాయ‌ణ త‌న‌దైన బాణీ ప‌లికించారు. య‌న్టీఆర్, య‌స్వీఆర్ వంటి మ‌హాన‌టులు ధ‌రించిన య‌మ‌ధ‌ర్మ‌రాజు, రావ‌ణుడు, దుర్యోధ‌నుడు వంటి పాత్ర‌ల‌ను పోషించి మెప్పించారు స‌త్య‌నారాయ‌ణ‌. మూడు త‌రాల హీరోల చిత్రాల‌లో ప్ర‌తినాయ‌క పాత్ర‌లు పోషించి అల‌రించారాయ‌న‌.

ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం కారణంగా తెదేపా ఆవిర్భావం నాటి నుండి ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసేవారు. కైకాలను మినిష్టర్ చేయాలని అనుకునేవారు. ఒకసారి ఎమ్యెల్యే టిక్కెట్ కూడా ఇచ్చే సమయంలో షూటింగ్ కారణంగా అనుకున్న సమయానికి రాలేక కైకాలకు టిక్కెట్ మిస్సైయ్యింది. అయినప్పటికి కైకాలను రాజకీయంగా ప్రోత్సహించాలని భావించి, పలు ప్రభుత్వ సినీ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కమిటీల్లో కైకాలను భాగం చేసేవారు. ఎన్టీఆర్ ఆకస్మిక మరణం తర్వాత అసలు రాజకీయాల్లోకి వెళ్ళ కూడదని అనుకున్నప్పటికి అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రోద్బలంతో  1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు..1998 ఎన్నికల్లో ఓడిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని కొనసాగించారు.. 777 చిత్రాల్లో నటించి మెప్పించారు.. కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం సిపాయి కూతురు కాగా.. ఆయన నటించిన చివరి చిత్రం సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన మహర్షి.. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన కైకాల.. 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు.. 200 మందికిపైగా దర్శకులతో పనిచేశారు. 100 రోజులు ఆడిన కైకాల నటించిన చిత్రాలు 223 ఉన్నాయి.. అర్ధశతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు 59.. సంవత్సరం ఆడిన చిత్రాలు 10 ఉన్నాయి.. సినీ రంగంలో తనకు గురు సమానుడైన ఎన్టీఆర్‌తో కలిసి దాదాపు 101 చిత్రాల్లో నటించారు.

 కైకాల సినిమా రంగానికి ఎంతో సేవ చేశారు. ఆయన చేసిన సేవలకు గానూ 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది. అలాగే వివిధ సంస్థల నుంచి నటశేఖర, కళా ప్రపూర్ణ, నట రత్న వంటి అత్యున్నత  బిరుదులను అందుకున్నారు. నిర్మాత‌గానూ కొన్ని చిత్రాలు నిర్మించి ఆక‌ట్టుకున్నారు. రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల.. కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు లాంటి చిత్రాలను నిర్మించారు.. 1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు. వయోభారం కారణంగా 2014 నుంచి సినిమాలు తగ్గించుకుంటూ పోయిన కైకాల 2019లో వచ్చిన మహర్షి చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అలాగే, కన్నడ ‘కేజీఎఫ్’ సీరిస్‌కు కైకాల తెలుగులో సమర్పకులుగా వ్యవహరించారు. సినీ పరిశ్రమ వర్గాల వారికి కావాల్సిన వ్యక్తిగా, అజాత శత్రువుగా నిలిచిన సత్యనారాయణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తన 87వ ఏట 2022,డిసెంబరు 23న  హైదరాబాదులోని తన నివాసంలో కన్నుమూశారు. భౌతికంగా మన మధ్య లేకున్నా, బుల్లితెర మీద ఆయన నటించిన చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచే ఉన్నారు.    

  -డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com