చేనేత బంధు-ప్రగడ కోటయ్య
- July 26, 2025
రాజకీయాలను వ్యక్తిగత స్వార్థం కోసం, అక్రమార్జన కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉంటారు.అయితే వారు తాత్కాలికంగా తెరమీద కనపడినప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారు. కానీ కొంతమంది తమ జీవితాన్ని పణంగా పెట్టి లక్ష్యశుద్ధితో నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉంటారు.అలాంటివాళ్లు సమకాలీన సమాజంలో అంతగా గుర్తించబడకపోయినా తర్వాతి తరాలు వారిని స్మరించుకుని కీర్తించుకుంటారు.వారి చరిత్రను లిఖించి భావితరాలకు అందిస్తారు.అలాంటి వారిలో నేతన్నల పరిరక్షణ కోసం అహర్నిశలు ఆరాటపడి ఉద్యమ భావజాలంతో చేనేత రంగాన్ని నూతన పుంతలు తొక్కించి నాటి సమాజం, ప్రభుత్వంతో చేనేత రంగ పితగా గుర్తించబడిన ప్రజా ఉద్యమకారుడు, జాతీయోద్యమ నాయకుడు ప్రగడ కోటయ్య. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం....
ప్రగడ కోటయ్య 1915, జూలై 26న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని ఉమ్మడి గుంటూరు జిల్లా నిడుబ్రోలు గ్రామంలోని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు జన్మించారు.ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివిన తర్వాత బాపట్ల, చీరాలకు దగ్గర్లోని ఈపురుపాలెంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కోటయ్య తోలి నుంచి తన గ్రామానికే చెందిన రైతు నాయకుడు ఆచార్య రంగా అంటే ఎంతో అభిమానం.ఆయన సూచనల మేరకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసులోని టెక్స్‌టైల్ ఇన్సిట్యూట్‌లో చదివి అక్కడ సూపర్ వైజర్‌గా పనిచేశారు. ఆ అనుభవంతో 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా ఉద్యోగంలో చేరి, సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసి విశేష కృషి చేయడానికి తోడ్పడింది.
1945లో ఏర్పడిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ వీవర్స్ కాంగ్రెస్ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి ఆ రంగంలోని కార్మికుల సమస్యల పరిష్కారంలో విశేషంగా కృషి చేశారు. అలాగే భారత ప్రభుత్వ చేనేత రంగ ప్రతినిధిగా నియామకమైన కోటయ్య శ్రీలంక, బ్రిటన్, చైనా ,హాంకాంగ్ వంటి తదితర దేశాలలో పర్యటించి చేనేత రంగంలోని అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. ఆయన సారథ్యంలో 1939లో జరిగిన మద్రాసు రాష్ట్ర కేంద్ర చేనేత సహకార సంఘం ఎన్నికల్లో చేనేత నాయకులు ఎన్నికయ్యే విధంగా కృషి చేసి సాధించారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో 1941లో దేశవ్యాప్త చేనేత రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు నియమించిన ‘థామస్ కమిటీ’ని గుంటూరు జిల్లాకు ఆహ్వానించి వంద పేజీల మెమోరాండం కార్మికుల సమస్యలపై ఆ కమిటీకి అందజేసి ప్రాతినిధ్య ధోరణికి తెరతీశారు.
1942లో మద్రాస్ రాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘాన్ని చైతన్యవంతం చేయడంలో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.ఆ సందర్భంలో నూలు కొరతను అధిగమించేందుకు, నూలు ధరలు తగ్గించి స్థిరీకరణ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రక్షణ యాత్రలు నడిపి చరిత్ర సృష్టించారు.కోటయ్య నాయకత్వంలో చేనేత పరిశ్రమకు నూలు సరఫరా చేయాలని, నూలు ధరలు అదుపులో ఉంచాలని, నూలు కొరతకు కారణమైన ఎగుమతులను ఆపాలని ఆందోళన చేసినా 1950 వరకు ఎలాంటి మార్పు రాలేదు.ఆ పరిస్థితులకు నిరసనగా 1950 ఏప్రిల్ 16 నుండి జూన్ 30 వరకు 75 రోజులు సత్యాగ్రహం చేసి పదివేల మంది చేనేత కార్మికులతో ప్రదర్శన నిర్వహించడంతో కేంద్ర చేనేత పరిశ్రమల మంత్రి మద్రాసు వచ్చి చేనేత నాయకులతో చర్చలు జరిపి హామీ ఇస్తే కానీ సత్యాగ్రహాన్ని విరమించని పోరాటయోధుడు ప్రగడ కోటయ్య.
1953లో చేనేత కార్మికుల కోసం రేపల్లెలో సత్యాగ్రహం చేపట్టి జైలు శిక్ష అనుభవించాడు. చేనేత రంగంపై ఏర్పడిన కమిటీ చేసిన ప్రజావ్యతిరేక సిఫార్సులకు నిరసనగా ఉద్యమించడమే కాకుండా చేనేత కార్మికులకు ప్రయోజనం కలగడం కోసం సహకార సంఘాలు మాత్రమే పరిష్కారమని నమ్మి ఆ వైపుగా కృషి చేశాడు. ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు 200కు పైగా చేనేత సహకార సంఘాలు ఏర్పడి అసంఘటిత రంగ చేనేత కార్మికులు నేసిన బట్టలకు సరైన గిట్టుబాటు ధర లభించడానికి దోహదపడ్డాయి.చేనేత రంగంలో విప్లవాత్మక మార్పులకు తన జీవితాంతం కృషి చేసిన ధన్యజీవి ప్రగడ కోటయ్య. ఆనాడు ఆయన పెంపొందించిన చైతన్యం, ప్రభుత్వానికి చేసిన సూచనలు పునాదిగా నేడు దేశవ్యాప్తంగా చేనేత కార్మికులకు సంబంధించిన విధానం కొనసాగుతూ కాలానుగుణంగా నూతనత్వాన్ని సంపాదించుకోవడానికి కోటయ్య కృషిని పునాదిగా విశ్వసించాలి.
సుమారుగా రెండు దశాబ్దాల పాటు చేనేత రంగంతో పాటు వివిధ రంగాల శ్రామికుల కోసం చేసిన కోటయ్య చీరాల నుంచి 1952,1957 మరియు 1967లలో ఎమ్యెల్యేగా, 1974-80 వరకు ఎమ్యెల్సీగా, 1990-95 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. కిసాన్ మజూద్దర్ ప్రజా పార్టీ, కృషికార్ లోక్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీల్లో పలు కీలకమైన పదవులను నిర్వహించారు. పార్టీలు వేరైనా తన గురువైన రంగాకు సంపూర్ణ మద్దతుగా నిలిచేవారు. వీరి రాజకీయ పరిణతికి, సేవాతత్పరతకు నిదర్శనంగా మెడికల్ సెలక్షన్ కమిటీ సభ్యునిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగా పదవీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు.చేనేత రంగం అభివృద్ధికి రాజ్యసభ ఎంపీగా కోటయ్య అభిప్రాయాలు, సూచనలు, సలహాలు విన్న ఆనాటి తోటి పార్లమెంట్ సభ్యులేకాక, ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సైతం అబ్బురపడేవారు.
చేనేత వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రయోజనం కోసం పదవిలో ఉన్న సమయంలో చీరాల వద్ద 17 వేల ఎకరాలకు పైగా బంజరు భూములను పేద ప్రజలకు పంపిణీ చేసారు, అలాగే.. సముద్రతీర ప్రాంతంలో సేద్యపు నీటి సౌకర్యం కల్పించడంలో కానీ, చీరాల నెల్లూరు రాజమండ్రి పట్టణాలలో సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయడంలో కానీ వీరు చూపిన కృషి ప్రజా ప్రతినిధిగా ఎన్నైనా సేవలు అందించవచ్చని అట్టడుగు వర్గాల కోసం ప్రజా ప్రతినిధి ఏమైనా చేయవచ్చునని ప్రగడ కోటయ్య రుజువు చేసి నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు.
60వ జన్మదినం సందర్భంగా చీరాలలో జరిగిన సభలో మాజీ సీఎం బెజవాడ గోపాలరెడ్డి ‘ప్రజాబంధు’ బిరుదునిచ్చి సత్కరించారు.నిరంతరం ప్రజాజీవితం గడిపిన కోటయ్య అనారోగ్యం కారణంగా 1995, నవంబర్ 26న తన 80వ ఏట కన్నుమూశారు.చేనేత రంగానికి చేసిన సేవలకు గానూ మరణాంతరం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వెంకటగిరిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు వీరి పేరు పెట్టింది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!