ప్రజా సేవా తత్పరుడు-ఆలపాటి
- July 27, 2025
పదవిని స్వప్రయోజనానికీ, అలంకారానికీ, ఆడంబరానికీ ఉపయోగించుకుంటున్న నేటి రోజులలో 'పదవి'ని పదుగురి ప్రయోజనాలకు, సమాజ శ్రేయస్సుకు వినియోగించిన మహోన్నతులు ఆదర్శపురుషులు, నిరాడంబరజీవులు, విద్యాదాతలు, వితరణశీలురు ఆలపాటి ధర్మారావు, రైతు కుటుంబంలో జన్మించి విద్యాధికుడై, న్యాయవాదిగా ఖ్యాతిగాంచి, పలు సంస్థల పరిపాలనా బాధ్యతలు పటిష్ఠంగా నిర్వహించి, క్రియాశీలక రాజకీయాలలో ప్రవేశించి బాధ్యతాయుతమైన పదవులు అనేకం అధిష్టించి, రాజకీయ నీతిజ్ఞుడుగా, నిరంతర సేవాతత్పరుడుగా అలరారి, యావదాంధ్ర దేశానికే గర్వకారణంగా నిలచి. తెలుగువారికి చిరస్మరణీయులైన ధన్యజీవి ఆలపాటి ధర్మారావు ఎందరికో ఆదర్శనీయం... అమసరణీయం.... నేడు ఆయన మీద ప్రత్యేక కథనం..
ఆలపాటి ధర్మారావు 1930, సెప్టెంబర్ 1న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్‌లోని అవిభక్త గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అన్నవరపు లంక గ్రామంలో ఆలపాటి వెంకయ్య, శేషమ్మ దంపతులకు జన్మించారు. అన్నవరపు లంక, జంపని, కపిలేశ్వరపురం (కృష్ణా జిల్లా) గ్రామాల్లో చదివారు. ఆ తర్వాత చిలుమూరు శ్రీరామా రూరల్ రెసిడెన్షియల్ స్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత గుంటూరులోని ఎసి కాలేజీలో ఇంటర్ మరియు బీఏ చదివారు. ఆ తర్వాత విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. మాజీ హైకోర్టు జడ్జి గోగినేని రాధాకృష్ణమూర్తి, విజ్ఞాన జ్యోతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు రామ్మోహన్ రావులు ఆయనతో కలిసి చదువుకున్నారు.
1957-85 వరకు తెనాలి కేంద్రంగా న్యాయవాద వృత్తిని విజయవంతంగా నిర్వహించారు. తెనాలి బార్ అసోసియేషన్ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఎన్నికై బార్ అసోషియేషన్ అభివృద్ధికి కృషి చేశారు. తెనాలిలో విజయవంతమైన క్రిమినల్ లాయర్‌గా పేరు తెచ్చుకొని ఎందరినో న్యాయ కోవిదులుగా తీర్చి దిద్దారు. ఈనాడు తెలంగాణ, ఆంధ్ర హైకోర్టుల్లో ప్రముఖ లాయర్లుగా ఉన్న వారందరిలో పలువురు వీరి వద్ద శిక్షణ పొందారు. న్యాయవాద వృత్తి నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పలు కేసుల్లో సలహాదారుగా వ్యవహరించారు.
ధర్మారావు విద్యార్ధి దశలోనే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికి కమ్యూనిస్టు, సోషలిస్టు, రాడికల్ మరియు రైతాంగ ఉద్యమాల్లో పాల్గొన్నారు. కల్లూరి చంద్రమౌళి, కొత్తా రఘురామయ్య, ఆచార్య రంగా, లావు బాలగంగాధరావు, నన్నపనేని వెంకట్రావు మరియు ఆవుల గోపాలకృష్ణ మూర్తి వంటి ఉద్దండులతో సన్నిహితంగా మసిలారు. ఇతర పార్టీల నాయకులతో ఉన్నప్పటికి కాంగ్రెస్ వాదిగానే ధర్మారావు తెనాలి ప్రాంతంలో క్రియాశీలకంగా ఉండేవారు.తెనాలి పురపాలక సంఘం అధ్యక్షుడిగా పలు మార్లు ఎన్నికైన సోషలిస్టు నేత నన్నపునేని వెంకట్రావు వద్ద రాజకీయ దిద్దారు. ఆరోజుల్లో తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దివంగత మాజీ మంత్రి ఆలపాటి వెంకట్రామయ్య గెలుపు కోసం పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో మాత్రం కాసు బ్రహ్మానంద రెడ్డి, కొత్తా రఘురామయ్య వర్గంలో ఉండేవారు.
జంపని సహకార చక్కెర పరిశ్రమ ఛైర్మన్‌గా ఎన్నికై ఐదేళ్ళ పాటు ఆ బాధ్యతల్లో కొనసాగారు. తన హయాంలోనే నష్టాల్లో ఉన్న పరిశ్రమను లాభాల బాట పట్టించడమే కాకుండా, వంద కోట్ల రూపాయల టర్నోవర్ సాధించి పెట్టారు. ఆ తర్వాత తెనాలి అర్బన్ సహకార బ్యాంకుకు రెండు సార్లు ఎన్నికై బ్యాంకులో ఉన్నతమైన నిర్వహణ ప్రమాణాలు నెలకొల్పారు. 1967 ఎన్నికల్లో అవుతు రామిరెడ్డిని దుగ్గిరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించారు. 1978లో ఇందిరా గాంధీ పక్షాన నిలిచినప్పటికి ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుగ్గిరాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం వచ్చినప్పటికి సున్నితంగా తిరస్కరించారు. 1983లో కూడా దుగ్గిరాల నుంచి మళ్ళి అవకాశం వచ్చినా పోటీ చేయలేదు.
1985 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా సీనియర్ నేతలు & అప్పటి ఉమ్మడి ఏపీ పీసీసీ ఛీఫ్ వైఎస్సార్ కోరిక మేరకు దుగ్గిరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం సునాయాసంగా విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో దుగ్గిరాల నుంచి వేమూరు నియోజకవర్గానికి మారి తన మిత్రుడైన మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు మీద 24 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1989-93 వరకు మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన రెడ్డి హాయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 1991లో ఎ.ఐ.సి.సి సభ్యుడిగా నియమితులై మరణించే వరకు అందులోనే కొనసాగారు.
డిప్యూటీ స్పీకర్‌గా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ప్రభుత్వానికి చక్కగా మార్గదర్శనం చేస్తూ నడిపించడంలో తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించారు. స్వపక్ష, ప్రతిపక్ష సభ్యుల ఆదరాభిమానాలు చూరగొన్నారు. జనార్థనరెడ్డి హాయంలో స్పీకర్ రామ చంద్రారెడ్డికి మంత్రి వర్గంలో స్థానం దక్కడంతో స్పీకర్ వదవికి రాజీనామా చేసిన సమయంలో ధర్మారావు ఇంఛార్జ్ స్పీకర్‌గా వ్యవహరిస్తూ ప్రశాంత చిత్తంతో సభను విజయవంతంగా నిర్వహించారు. 1993-94 వరకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో హోం, రవాణా మరియు ఉన్నత విద్యా & న్యాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1994,1999లలో వేమూరు నుంచి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం పాటు అందించిన సేవలకు గానూ ఢిల్లీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వారు రాజీవ్ సద్భావన పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ధర్మారావు లాంటి ఆదర్శవాది, మానవతావాది ఆధ్యాత్మిక వాదిని ఈనాటి రాజకీయాల్లో మచ్చుకైన కనపడరు. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడని విశ్వసిస్తూ, వారి సమస్యలకు స్పందిస్తూ, వారికి ఏదో చేయాలని నిరంతరం తపించే వ్యక్తిత్వం వారిది. కులమతాల పట్టింపు లేదు. మనుషులందరూ సమానమని భావించేవారు. ఎలాంటి వ్యసనాలు లేవు. మచ్చలేని వ్యక్తి. రాజకీయ వేత్తలో ఉండే స్వార్ధం ఏ మాత్రం లేని వ్యక్తి. ముఖ్యంగా చెప్పాలంటే వీరు హరిజన పక్షపాతి. వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటూ, సహాయ కారిగా ఉండేవారు. వాళ్ళు కేసుల విషయమై ఆశ్రయించినప్పుడు, వారి నుంచి ఫీజుని కూడా తీసుకునేవారు కాదు. పైగా వారికి తిరిగి ఆర్థిక సహాయం అందించేవారు.
వరదలు వచ్చినప్పుడు ముంపుకు గురవుతున్న అన్నవరపు లంక మరియు పరిసర గ్రామాల ప్రజల కోసం చిలుమూరు వద్ద వంతెన నిర్మించారు. 1950లో వచ్చిన వరదల కారణంగా తమ స్వగ్రామానికి మరియు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ నష్టం జరిగిన సమయంలో, తనకు తోచిన సహాయం చేసి సరిపుచ్చుకోకుండా, మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వంలో రెవిన్యూ మంత్రిగా ఉన్న కల్లూరి చంద్రమౌళితో ఉన్న స్నేహంతో, వారికి లంక గ్రామాల పరిస్థితిని విపులంగా విశిదీకరించి వరద బాధితులకు సక్రమ సహాయం లభించేలా కృషి చేశారు.
స్వతహాగా నిరాడంబరుడు. నిగర్వి, నిర్మల హృదయుడైన ధర్మారావు గారి అంతరంగంలో అతులితమైన నిస్వార్థ సేవాభావం దాగి ఉండేది. తెనాలి పరిసర ప్రాంతాలు రాజకీయ రంగంలో మాత్రమే గాక ఆరోగ్య రంగంలో సైతం పేరుగాంచినవి.1980వ దశకం నాటికి తెనాలి ప్రాంతంలో కుష్టువ్యాధిని గూర్చి సరైన అవగాహన, చికిత్సా సౌకర్యాలు లేనందు వలన వ్యాధిపీడితులు నిరాశా, నిస్పృహలతో ఉండేవారు. ఆ సమయంలో ఆయనలో దాగి ఉన్నసేవాభావం పెల్లుబికి సేవా సంస్థగా "GRETNALTES" (Greater Tenali Leprosy Treatment and Education Scheme Society) ఆవిర్భవించింది, దీనికి వీరు గౌరవాధ్యక్షులుగా ఉండి భయానక వ్యాధి పీడితులకు ఆశాకిరణంగా నిలిచారు. ఈ సంస్థ నిస్వార్థం, ప్రచార రహితం అనే మూలసూత్రాలపై పని చేసింది. ఇప్పటికి పనిచేస్తున్నది. రాజకీయాల దుష్ప్రభావాన్ని సంస్థపై పడనీయకుండా సేవా మార్గంలో పయనింపజేశారు.
ఒక్క చిన్న గదిలో ప్రారంభమైన ఈ సంస్థకు తన సొంత నిధులతో ఒక ఎకరం కొని స్నేహితులందరి సహకారంతో భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ సంస్థ 5, 6 ఎకరాలకు విస్తరించి దాదాపు 250 మంది సిబ్బందితో పనిచేస్తుంది. వీరిలోని అంకిత భావాన్ని ఆనాటి "స్విస్ ఎమ్మెస్" జనరల్ సెక్రటరీ సర్. రోజర్ ఫీల్డ్ ఎంతగానో కొనియాడారు. ఇతరులు ఎవరి వల్లనైనా సంస్థపై దుష్ప్రభావం పడే పరిస్థితి వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనే బాధ్యత వహించిన మహోన్నత వ్యక్తి ధర్మారావు. ఒకానొక సందర్భంలో సహచరులందరి సమక్షంలో "నా రాజకీయ ఎడారి జీవితంలో GRETNALTES ఒయాసిస్‌లా నాకు సేద తీరుస్తుంది" అని మనసులోని సంతోషాన్ని వ్యక్తపరిచారు.
కొందరు ప్రతిపక్ష, స్వపక్ష రాజకీయ నేతలు GRETNALTES సంస్థపై రాజకీయ ముద్రను ప్రతిబింబింప చూడగా తక్షణమే అటువంటి పరిస్థితిని నిర్ద్వంద్వంగా ఖండించిన నైతిక రాజకీయవేత్త. తాను రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడు సైతం, సంస్థ సేవా కార్యక్రమాల నిమిత్తం ఒక సాధారణ కార్యకర్తగా పనిచేశారు. దీనికి తార్కాణంగా ఆ సేవా సంస్థకు సంబంధించిన సామాన్య కార్యక్రమ విషయానికై ఫండింగ్ ఏజన్సీ, భారత శ్రీలంక సలహాదారుని ఇంటికి ఫోన్ చేయగా వారెంతో దిగ్భ్రాంతికి లోనైనారు. వారి అసమాన వ్యక్తిత్వానికి తన ధన్యవాదాలు తెలిపారు. GRETNALTES సంస్థతో పాటుగా వి.ఎస్.ఆర్ & ఎన్.వి.ఆర్ విద్యాసంస్థల కరెస్పాండెంట్‌గా, శ్రీరామా రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యవర్గ సభ్యుడిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.
2002లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఆదేశాల మేరకు "కరువు అధ్యయన కమిటీకి అధ్యక్షుడిగా" నియమితులై, రాష్ట్రంలోని 933 మండలాల్లో దాదాపు ఐదు నెలల పాటు పర్యటించారు. కరువు కారణంగా 35 లక్షల మంది ఉపాధి కోల్పోయారని, 6,900 గ్రామాల ప్రజలు తాగునీరు లేకుండా అల్లాడుతున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్టుగా నివేదిక రూపొందించి అందజేశారు. ఆ పర్యటన కారణంగా ఆరోగ్యం క్షీణించి, అస్వస్థతకు గురైన వారిని, హైదరాబాద్ మెడ్విన్ ఆసుపత్రిలో చేర్పించారు. చావుతో పోరాడుతూ మాట్లాడలేని స్థితిలో ఉండి, తన ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని, ఏ మాత్రం భయపడక, మరణాన్ని ధైర్యంతో ఆహ్వానించిన ధీశాలి ధర్మారావు.
నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి, మనుషులకు విలువనిస్తూ, స్నేహ సుగంధాలను పంచుతూ, స్వలాభం కోసం పాకులాడని ఉన్నత వ్యక్తిత్వం వారిది. ఎదుటి మనిషిని నమ్మిన తర్వాత, వాళ్ళలో ఉన్న చెడుని కూడా తన పట్ల ఆపాదించుకోవడమే కాకుండా, అపార్థాలను సైతం కూడా వారే భరించేంత సహృదయులు ధర్మారావు గారు. ఆసుపత్రి పేపర్ల మీదే తను చెప్పదల్చుకున్న విషయాలు ఏ మాత్రం తప్పొప్పులు లేకుండా రాసిన స్థిర, దృఢ చితులై తన 72 ఏట 2003 మే 7న కన్నుమూశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల నుంచి మంత్రిగా ఎదిగి, మంచిని ప్రొత్సహిస్తూ, రాగద్వేషాలకు అతీతంగా మెలిగిన ధర్మారావు, తరతరాలకు ఆదర్శనీయులు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!