ప్రజా ఉద్యమాల సూరీడు-పూల సుబ్బయ్య
- July 27, 2025
కరువు కాటకాలకు నిలయమైన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో పెత్తందారీ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న పేద ప్రజల విముక్తి కోసం ప్రజా ఉద్యమాల నడిపిన నాయకుడు పూల సుబ్బయ్య. అణగారిన వర్గ కుటుంబానికి చెందిన ఆయన, సమాజంలో ఉన్న అసమానతలు మీద, సాంఘిక వివక్ష జీవన పర్యంతం పోరాడారు. వామపక్ష వాదాన్ని బడుగు బలహీన వర్గాలకు చేరువ చేసి, ఉద్యమాల వైపు నడిపించారు. ప్రజా సమస్యలపై ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్దపడే మనసత్త్వమే ఆయన్ని మూడు పర్యాయాలు చట్ట సభల్లో కూర్చోబెట్టింది. నేడు బడుగు,బలహీన వర్గాల పెన్నిధి పూల సుబ్బయ్య మీద ప్రత్యేక కథనం.
పూల సుబ్బయ్య 1929,జూన్ 29న ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలోని అవిభక్త కర్నూల్ జిల్లా గిద్దలూరు ఫిర్కా కంభం గ్రామం( ఆ తర్వాత కాలంలో గిద్దలూరు, కంభం ప్రాంతాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భాగమయ్యాయి)లో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పూల వెంకటపతి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. బాల్యంలోనే తండ్రిని కోల్పోవడంతో తల్లి కూలీ నాలీ చేస్తూ సుబ్బయ్యను కష్టపడి చదివించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఉన్నత విద్యను అభ్యసించడానికి అనుకూలించకపోయినా దాతల సహకారం, ప్రభుత్వ ఉపకార వేతనాలతో మార్కాపురంలో హైస్కూల్ విద్యను పూర్తి చేసి గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళశాలలో ఇంటర్ మరియు డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత 1951-54 మధ్యన బెల్గామ్‌లోని కర్ణాటక లా సొసైటీ కళాశాలలో ఎల్.ఎల్.బీ పూర్తి చేశారు.
సుబ్బయ్య చిన్నతనం నుంచే అన్యాయాన్ని ఎదిరించే స్వభావం కలిగిన వ్యక్తి. బాల్యంలో ఎదుర్కొన్న వివక్ష ఆయనలో ప్రశ్నించే తత్వాన్ని బాగా పెంచింది. గుంటూరులో చదువుతున్న సమయంలోనే కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితుడై 1949లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎ.ఐ.ఎస్.ఎఫ్)లో చేరారు. పోలేపెద్ది నరసింహమూర్తి, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య, ప్రతాప రామసుబ్బయ్య, పులుపుల వెంకట శివయ్య మరియు తరిమెల నాగిరెడ్డి లాంటి దిగ్గజ నాయకులతో పరిచయాలను పెంచుకొన్నారు.
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత గిద్దలూరు తాలుకాలోని తురిమెళ్ల గ్రామంలో తురిమెళ్ల గ్రామంలో 1950వ ప్రాంతంలో వామపక్ష కార్యకర్తలైన బెల్లంకొండ శాయన్న, వెంకట రంగయ్యలు ఏర్పాటు చేసిన ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు. అదే పాఠశాలకు 1951లో ఆరు నెలల పాటు ప్రధానోపాధ్యయుడిగా సైతం పనిచేశారు. తురిమెళ్ళలో ఉన్న సమయంలో కమ్యూనిస్టు కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని పెత్తందారీ వ్యవస్థకి వ్యతిరేకంగా గ్రామస్తుల్లో చైతన్యం నింపే పలు కార్యక్రమాలు నిర్వహించారు. కమ్యూనిస్టు మ్యానిఫెస్టో, పెట్టుబడి దారీ దోపిడీ మీద ప్రజలకు అర్థమయ్యేలా రాత్రి పూట ప్రజలకు పాఠాలు చెప్పారు.
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సమయంలోనే అప్పటి మద్రాస్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులై డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికైనా తన ప్రాంత పెత్తందారీ రాజకీయ నాయకుల కారణంగా ఆ కొలువు దక్కలేదు. అయినా అధైర్య పడకుండా ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి లా చదివి 1955 నుంచి న్యాయవాదిగా మార్కాపురంలో ప్రాక్టీసు మొదలు పెట్టారు. న్యాయవాదిగా ఒక్క రూపాయి తీసుకోకుండా పేదల కేసులను వాదిస్తూ వారి కోసం పాటుపడటం ప్రారంభించారు. 1956లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూనే మార్కాపురం, యర్రగొండపాలెం, కంభం, గిద్దలూరు తాలూకాల్లో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు.
1962 ఎన్నికల్లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 1964లో రెండుగా చీలిన సమయంలో సైతం సీపీఐ వైపే మొగ్గు చూపారు. కమ్యూనిస్టు పార్టీలో ఏర్పడ్డ చీలిక అనంతరం పశ్చిమ ప్రాంతంలో సీపీఐ కార్యకలాపాలు విస్తృతం చేశారు. 1962లో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో యర్రగొండపాలెం నుండి తాను ఎమ్మెల్యే గా ఎన్నికవ్వడమే కాకుండా మార్కాపురం లోక్ సభ నుండి పోటీ చేసిన గుజ్జుల యల్లమందా రెడ్డి గారి గెలుపులో కీలకమైన పాత్ర పోషించారు. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యర్రగొండపాలెం నుండి రెండో సారి విజయం సాధించారు.1972 అసెంబ్లీ ఎన్నికల్లో యర్రగొండపాలెం నుండి పోటీ చేసి ఓడిపోయినా, 1978లో తిరిగి మార్కాపురం నుండి విజయం సాధించారు.1983,1985లలో మార్కాపురం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
సుబ్బయ్య గారు శాసనభ్యుడిగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేశారు. పశ్చిమ ప్రాంతంలో కరువు కాటకాలతో తినడానికి తిండలేక సామాన్య ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోకుండా తమ అవసరాల కోసం ఆ ప్రాంత పెత్తందార్లు, రాజకీయ నాయకులు వారి శ్రమను దోచుకుంటూ ఉన్నా నోరు మేదపలేని స్థితిలో ఉన్న వారికి గొంతుకగా మారి పెత్తందారీ రాజకీయ వ్యవస్థపై అలుపెరగని ఉద్యమాలు నడిపారు. నక్సలైట్ల ఇన్ఫర్మర్స్ పేరుతో యర్రగొండపాలెం, మార్కాపురం ప్రాంతాల్లో నివసించే అమాయక గిరిజనులపై పోలీసులు చేస్తున్న హత్యచారాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వారిపై చర్యలు తీసుకునేలా చేశారు. విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఉద్యమానికి మద్దతుగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వ్యక్తుల్లో సుబ్బయ్య ఒకరు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏర్పాటు కోసం కృషి చేసిన ముఖ్య వ్యక్తుల్లో సుబ్బయ్య గారు ఒకరు. నాటి కర్నూల్ జిల్లాలో భాగమైన పశ్చిమ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసేందుకు నూతనంగా ఏర్పాటు కాబోయే ప్రకాశం జిల్లాలో భాగం చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాగు, తాగు నీటి సౌకర్యాలు లేక కరువు తాండవిస్తున్న ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి కృష్ణానది జలాలను తరలించాలని తన చిరకాల మిత్రులైన యల్లమందా రెడ్డి గారితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలను నడిపించారు.
వెలిగొండ ప్రాజెక్టు పోరాట సమితిని ఏర్పాటు చేసి అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వానికి ప్రజల చేత భారీ ఎత్తున వినతులు సమర్పించారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ సుముఖతను తెలపడమే కాకుండా, ప్రాజెక్టుకు శంఖుస్థాపన సైతం జరిపారు. అయితే, సుబ్బయ్య గారు బ్రతికున్నంత కాలం ఆ ప్రాజెక్టుకు మోక్షం లభించలేదు. ప్రాజెక్టు కోసం పోరాడుతున్న దశలోనే 1988, జూన్ 26న తన 59వ ఏట అనారోగ్యంతో మార్కాపురంలోని తన స్వగృహంలో కన్నుమూశారు.ఆ
తర్వాత కాలంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు చక చకా జరుగుతున్న సమయంలో ప్రాజెక్టు కోసం ఆయన చేసిన కృషికి గాను పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్షను సఫలం చేస్తూ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరణం చేయడం జరిగింది.
సుబ్బయ్య గారు అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు నెరిపారు. సిద్ధాంత పరంగా, భావజాల పరంగా రాజకీయ నాయకుల మధ్య వైరుధ్యాలు ఉండాలి తప్పించి వ్యక్తిగత ద్వేషాలు ఉండకూడదు అనే చెప్పేవారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న సుబ్బయ్య గారు పశ్చిమ ప్రకాశం అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా కృషి చేయాలని తన చివరి శ్వాస వరకు ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులను కోరుతూ వచ్చారు. ఎమ్మెల్యేగా, రైతు కూలీ ఉద్యమనేతగా తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన సుబ్బయ్య లాంటి నిస్వార్థ రాజకీయ నాయకుడి గురించి నేటి యువతరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ కరెస్పాండెంట్)
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!