తమ ఇంటిని టీటీడీకి విరాళంగా ఇచ్చిన దంపతులు..

- July 29, 2025 , by Maagulf
తమ ఇంటిని టీటీడీకి విరాళంగా ఇచ్చిన దంపతులు..

తిరుమల: హైదరాబాద్ మల్కాజ్ గిరిలోని వసంతపురి కాలనీకి చెందిన టి.సునీత దేవి, టి.కనక దుర్గ ప్రసాద్ దంపతులు రూ.18.75 లక్షల విలువైన 250 చదరపు గజాల గల తమ ఇంటిని మంగళవారం శ్రీవారికి విరాళంగా అందించారు.

హైదరాబాద్ కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ భాస్కర్ రావు ఇటీవల తన మరాణానంతరం వీలునామా ద్వారా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రూ.3 కోట్లు విలువైన ఇంటిని, రూ.66 లక్షల బ్యాంకులోని ఫిక్సిడ్ డిపాజిట్లను టీటీడీకి విరాళంగా ఇవ్వడం విదితమే.

స్వర్గీయ భాస్కర్ రావు స్ఫూర్తితో టి.సునీత దేవి,టి.కనక దుర్గ ప్రసాద్ దంపతులు తమకు సంతానం లేకపోవడంతో తమ తదనంతరం తమ ఆస్తి శ్రీవారికి చెందేలా వీలునామా రాసి స్వామివారిపై అపారమైన భక్తిని చాటుకున్నారు.

ఆస్తికి సంబంధించిన పత్రాలను మంగళవారం తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.

ఈ సందర్భంగా స్వామివారి పై అపారమైన భక్తితో తమ ఇంటిని విరాళంగా ఇవ్వడం ఇతర భక్తులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని దాతలను అదనపు ఈవో అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com