సినిమా రివ్యూ: ‘కింగ్‌డమ్’

- July 31, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘కింగ్‌డమ్’

ఈ మధ్య విజయ్ దేవరకొండ కెరీర్ ఏమంత బాగా లేదు.ఎలాగైనా కష్టపడి తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నాడు.అలా గౌతమ్ తిన్ననూరితో కలిసి చేసిన సినిమానే ‘కింగ్‌డమ్’.ఈ సినిమా కోసం విజయ్ తనను తాను మార్చుకున్నాడు. వేషం, భాష అన్నీ మార్చేశాడు.మరి, విజయ్ దేవరకొండ కష్టం తెరపై ఫలించిందా.? ‘కింగ్‌డమ్’కి రాజయ్యాడా.? లేదా.? మునుపటి సినిమాల లిస్టులోనే ‘కింగ్‌డమ్’ కూడా చేరిపోయిందా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
1920ల టైమ్‌లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అప్పటి శ్రీకాకుళం తీర ప్రాంతంలోని ప్రజలను బ్రిటీష్ వాళ్లు వేధించడం.. వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల కోసం ప్రాణాలర్పించిన ఓ నాయకుడు.. ఇలా మొదలైన కథ 1991కి చేరుతుంది.అంకాపూర్ పోలీస్ స్టేషన్‌లో సూరి (విజయ్ దేవరకొండ) ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్.ఇండియన్ స్సై అప్పగించిన ఓ సీక్రెట్ ఆపరేషన్‌ని సూరి ఒప్పుకోవాల్సి వస్తుంది. తనకు ఇష్టం లేకపోయినా.. చిన్నతనంలో తాను కోల్పోయిన అన్న శివ (సత్యదేవ్) కోసం సూరి ఈ సీక్రెట్  ఆపరేషన్ ఒప్పుకోవాల్సి వస్తుంది. ఓ పెద్ద మాఫియా డాన్ అయిన శివ మరో పక్క పేద ప్రజలకు అండగా నిలబడుతుంటాడు. రాబిన్‌హుడ్ మాదిరి కష్టమని వచ్చిన ప్రజలకు సాయం చేస్తుంటాడు. అలాంటి శివ ప్రాణాలకు ముప్పు వుందని తెలుసుకున్న సూరి తన అన్న ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఏం చేశాడు.? అసలు శివ, సూరి చిన్నతనంలోనే విడిపోవడానికి కారణాలేంటీ.? సూరి ఒప్పుకున్న సీక్రెట్ ఆపరేషన్‌కీ, శివకీ సంబంధం ఏంటీ.? తెలియాలంటే ‘కింగ్‌డమ్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే. 

నటీనటుల పని తీరు:
విజయ్ దేవరకొండ నుంచి ఓ మంచి సాలిడ్ హిట్‌ని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే సూరి పాత్ర కోసం విజయ్ చాలా కష్టపడ్డాడు. ప్రాణం పెట్టాడు. యాక్షన్ ఘట్టాల్లో చెలరేగిపోయాడు.అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో అది ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం చేశాడు.కానీ, కథ పరంగా కథనం పరంగా విజయ్ కష్టం ఫలించినట్లు అనిపించదు. గతంలోనే ఈ తరహా పాత్రలు చాలా సినిమాల్లో చూసేశాం. ఆయా సినిమాల్లో పండినంత ఎమోషన్ ఈ సినిమాలో పండినట్లు కనిపించదు. అభిమానులే ఈ సినిమా విజయ బాధ్యతను మోయాల్సి వుంది.మరో నటుడు సత్యరాజ్ ఎప్పటిలాగే తన అనుభవాన్ని రంగరించి కొట్టిన పిండిలాంటి పాత్రలో జీవించేశారు. విలన్ రోల్ పోషించిన వెంకీటేష్ ఓకే అనిపిస్తాడు. అందాల భామ భాగ్యశ్రీ బోర్సేకి ఈ సినిమాలోనూ సో సో పాత్రే దక్కిందని చెప్పాలి. వున్నంత సేపూ తనదైన గ్లామర్‌తో ఆకట్టుకుంది. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
గౌతమ్ తిన్ననూరిపై అభిమానులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. నిజానికి ఈ సినిమా కోసం రామ్ చరణ్‌ని అనుకున్నాడు గౌతమ్ తిన్ననూరి.చివరికి ఆ ప్రాజెక్ట్ విజయ్‌తో తెరకెక్కించాల్సి వచ్చింది. అయితే కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు.వాస్తవానికి ట్రైలర్‌లోనే సినిమా కథ రివీల్ అయిపోయింది.అలాంటప్పుడు తెరపై నడించిన కథనం ఎంతో ఆసక్తికరంగా వుండి వుండాలి. అంత ఆసక్తి కథనంపై పెట్టినట్లు కనిపించదు.రొటీన్ సన్నివేశాలు. అక్కడక్కడా విజయ్‌పై చిత్రీకరించిన సన్నివేశాలు ఫ్యాన్స్‌లో ఉత్తేజం కలిగించినప్పటికీ ఓవరాల్‌గా సినిమా చూస్తే నిరాశే మిగులుతుంది. అనిరుధ్ రవిచంద్రన్ బీజీఎమ్ కొన్ని చోట్ల ఓకే అనిపించినా.. చాలా చోట్ల పాత మ్యూజిక్‌నే కొట్టినట్లుంటుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎడిటింగ్‌ కూడా చాలా వరకూ ఓకే. బోర్ కొట్టించే సన్నివేశాలు బాగానే కట్ చేసినట్లున్నారు. అంతేకాదు. ఓ సాంగ్ కూడా లేపేశారని తెలుస్తోంది. సో అది కూడా ఓ ప్లస్సే అని చెప్పొచ్చు. డైలాగ్స్ ఓకే. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయ్. 

ప్లస్ పాయింట్స్:
విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్‌లోని కొత్తదనం..సినిమాటోగ్రఫీ.. 

మైనస్ పాయింట్స్:
కథ, కథనం, కొన్ని చోట్ల కథలో చెప్పిన అంశాలకు అస్సలు కనెక్షనూ, లాజిక్కూ లేకుండా చూపించిన సన్నివేశాలు (ప్రసవించిన తల్లులు మగ పిల్లలను చూడకూడదు అని ప్రస్థావిస్తారు.. కానీ సత్యదేవ్ మాత్రం తల్లితోనే వుంటాడు.. అలాగే బ్యాక్ గ్రౌండ్‌లోనూ కొందరు మగ పిల్లలతో వున్న తల్లులు కనిపిస్తారు.. ఈ తరహా సన్నివేశాలు) అంతగా పండని అన్నదమ్ముల సెంటిమెంట్.. ఫ్యామిలీ ఆడియన్స్ కొందరికి రుచించని సన్నివేశాలు కూడా.. 

చివరిగా:
విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ అభిమానులే తేల్చుకోవాల్సిన తీర్పు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com