రాక్ స్టార్ ఆఫ్ మ్యూజిక్ ....!

- August 02, 2025 , by Maagulf
రాక్ స్టార్ ఆఫ్ మ్యూజిక్ ....!

సంగీతానికి వయసు ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యం అని నిరూపించాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలో అడుగుపెట్టి క్లాస్, మాస్, రాప్, రాక్, ఫోక్‌ గీతమేదైనా సరే దేవిశ్రీ ప్రసాద్‌ చేతిలో పడిందంటే చాలు నిండైన ఎనర్జీతో సంగీత ప్రియులను సునామీలా ముంచేస్తుంది.అందుకే తరాల భేదమెరుగని స్వరంగా దేవిశ్రీ సంగీతం అందరికీ ఇంపుగా మరిపోయింది. నేడు టాలీవుడ్ ప్ర‌ముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్ర‌సాద్ పుట్టిన రోజు.

అభిమానులు డీఎస్పీగా పిలుచుకునే దేవి శ్రీ ప్రసాద్ 1979 ఆగస్టు 2న ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి, శిరోమణి దంపతులకు జన్మించాడు. అయతే.. చాలామంది అనుకుంటున్నట్లుగా ఆ సినిమా టైటిల్‌ కారణంగా ఆయనకి ఆ పేరు రాలేదు. దేవిశ్రీ ప్రసాద్‌ పేరు వెనుక చిన్న ఆసక్తికరమైన కథ ఉంది. దేవిశ్రీ తండ్రికి తన అత్తమామలంటే మంచి అభిమానం. అందుకే తన అత్తగారి పేరులోని దేవి, మామ ప్రసాద్‌రావు పేరులోని ప్రసాద్‌ను తీసుకొని నామకరణం చేశారు.. ఆయన పూర్తి పేరు ‘గొర్తి దేవిశ్రీప్రసాద్‌’. చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి చూపిస్తుండటంతో మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్పించారు. గురువుతోపాటు ఇళయరాజా, మైఖేల్‌ జాక్సన్‌ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఈ ముగ్గురినీ ఎంతగానో ఆరాధిస్తానని రాక్‌స్టార్‌ చెబుతుంటారు.

ఆ తర్వాత ఇండస్ట్రీలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ దగ్గర శిష్యరికం చేశారు. అయితే, ముందుగా దేవిలో టాలెంట్ ఉందని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి దర్శకుడు కోడి రామకృష్ణ. తన ‘దేవి’ సినిమాలో శ్రీ ప్రసాద్ కి సంగీత దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ కెరీర్ ప్రారంభించిన తొలి నాళ్లలో ‘కుర్రాడు.. వీడేం మ్యూజిక్ కొడతాడు?’ అంటూ హేళనలు ఎదుర్కొన్నాడు. కానీ.. ఆ తర్వాత 'దేవి' సినిమా పాటలు రిలీజ్ అయ్యాక.. ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. అప్పట్లో దేవీ గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరిగింది.

హుషారైన పాటలకు, డీఎస్పీ కేరాఫ్‌ అడ్రస్‌గా చెబుతారు. మాస్‌, మెలోడీ, వెస్ట్రన్‌, దేశీ.. జానర్‌ ఏదైనా దేవి ట్యూన్‌ ఇచ్చాడంటే అభిమానులు కేరింతలతో థియేటర్‌ దద్దరిల్లాల్సిందే! ప్రత్యేక గీతాలకు దేవి పెట్టింది పేరు.ఆయన బాణీ కట్టిన ఐటెమ్‌ సాంగ్స్‌ కుర్రకారును ఉర్రూతలూగించారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ. బెంగాలీ భాషల్లో 100కు పైగా చిత్రాలకు ఆయన సంగీతమందించారు.

అభిమానులందరూ ‘రాక్‌స్టార్’గా పిలుచుకునే దేవీశ్రీ సంగీత దర్శకుడిగానే కాకుండా, గొప్ప గాయకుడు, గేయ రచయిత కూడా అలరించారు.ఇప్పటి వరకు 60పాటలు పాడారు. దాదాపు 25 పైగా పాటలకు సాహిత్యమందించారు. అంతే కాదు దేవిలో చాలా మంచి డాన్సర్‌ కూడా ఉన్నాడు. ఆ ఉత్సాహంతోనే ప్రమోషనల్‌ సాంగ్స్‌తో కూడా మెరుస్తుంటారు. టాలీవుడ్‌లోపాటు దక్షిణాది ఇతర భాషల అగ్ర హీరోలందరికీ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

సంగీత దర్శకుడిగా డీఎస్పీ ఒక నంది అవార్డు, 9 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు అయిదు సైమా అవార్డులు, తమిళ స్టేట్‌ అవార్డ్స్‌తోపాటు పలు మ్యూజిక్‌ అవార్డ్స్‌ కూడా అందుకున్నారు. అయితే ఆయన మాత్రం తన పాట పది కాలలపాటు నిలవడం, ప్రేక్షకుల చప్పట్లకు మించిన అవార్డ్‌ లేదని చెబుతుంటారు. అంతే కాదు.. 2000 నుంచి 2010 మధ్యలో  అధిక చిత్రాలకు సంగీతం అందించిన రికార్డ్‌ దేవిదే! అప్పటి నుంచీ ఇప్పటివరకై సౌత్‌ సంగీత దర్శకుల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నది కూడా దేవినే అని టాక్‌.

ఇక, ఐటమ్ సాంగ్ లకి దేవి స్పెషలిస్ట్. ‘ఆర్య2’ లోని ‘రింగ రింగ’ పాటని అన్ని భాషల్లో రీమేక్‌ చేశారు. ఇంకా ఆ అంటే అమలాపురం, కెవ్వుకేక, డియ్యాలో డియ్యాలో విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఇటీవల దేశవ్యాప్తంగా వినిపించిన ‘ఊ అంటావా మామా’ పాట దేవీశ్రీ స్వరపరిచిందే. ఇక ఇన్ని సినిమాల్లో వందల పాటల్లో దేవికి ‘నాన్నకు ప్రేమతో’ పాట అంటే చాలా ప్రత్యేకం. తన తండ్రి పై ఉన్న ప్రేమతో 'నాన్నకు ప్రేమతో..' పాటను రాసి తానే స్వయంగా పాడారు.

 దేవిశ్రీకి హీరోగా లాంచ్‌ అవ్వాలనే కోరిక ఉంది. ఆ బాధ్యను సుకుమార్‌ తీసుకున్నారు. 2019లో దిల్‌ రాజు నిర్మాణంలో ఓ కథ సిద్ధమైంది. అయితే అది చర్చల దశలోనే ఆగిపోయింది. ఇప్పుడు దేవికి అంత తీరుబడి కూడా లేదు. ఇటు సంగీత దర్శకుడిగా స్టూడియోలో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే.. అటు విదేశాల్లో కాన్సెర్ట్‌లు కూడా చేస్తుంటారు దేవి. 2014 జులై 26న ఇల్లినాయిస్‌లోని అరెనాలో దేవిశ్రీ ఇచ్చిన సంగీత ప్రదర్శనకుగాను, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆ రోజును ‘డీఎస్పీ డే ఇన్‌ ఇల్లినాయిస్‌’గా ప్రకటించారు.

తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అగ్ర హీరోలందరికీ మ్యూజిక్‌ అందించిన రికార్డు దేవిశ్రీకి ఉంది. ఇంకా వారి వారసుల సినిమాలకు దేవిశ్రీ మ్యూజిక్‌ అందించడం విశేషం. ఇలా రెండు తరాలకు సంగీతం అందించిన అతి కొద్దిమంది తెలుగు సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. తాజాగా ‘పుష్ప’ సినిమాతో దేశ, విదేశాల్లో త‌న మ్యూజిక్ మ్యాజిక్‌ను మ‌రోసారి రుచి చూపించాడు. ప్రస్తుతం పలు తెలుగు, తమిళ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

సంగీతం సృష్టించడం.. సరిగమలతో సరికొత్త ప్రయోగాలు చేయడం.. ఎప్పటికప్పుడు నిత్యనూతనమైన గీతాలతో అలరించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ దాన్ని అవలీలగా చేసి చూపిస్తాడు దేవిశ్రీ ప్రసాద్‌. గీతానికి, సంగీతానికి సరికొత్త బాటలు చూపిన యువ సంగీత దర్శకుడతను. అలతి అలతి పదాలతో పాటల మాలలు కట్టగలడు. ముద్దు ముద్దు పలుకుల నుంచి సరికొత్త బాణీలు సృష్టించగలడు. సరిగమల్లో యవతరపు సువాసనలు చల్లి ఉత్సాహంతో ప్రేక్షకుల నరాలను ఉప్పొంగించగలడు. అందుకే దేవిశ్రీ పాట థియేటర్లో వినపడితే చాలు శివాలెత్తి ఆడుతారు సినీ ప్రియులు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com