క్వారీలో భారీ బండరాళ్లు పడి ఆరుగురి మృతి

- August 03, 2025 , by Maagulf
క్వారీలో భారీ బండరాళ్లు పడి ఆరుగురి మృతి

అమరావతి: బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్రాన్ని షాక్‌కు గురిచేసింది.గ్రానైట్ క్వారీలో బండరాళ్లు ఒక్కసారిగా విరిగి పడటంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు.మరి కొందరు తీవ్రంగా గాయపడగా, కొంతమంది ఇంకా రాళ్ల కింద చిక్కుకుని ఉన్నారని సమాచారం.ఈ ఘటన స్థానికంగా విషాద వాతావరణాన్ని నెలకొల్పింది.ప్రతిరోజు లాగే కార్మికులు ఉదయం పని కోసం క్వారీకి చేరుకున్నారు. అయితే, అకస్మాత్తుగా భారీ రాళ్లు పగిలి కూలిపడటంతో ప్రమాదం సంభవించింది. అక్కడ పనిచేస్తున్న 16 మంది కార్మికుల్లో ఎక్కువమంది ఒడిశాకు చెందినవారని పోలీసులు తెలిపారు. కూలిన రాళ్ల కింద కొందరు చిక్కుకోవడంతో సహాయక చర్యలు చేపట్టారు.గాయపడినవారికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. క్వారీలో రాళ్లు ఒక్కసారిగా పడటంతో వాటి కింద పలువురు చిక్కుకున్నారు. వీరిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు.

క్షతగాత్రులను అంబులెన్స్‌లో నర్సారావుపేట ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఒక్కసారి గ్రానైట్ శ్లాబు విరిగిపడటంతో శిథిలాల కింద కార్మికులు ఇరుక్కుపోయారు.ఇప్పటి వరకు నాలుగు మృత దేహాలను బయటకు తీసినట్టు అధికారలు తెలిపారు. బండరాళ్ల కింద చిక్కుకున్న మృత దేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.వీటిని వెలికితీస్తే ఎన్ని మృతదేహాలు ఉన్నాయనేది స్పష్టత వస్తుంది. ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు సూచించారు.మొత్తం 10 మంది కార్మికులు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్వారీ నిర్వహాకులు సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దుర్ఘఘటనపై బాపట్ల జిల్లా కలెక్టర్‌, ఎస్పీ స్థానిక అధికారులతో మాట్లాడి రెస్క్యూను వేగవంతం చేయాలని ఆదేశించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com