యెమన్ తీరంలో పడవ మునిగి 68 మంది మృతి

- August 04, 2025 , by Maagulf
యెమన్ తీరంలో పడవ మునిగి 68 మంది మృతి

యెమెన్: ఒక దేశంలో సమస్యలు వస్తే, అక్కడ నుంచి పక్కదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆరంభమైనప్పటి నుంచి అక్కడి ప్రజలు పక్కదేశాలకు పారిపోతున్నారు. కొందరు సముద్రమార్గంలో వలసల కోసం అక్రమంగా ప్రయాణం సాగించి, ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆఫ్రికా నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వస్తున్న శరణార్థులు, వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ యెమన్ తీరంలో మునిగిపోయింది. ఈ ఘోరవిషాద ఘటనలో 68మంది మరణించగా, మరో 74 మంది గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ (IOM) వెల్లడించింది.

12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు
ఈ పడవలో మొత్తం 154మంది ప్రయాణికులు ఉన్నారని, వీరంతా ఇథియోపియన్లు అని ఐఓఎం యెమెన్ విభాగాధిపతి అబ్దుసత్తర్ ఎసోవ్ తెలిపారు.ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున యెమన్లోని అబియాన్ ప్రావిన్స్ తీరంలో, గల్ఫ్ ఆఫ్ అడెన్ సమీపంలో చోటుచేసుకుంది. సముద్రంలో మునిగిన పడవలో 12మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని, వారిలో ఒకరు యెమెన్ దేశస్థుడు కాగా, మిగిలిన 11 మంది ఇథియోపియన్లు అని ఆయన వివరించారు.

లభ్యమైన 54మృతదేహాలు
మరణించిన వారిలో 54మంది మృతదేహాలు ఖన్ఫర్ జిల్లాతీరంలో లభ్యమయ్యాయని, మరో 14 మృతదేహాలను జింజిబార్ నగరంలోని ఆసుపత్రికి తరలించారని అధికారులు తెలిపారు. గల్లంతైనవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, బలమైన అలలకారణంగా గాలింపు చర్యలు కష్టంగా మారింది.

ప్రమాదకరమైన మార్గంలో పయనం
ఆఫ్రికాలోని హార్న్ ఆఫ్ ఆప్రియా ప్రాంతం నుండి గల్ఫ్ దేశాలకు చేరుకోవడానికి యెమన్ ఒక కీలకమైన ప్రాంతం, కానీ ప్రమాదకరమైన మార్గమని ఇక్కడి వారు చెబుతుంటారు. ఉపాధి, తిండి కోసం ఈ వలసదారులు తరచుగా రద్దీగా ఉండే, నాణ్యత లేని పడవల్లో ప్రయాణం చేస్తుంటారు. ఈ ప్రయాణంలో అనేకసార్లు పాణనష్టం జరుగుతుంది. తాజా ప్రమాదం ఈ మార్గంలో ఉన్న ప్రమాదాలను మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటన పట్ల ఐక్యరాజ్యసమితి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలను నివారించడానికి అంతర్జాతీయ సమాజం చరయలు తీసుకోవాలని, శరణార్థులకు, వలసదారులకు సురక్షితమైన మార్గాలను కల్పించాలని పిలుపునిచ్చింది.

అంతర్యుద్ధాలతో ప్రజల తిప్పలు
సరిహద్దు దేశాలతో తరచు యుద్ధాలు, అంతర్యుద్ధాలతో సామాన్యప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పక్కదేశాలతో వలసలతో వెళ్తుంటారు. ఏమాత్రం క్షేమకరం కాని పడవమార్గాలను ఎంచుకుంటున్నారు. పడవల్లో కూడా కెపాసిటీమించి ప్రయాణీకులను తీసుకెళ్తు తరచూ ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com