ఏపీలో నూతన రైడ్ హైరింగ్ యాప్
- August 06, 2025
విజయవాడ: ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైడ్ హైరింగ్ ఫ్లాట్ఫాంలకు భిన్నంగా సరికొత్త రైడ్ హైరింగ్ యాప్ ఆవిష్కృతమైంది. కస్టమర్లతో పాటు డ్రైవర్లకు సైతం లాభదాయకంగా ఉండేలా సేవలందించేందుకు రైడ్ఇట్ యాప్ సిద్ధమైంది.పూర్తిగా రాష్ట్రంలో రూపుదిద్దుకున్న రైడ్ఇట్ యాప్ ప్రారంభోత్సవ వేడుక సీతారాంపురంలోని సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైడ్ఇట్ ఫౌండర్ డైరెక్టర్ రవితేజ పైండా, కో-ఫౌండర్ సన్హిత మాదల, డైరెక్టర్ ప్రశాంతి కొంగర పాల్గొని రైడ్ఇట్ గురించి వివరించారు.
ఈ సమావేశంలో రవితేజ పైండా మాట్లాడుతూ, వినియోగదారులతో పాటు డ్రైవర్లకు కూడా మరింత మేలు చేయాలనే సంకల్పంతో పలు ప్రత్యేక ఫీచర్లతో ‘రైడ్ఇట్‘కు రూపకల్పన చేశామన్నారు. కష్టమర్లపై ఎటువంటి అదనపు భారం పడకుండా చూసుకుంటూనే, డ్రైవర్లకు మరింత ఆదాయం లభించేలా ఈ యాప్ ను నిర్వహిస్తామని తెలియజేశారు. కస్టమర్ల ఇబ్బందుల పరిష్కారానికి కస్టమర్ కేర్ ఉన్నట్లుగానే, డ్రైవర్లకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం డ్రైవర్ కేర్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని వివరించారు. యాప్ కేంద్ర కార్యాలయం స్థానికంగా ఉండటం వల్ల డ్రైవర్లు నేరుగా ఆఫీసుకు వచ్చి సులువుగా సమస్యలను పరిష్కరించుకునే వీలు కలుగుతుందని అన్నారు.మిగిలిన ఫ్లాట్ఫాంల్లో మాదిరిగా ‘రైట్ఇట్’లో ఎటువంటి వ్యాలెట్ సర్వీసులు ఉండవని, తద్వారా రైడ్ క్యాన్సిల్ ఇబ్బందుల నుంచి కస్టమర్లకు విముక్తి లభిస్తుందని చెప్పారు.జీరో కమిషన్ సేవలను అందించడం ద్వారా కస్టమర్లకు, డ్రైవర్లకు లాభదాయకంగా రైడ్ఇట్ సేవలందిస్తుందని రవితేజ వివరించారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో రైడ్ఇట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, త్వరలోనే రాష్ట్రంలోని మరిన్ని నగరాలకు తమ సేవలను విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.
అనంతరం, రైడ్ఇట్ కో-ఫౌండర్ సన్హిత మాదల మాట్లాడుతూ, పలు వినూత్నమైన ఫీచర్లతో రైడ్ఇట్ సేవలందిస్తుందని పేర్కొన్నారు.రైడ్ సమయంలో డ్రైవర్లకు ఎదురయ్యే వివాదాల పరిష్కారం కోసం లీగల్ సపోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైడ్ సమయంలో డ్రైవర్లకు ఎదురయ్యే చట్టపరమైన వివాదాల పరిష్కారం కోసం రైడ్ఇట్ ద్వారా నియమించబడిన అడ్వకేట్లు న్యాయ సహాయం అందిస్తారని చెప్పారు. వీటితో పాటు, పెట్ ఫ్రెండ్లీ రైడ్ సదుపాయాన్ని ‘రైడ్ఇట్’లో ప్రత్యేకంగా పొందుపరిచామని ప్రకటించారు.పెంపుడు జంతువులతో ప్రయాణించాలనుకునే కస్టమర్లకు పెట్ ఫ్రెండ్లీ రైడ్ ఆప్షన్ చాలా ఉపయుక్తంగా ఉంటుందని, పెట్ ఫ్రెండ్లీ రైడ్ ఎంపిక ద్వారా డ్రైవర్ల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సునాయాసంగా రైడ్ చేయవచ్చని తెలిపారు.స్కూల్ పిల్లల కోసం సైతం ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తెస్తున్నామని అన్నారు.చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వ్యక్తిగత రైడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని సన్హిత వివరించారు.
రైడ్ఇట్ డైరెక్టర్ ప్రశాంతి కొంగర మాట్లాడుతూ..డ్రైవర్ల సంక్షేమం కోసం రైడ్ఇట్ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించిందని అన్నారు.విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సౌజన్యంతో డ్రైవర్లకు హెల్త్ కార్డులు అందజేస్తున్నామని ప్రకటించారు.ఈ హెల్త్ కార్డుల ద్వారా వైద్య చికిత్సల ఖర్చులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల చార్జీలు, మందుల ఖరీదుపై 20 శాతం రాయితీ లభిస్తుందని వెల్లడించారు.కస్టమర్ల పై ఏ విధమైన అదనపు భారం మోపకుండానే, డ్రైవర్లకు మరింత ఆదాయం లభించేలా, వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ రైడ్ఇట్ యాప్ రూపుదిద్దుకుందని ప్రశాంతి కొంగర తెలియజేశారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







