అత్యాచారం కేసులో హైదర్ అలీని అరెస్ట్ చేసిన పోలీసులు

- August 08, 2025 , by Maagulf
అత్యాచారం కేసులో హైదర్ అలీని అరెస్ట్ చేసిన పోలీసులు

పాకిస్థాన్ క్రికెట్ ప్రపంచంలో మరోసారి పెద్ద సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే ఎన్నో వివాదాలతో సతమతమవుతున్న పాక్ క్రికెట్‌కి ఇది మరొక పెద్ద దెబ్బగా మారింది. పాకిస్థాన్ షాహీన్స్ తరఫున ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న యువ క్రికెటర్ హైదర్ అలీ పై అత్యాచార ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం పాక్ క్రికెట్ బోర్డును తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇంగ్లండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌లో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదర్ అలీని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతడి పాస్‌పోర్టును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడు పోలీస్ కస్టడీలోనే ఉన్నట్లు సమాచారం. ఈ యువ క్రికెటర్ పై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) వెంటనే అతనిపై తాత్కాలికంగా సస్పెన్షన్ విధించింది.

హైదర్ అలీ అక్టోబర్ 2, 2000న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ అట్టక్‌లో జన్మించారు. ఇప్పటివరకు ఈ ఆటగాడు తన దేశం కోసం రెండు వన్డేలు, 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. హైదర్ అలీ రెండు సంవత్సరాల క్రితం ఆసియా క్రీడలలో చివరిసారిగా పాకిస్థాన్ తరఫున ఆడాడు. 2020లో దక్షిణాఫ్రికాలో పాకిస్థాన్ అండర్-19 ప్రపంచ కప్‌లో ఆడాడు. సెప్టెంబర్ 2020లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదర్ అలీ (Hyder Ali) టీ20 అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నవంబర్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఆ తర్వాత వన్డేల్లో కూడా ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటివరకు హైదర్ అలీ 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 505 పరుగులు, 2 వన్డేలలో 42 పరుగులు చేశాడు. టీ20లో 3 హాఫ్ సెంచరీలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. కోచ్ మైక్ హసన్ వంటి దిగ్గజాల దృష్టిలో ఉన్న హైదర్ అలీ.. పాకిస్థాన్ జట్టులో ఒక కీలక ఆటగాడిగా ఎదుగుతాడని చాలా మంది భావించారు.

పాకిస్థాన్ షాహీన్స్ జట్టు జులై 17 నుంచి ఆగస్టు 6 వరకు యూకే పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఉన్న సమయంలో, మాంచెస్టర్ నగరంలో జులై 23న జరిగిన ఒక అత్యాచారం ఘటనపై గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అనుమానితుడిగా హైదర్ అలీని గుర్తించారు. ఆగస్టు 3న బెకెన్‌హామ్ గ్రౌండ్‌ లో మ్యాచ్ జరుగుతుండగా పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని బెయిల్‌పై విడుదల చేసి, అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున పోలీసులు అధికారికంగా అతని పేరును వెల్లడించలేదు, అయితే మీడియాలో ఈ విషయం వెల్లడైంది.ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు హైదర్ అలీని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్న పీసీబీ ప్రకటించింది.

ఈ కేసులో యూకే చట్టపరమైన ప్రక్రియలకు పూర్తి సహకారం అందిస్తామని పీసీబీ పేర్కొంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత.. పీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో హైదర్ అలీకి న్యాయ సహాయం అందిస్తున్నట్లు కూడా బోర్డు తెలిపింది.హైదర్ అలీ కెరీర్‌లో వివాదాలు ఇది మొదటిసారి కాదు. 2021లో అబుదాబిలో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ సమయంలో అతను కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించాడు. ఈ కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతడిని సస్పెండ్ చేసి, అదే ఏడాది ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లే జట్టు నుంచి తొలగించింది. ఇప్పుడు ఈ తీవ్రమైన ఆరోపణలు అతని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com