మహిళలు తిరుమలకు ఇక పై ఉచితంగా ప్రయాణించవచ్చు

- August 20, 2025 , by Maagulf
మహిళలు తిరుమలకు ఇక పై ఉచితంగా ప్రయాణించవచ్చు

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ప్రయాణానికి మరింత సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా, స్త్రీ శక్తి పథకాన్ని తిరుమల ఘాట్ రోడ్ దాకా విస్తరించారు. ఈ మార్గంలో ప్రయాణించే మహిళలకు ఇకపై ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం లభించనుంది. తిరుమల కొండపైకి వెళ్లే బస్సుల్లో కూడా ఉచిత రవాణా వర్తింపచేయడం ద్వారా వేలాది మంది భక్త మహిళలకు ఇది లాభదాయకంగా మారనుంది. అయితే, ఘాట్ రోడ్‌లో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, కేవలం సిటింగ్ సౌకర్యం కలిగిన బస్సుల్లో మాత్రమే ఈ సౌకర్యం వర్తించనుందని అధికారులు తెలిపారు.

స్త్రీ శక్తి పథకం ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా అద్భుత స్పందన లభిస్తోంది. పథకం అమలులో ఉన్న తొలి మూడు రోజుల్లోనే దాదాపు 43 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారు. రోజుకి సగటున సుమారు రూ.6.30 కోట్ల మేర ప్రయోజనం మహిళలకు అందుతోంది. ముఖ్యంగా ఆసుపత్రులు, పుణ్యక్షేత్రాలు లేదా చిరు ఉద్యోగాల నిమిత్తం ప్రయాణించే మహిళలు ఈ పథకం ద్వారా ప్రయాణ వ్యయాన్ని తగ్గించుకుని లాభం పొందుతున్నారు. ఇది మహిళల ఆర్థిక భద్రతకు ఒక వినూత్న ముందడుగు అని చెప్పొచ్చు.

ఈ పథకాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం స్మార్ట్ కార్డుల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. త్వరలోనే మహిళలకు క్యూఆర్ కోడ్‌తో(QR code) కూడిన ప్రత్యేక స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. ఈ కార్డుల ద్వారా వారు తరచుగా ప్రయాణించగలిగేలా చేస్తారు, మరియు గుర్తింపు కార్డులు చూపాల్సిన అవసరం లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేయనున్నారు. ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాల ఆధారంగా ప్రయాణించడాన్ని క్రమంగా స్మార్ట్ కార్డులతో భర్తీ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com