యూఏఈలో 12 నెలల్లో రోడ్లపైకి 390,000 వాహనాలు..!!

- August 24, 2025 , by Maagulf
యూఏఈలో 12 నెలల్లో రోడ్లపైకి 390,000 వాహనాలు..!!

యూఏఈ: యూఏఈలో జనాభా పెరుగుతున్న కొద్దీ రోడ్లపై వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దుబాయ్ టోల్ గేట్ ఆపరేటర్ సలిక్ విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, యూఏఈలో యాక్టివ్‌గా నమోదైన వాహనాల సంఖ్య జూన్ 2025 నాటికి 4.56 మిలియన్లకు చేరుకుంది.  ఇది జూన్ 2024లో 4.17 మిలియన్లుగా ఉంది. ఇది సంవత్సరానికి 9.35 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అంటే ఏడాదిలో కొత్తగా రోడ్లపైకి 390,000 వాహనాలు వచ్చాయి.

వీటితోపాటు 2025 రెండవ త్రైమాసికంలో వాహన రిజిస్ట్రేషన్లు త్రైమాసికం నుండి త్రైమాసికానికి 2 శాతం పెరిగాయి. ఈ పెరుగుదల జనాభా పెరుగుదలతో సమానంగా ఉంది. జూన్ 2024 మరియు జూన్ 2025 మధ్య దుబాయ్ జనాభా 208,000 కంటే ఎక్కువ పెరిగిందని దుబాయ్ స్టాటిస్టిక్స్ సెంటర్ తెలిపింది.  

దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) గణాంకాల ప్రకారం పగటిపూట  దుబాయ్‌లో మాత్రమే రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య 3.5 మిలియన్లకు చేరుకుంది. ఇది గత రెండు సంవత్సరాలలో నమోదైన వాహనాలలో 10 శాతం పెరుగుదల నమోదైంది. ఇది ప్రపంచ సగటు 2-4 శాతాన్ని దాటడం విశేషం.

మరోవైపు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్టీఏ డైనమిక్ టోల్ టారిఫ్‌లు, 3 సంవత్సరాలలో బిలియన్ల దిర్హామ్‌ల విలువైన 30 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలులోకి తెచ్చింది. సలిక్, దుబాయ్ టాక్సీ, పార్కిన్ మరియు మాడా మీడియా వంటి కీలక సేవలను ప్రైవేట్ పరం చేసింది. అదే సమయంలో రిమోట్ వర్కింగ్ ను ప్రోత్సహించింది.  భారీ వాహనాల కదలికలపై పరిమితులు విధించింది. పాఠశాల జోన్ లకు ప్రత్యేకంగా టైమింగ్స్ తోపాటు ప్రత్యేక బస్సు లేన్‌లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు ఉమ్ సుకీమ్-అల్ ఖుద్రా కారిడార్, హెస్సా స్ట్రీట్ మరియు అల్ ఫే స్ట్రీట్ వంటి 11 ప్రధాన రోడ్డు కారిడార్‌లను కూడా అప్డేట్ చేస్తోంది.

ఇక మార్చి నెలలో దుబాయ్‌లో వాహనాల సంఖ్యలో 8 శాతం వృద్ధి నమోదు అయిందని యూఏఈ ఇంధన మరియు మౌలిక సదుపాయాల మంత్రి సుహైల్ అల్ మజ్రౌయి తెలిపారు. పొరుగు ఎమిరేట్స్ నుండి పని వ్యాపారం కోసం దుబాయ్‌కు ప్రయాణించే దాదాపు పది లక్షల మంది రోజువారీ రాకపోకలు ట్రాఫిక్ సవాళ్లను మరింత తీవ్రతరం చేస్తున్నాయని, ఇది నగర మౌలిక సదుపాయాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com