ఉమెన్స్ వరల్డ్ కప్ కు ఆతిథ్యమివ్వనున్న వైజాగ్

- September 08, 2025 , by Maagulf
ఉమెన్స్ వరల్డ్ కప్ కు ఆతిథ్యమివ్వనున్న వైజాగ్

విశాఖపట్నం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళల వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఆదివారం వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ ట్రోఫీ ప్రదర్శన కార్యక్రమంలో ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల వరల్డ్ కప్లో ఐదు మ్యాచ్లను వైజాగ్లో నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నాం” అన్నారు. విశాఖలో తొలిసారి జరుగుతున్న ఈ మ్యాచ్ చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్ కార్యక్రమం రాష్ట్ర క్రీడా అభివృద్ధి పట్ల చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10 సంవత్సరాల క్రీడా రోడ్మ్యాప్లో క్రీడా కోటాను 3 శాతంకు విస్తరించడం, క్రీడాకారులకు విద్యా-ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యాంశాలుగా ఉన్నాయని ఆయన తెలియజేశారు. అక్టోబర్లో జరగనున్న వరల్డ్ కప్ ప్రారంభో త్సవానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఆహ్వానించామని తెలిపారు.

మిథాలీ రాజ్ మెంటార్ గా, రాబోయే సెంటర్స్ ఆఫ్ఎక్సలెన్స్తో కలసి గ్రామీణ, పాఠశాలస్థాయి ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు సిద్ధమవుతాయని అన్నారు. మహిళల వరల్డ్ కప్ కేవలం ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ క్రీడా పునరుజ్జీవనానికి సంకేతం అన్నారు విశాఖ ఈవెంట్ ద్వారా క్రీడా పర్యాటకం, ఉపాధి, మహిళా క్రీడాకారుల అభివృద్ధి కొత్త దారులు తెరుస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయకుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గిరీష్ దొంగిరి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com