నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!

- September 10, 2025 , by Maagulf
నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!

దుబాయ్: ఆసియాకప్ 2025 టోర్నీలో భాగంగా భారత జట్టు తన తొలిమ్యాచ్‌ను బుధవారం ఆడనుంది. యూఏఈ జట్టుతో టీమిండియా తలపడనుంది. టీ20 ప్రపంచ ఛాంపియన్ అయిన భారత్ జట్టుకు యూఏఈపై విజయం సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.. కానీ, టీ20ల్లో ఏ జట్టునూ మరీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈనెల 14న పాకిస్థాన్ జట్టుతో కీలక పోరుకు ముంగిట యూఏఈ మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తూ ఘనవిజయం సాధించి సరైన స్థితిలో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

యూఏఈతో భారత జట్టు ఓకే ఒక టీ20 మ్యాచ్ ఆడింది. 2016 ఆసియా కప్ లో జరిగిన ఆ మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత్ తో మూడు వన్డేలు కూడా ఆడిన యూఏఈ అన్నింట్లో ఓడింది. మరోవైపు భారత్ జట్టు సూపర్ ఫామ్ లో ఉంది. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ నుంచి ఆడిన 27 మ్యాచ్ లలో భారత జట్టు మూడు మ్యాచ్ లలో మాత్రమే ఓడిపోయింది.

ఆసియాకప్ టోర్నీలో భాగంగా యూఏఈ జట్టుతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. శుభ్‍మన్ గిల్ చాలాకాలం తరువాత మళ్లీ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. వైస్ కెప్టెన్ హోదాలో గిల్ ఆసియా కప్ తుది జట్టులో ఉండడం ఖాయం. దీంతో ఇన్నాళ్లూ ఆడుతున్న తుది జట్టు నుంచి అతడి కోసం స్థానం ఖాళీ చేసేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

మిడిలార్డర్ బ్యాటర్ రింకు సింగ్ ను తప్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే, బ్యాటింగ్ ఆర్డర్లో అదొక్క మార్పే ఉండకపోవచ్చు. గిల్ ఓపెనర్ గా క్రీజులోకి వస్తే.. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ను ఆరంభిస్తాడు. అయితే, ఇప్పటి వరకు అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్ గా వస్తున్న సంజు శాంసన్ అక్కడి నుంచి కిందికి దిగాల్సిందే. టాప్ ఆర్డర్లో ఆడించేట్లయితేనే సంజు శాంసన్ తుది జట్టులో ఉండే చాన్స్ ఉంది. మిడిలార్డర్ బ్యాటరే కావాలనుకుంటే జితేశ్ మెరుగైన ప్రత్నామ్నాయం కావొచ్చు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు తుది జట్టులో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.

బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ బుమ్రాతో కలిసి కొత్త బంతిని పంచుకునే మరో పేసర్ ఎవరనేది ప్రశ్న. గత మ్యాచ్ ల్లో అర్ష్‌దీప్ ఆడాడు. కానీ, అతన్ని పక్కన పెట్టి బ్యాటింగ్ కూడా చేయగల, ఇటీవల ఫామ్ లో ఉన్న హర్షిత్ రాణాను ఆడించే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి యూఏఈతో మ్యాచ్ లో భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది.

భారత తుది జట్టు (అంచనా) :
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), జితేశ్ శర్మ/ సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్/హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ర్పీత్ బుమ్రా , వరుణ్ చక్రవర్తి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com