'నేను హీరో అయితే నన్ను చూస్తారా? బాగుంటానా'

- July 20, 2016 , by Maagulf
'నేను హీరో అయితే నన్ను చూస్తారా? బాగుంటానా'

నరేష్‌ సినిమా అంటే పసందైన వినోదం. రెండు గంటల హాయైన కాలక్షేపం! కామెడీకి గ్యారెంటీ అడ్రస్‌.. నరేష్‌! ఆయన సినిమా అంటే కితకితలే. అందుకే నరేష్‌ సినిమా అంటే టికెట్టు తెగిపోవడం ఖాయం. ఆ భరోసాతోనే నరేష్‌ కోసం కథలు పుట్టేస్తున్నాయి. 'అల్లరి'తో మొదలైన ఆ స్పీడు 50 చిత్రాల్ని దాటుకొంటూ వెళ్లిపోయింది. అయితే గత కొంతకాలంగా నరేష్‌ ఖాతాలో సరైన విజయం పడలేదు. 'సెల్ఫీ రాజా'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నం చేశాడు ఈ అల్లరోడు. ఆ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అల్లరి నరేష్‌ చెప్పుకొచ్చిన సెల్ఫీ.. సంగతులు.
స్పందన చాలా బాగుందండీ. హాయిగా రెండు గంటల పాటు ఎంజాయ్‌ చేసే సినిమా అని ప్రేక్షకులు కితాబిచ్చేశారు. మంచి వసూళ్లు దక్కాయి. ఈమధ్య కాలంలో నా సినిమాలకు ఇంత మంచి వసూళ్లు తెచ్చిన సినిమా ఇదే. నేనూ, నిర్మాతలు కూడా హ్యాపీ.
ఈ సినిమాకు ముందు కాస్త టెన్షన్‌ పడ్డారా? ప్రతీ సినిమాకీ టెన్షన్‌ మామూలే కదండీ. అయితే... 'సెల్ఫీరాజా' విషయంలో అది కాస్త ఎక్కువైంది. ఎందుకంటే.. నా సినిమాలు ఈమధ్య సరైన ఫలితాన్ని సాధించడం లేదు. ఎంత కష్టపడినా ఫలితం కనిపించలేదు. ఈసారి ఎలాగైనా మంచి సినిమా చేయాలన్న ఉద్దేశంతో కష్టపడి చేసిన సినిమా ఇది. అందుకే ఆ టెన్షన్‌...
ఫ్లాపులొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఇండ్రస్ట్రీలో ఇవన్నీ మామూలే కదండీ. హిట్టొచ్చినప్పుడు తప్పులు కనిపించవు. అదే సినిమా ఫ్లాప్‌ అయితే ఒప్పులుకూడా తప్పులుగా భయపెడుతుంటాయి. సినిమాల్లోనే కాదు, ఎక్కడైనా ఈ బాధ ఉంటుంది. అందులోంచి ఏం నేర్చుకొన్నామన్నదే ప్రధానం.
యాభై సినిమాల కథానాయకుడిగా నేర్చుకొన్నది ఏమిటి? జయాపజయాలకు బెదరకుండా ముందుకు సాగిపోవడమే. మన వంతు ప్రయత్నం మనం చేసినప్పుడు.. ఫలితం ఏదొచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. 'నరేష్‌ ప్రతీ సినిమాలోనూ ఒకేలా కనిపిస్తున్నాడు' అనే కామెంట్‌ వచ్చినప్పుడు 'లడ్డూబాబు' సినిమా చేశా. చాలా హెవీ మేకప్‌తో కనిపించాను. నన్ను జనాలు గుర్తుపట్టడమే కష్టమైపోయింది. 'నరేష్‌ సినిమాల్లో కథానాయిక పాత్రలకు ప్రాధాన్యం ఉండడం లేదు' అంటున్నారని 'బ్రదరాఫ్‌ బొమ్మాళీ', 'జేమ్స్‌ బాండ్‌' సినిమాలు ట్రై చేశా. 'బందిపోటు' కూడా ఒకరకంగా నాకు కొత్త జోనరే. అయితే ఇవేం ఆడలేదు.
నిజానికి మీరు హీరో అవ్వాలనుకోలేదట కదా? హీరోనా, దర్శకుడినా అనే క్లారిటీ ఉండేది కాదు కానీ, ఏం చేసినా ఈ ఇండ్రస్ట్రీలోనే అనేది మాత్రం క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణమే కనిపించేది. నాన్నగారు యేడాదికి రెండు మూడు సినిమాలు చేస్తుండేవారు. ఇంట్లో కనీసం ఓ డజనుమంది సహాయ దర్శకులు ఉండేవారు. నా బాల్యమంతా అలానే గడిచింది. నన్ను ప్రొడ్యూసర్‌ని చేయాలన్నది నాన్న ఆలోచన. 'చాలా బాగుంది' సినిమాకి క్యాషియర్‌గా పనిచేశా. అయితే నాకు మాత్రం హీరో అయితే బాగుంటుంది అనిపించేది. కానీ 'నేను హీరో అయితే నన్ను చూస్తారా? బాగుంటానా' అనే భయాలు వెంటాడేవి. అందుకే నాన్న ముందు చెప్పలేకపోయేవాడ్ని. 'చాలాబాగుంది' వందరోజుల వేడుకకు అమితాబ్‌బచ్చన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నన్ను చూసి 'అభిషేక్‌లా చాలా పొడుగ్గా ఉన్నాడు. తనని హీరో చేస్తున్నావ్‌ కదా' అని నాన్నగారిని అడిగారు. నాన్న కూడా మొహమాటం కొద్దీ తలూపారు. ఆ తరవాత.. 'డాడీ నాకు హీరో అవ్వాలని ఉంది' అని బయటపడిపోయా. ఆల్రెడీ అమితాబ్‌ కూడా ఇదే మాట చెప్పారని నాన్న కూడా 'సరే..' అనేశారు. అలా అమితాబ్‌బచ్చన్‌ రికమెండేషన్‌తో నేను హీరో అయ్యానన్నమాట.
మరి.. దర్శకత్వం ఎప్పుడు? దానికి ఇంకా టైమ్‌ ఉందండీ. కనీసం రెండేళ్లు పడుతుందేమో? ఒకవేళ దర్శకుడ్ని అయితే ఇలా కామెడీ సినిమాలు చేయను. '7/జి బృందావన కాలనీ'లాంటి సినిమాలు తీస్తా. బేసిగ్గా... అలాంటి కథలంటే నాకు చాలా ఇష్టం.
మీ అన్నయ్య రాజేష్‌ ఏం చేస్తున్నారు..? మా బ్యానర్‌లో సినిమాలు చేద్దామనుకొంటున్నాం. వాటికి సంబంధించిన ప్రొడక్షన్‌ బాధ్యతలు చూసుకొంటాడు. అన్నయ్యకు హీరోగా ఆఫర్లు వస్తున్నాయి. నేను హీరోగా, తాను విలన్‌గా ఓ సినిమా చేద్దామనుకొన్నాం. అయితే.. మేం అన్నదమ్ములని అందరికీ తెలుసు. తను విలన్‌ అంటే ఒప్పుకొంటారా అనే సందేహం వచ్చింది.
మళ్లీ తమిళంలో సినిమా చేయలేదు.. త్వరలోనే ఓ తమిళ చిత్రం చేయబోతున్నా. సముద్రఖని దర్శకత్వం వహిస్తారు. ఇది కూడా ఆయన స్టైల్‌లోనే అత్యంత సహజంగా ఉండే కథ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com