భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- October 04, 2025
లండన్: భారత్-యూకే ద్వైపాక్షిక సంబంధాలు మరో కీలక దశలోకి ప్రవేశించబోతున్నాయి. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన మొదటి అధికారిక భారత పర్యటనకు సిద్ధమవుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు స్టార్మర్ అక్టోబర్ 8 నుండి రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం అధికారిక ప్రకటన ద్వారా ధృవీకరించింది.
యూకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీర్ స్టార్మర్ భారత్ పర్యటన ఇదే ప్రథమం కావడం విశేషం. ఆయన పర్యటనలో ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య, రక్షణ, విద్యా రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా, భారత్-యూకే మధ్య జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు ఈ సందర్శనలో ప్రధాన అంశంగా నిలవనున్నాయని సమాచారం.
ఈ పర్యటనలో భాగంగా అక్టోబర్ 9న ముంబైలో ప్రధాని మోదీ, స్టార్మర్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించనున్నారు. ‘విజన్ 2035’ రోడ్‌మ్యాప్‌లో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, వాతావరణ మార్పులు, విద్య, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో సహకారంపై చర్చిస్తారు.
ముఖ్యంగా, ఇరు దేశాల ఆర్థిక భాగస్వామ్యానికి మూలస్తంభంగా భావిస్తున్న ‘సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం’ (సెటా) ద్వారా లభించే అవకాశాలపై వీరు ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతోనూ సంప్రదింపులు జరుపుతారు.పర్యటనలో భాగంగా ఇరువురు ప్రధానులు ముంబైలో జరిగే 6వ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ లో పాల్గొని కీలక ప్రసంగాలు చేస్తారు.
అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలపై కూడా ఈ కార్యక్రమం సందర్భంగా పారిశ్రామిక నిపుణులు, ఆవిష్కర్తలతోనూ భేటీ కానున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.గత జులై 23-24 తేదీల్లో ప్రధాని మోదీ యూకేలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో కుదిరిన ఒప్పందాలకు, చర్చలకు కొనసాగింపుగా స్టార్మర్ పర్యటన జరగనుంది.
ఆ సమయంలో ఇరు దేశాల మధ్య చరిత్రాత్మక ‘సెటా’ ఒప్పందం కుదిరింది. అలాగే, రక్షణ ఉత్పత్తుల సహ-రూపకల్పన, సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ‘రక్షణ పారిశ్రామిక రోడ్‌మ్యాప్’కు కూడా ఇరు దేశాలు ఆమోదం తెలిపాయి. తాజా పర్యటనతో భారత్-యూకేల మధ్య భవిష్యత్ భాగస్వామ్యం మరింత దృఢంగా మారుతుందని విదేశాంగ శాఖ విశ్వాసం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







