కర్నూల్‌లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు

- October 13, 2025 , by Maagulf
కర్నూల్‌లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రధాని రాకను పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ సభను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో నిర్వహించబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు టూరిజం కారిడార్‌పై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. అనంతపురం–కర్నూలు ఇండస్ట్రియల్ కారిడార్ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. శ్రీశైలంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కూడా జరగబోతోందని వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని అన్నారు.

కర్నూలు పూర్వ రాజధానిగా ఉన్నందున, ప్రధాని మోదీకి ఆ ప్రాంతంపై ప్రత్యేక అవగాహన ఉందని మంత్రి తెలిపారు. కర్నూలుకు ప్రధాని కొత్త వరాలు ప్రకటిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు. GST తగ్గింపు వల్ల ప్రజలకు గణనీయమైన లాభం కలిగిందని, మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని అన్నారు.

పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కడపలో మహానాడు, అనంతపురంలో సూపర్ సిక్స్ సభలు ఘనవిజయం సాధించాయని గుర్తుచేశారు. ఇప్పుడు కర్నూలు సభ కూడా చారిత్రాత్మకంగా నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. కర్నూలును డ్రోన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సమాన అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com