ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం

- November 01, 2025 , by Maagulf
ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం

అమరావతి: ఏపీలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట సంభవించింది.ఈ ఘటనలు పలువురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.

జిల్లాలోని కాశీబుగ్గలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. చిన్న తిరుపతిగా గుర్తింపు పొందిన ఆలయం ఇది. కార్తీకమాసం, ప్రబోధిని ఏకాదశి పర్వదినం కావడం వల్ల ఈ తెల్లవారు జాము నుంచి భక్తులు పోటెత్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవడానికి తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సరైన చర్యలు, ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఈ దుర్ఘటన సంభవించిందని తెలుస్తోంది.

ఈ ఘటన పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసిందని అన్నారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాలం గడుస్తున్న కొద్దీ భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోవడం కనిపించింది. స్వామివారి దర్శనానికి వెళ్లే చోట తోపులాట చోటు చేసుకుంది. క్రమంగా అది పెరిగింది. ఆలయం ఆవరణలో స్టీల్ బ్యారికేడ్ సైతం విరిగిపోయిందంటే.. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్జీవంగా పడివున్న తమ వారిని బతికించుకోవడానికి కుటుంబ సభ్యులు, తోటివాళ్లు, ఆలయ సిబ్బంది ప్రాథమిక సపర్యలు చేశారు. సీపీఆర్ ఇస్తూ కనిపించారు. అయినప్పటికీ- ఎటువంటి ఉపయోగం లేకుండాపోయింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com