KGF నటుడు కన్నుమూత

- November 06, 2025 , by Maagulf
KGF నటుడు కన్నుమూత

కన్నడ సినిమా ‘KGF’లో గుర్తుండిపోయే ఛాఛా పాత్రలో నటించిన హరీశ్ రాయ్ ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు కన్నుమూశారు. ఆయన మృతి వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు, సహనటులు తీవ్రంగా దుఃఖం వ్యక్తం చేస్తున్నారు. హరీశ్ రాయ్ కొన్నేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతున్నారు. ‘KGF-2’ విడుదలైన తర్వాత ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. నాల్గో దశలోకి చేరిన వ్యాధి కారణంగా ఆయన పూర్తిగా బలహీనమయ్యారు. వైద్యుల చికిత్స పొందుతున్నప్పటికీ, ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరకు ఆయన జీవన పోరాటం ఓడిపోయింది. ఆరోగ్యం క్షీణించడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొన్న హరీశ్ రాయ్‌కి పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. ముఖ్యంగా నటుడు ధ్రువ్ సర్జా(Dhruv Sarja) ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించారు. అలాగే పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేశారు. కానీ, పరిస్థితి విషమించడంతో చివరికి ఆయన తుదిశ్వాస విడిచారు.

రాయ్ తన కెరీర్‌లో పలు సినిమాల్లో నటించినప్పటికీ, ఆయనకు అత్యధిక గుర్తింపు KGF చాప్టర్ 1 లోని ఛాఛా పాత్రతో వచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద విజయం సాధించింది. చిన్న పాత్ర అయినప్పటికీ, హరీశ్ రాయ్ తన నటనతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. హరీశ్ రాయ్ మృతి వార్తతో సండల్‌వుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. KGF టీమ్ సభ్యులు, నటుడు యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్, మరియు ఇతర సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళి అర్పించారు. “ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయాం. ఆయన పాత్రలు, వ్యక్తిత్వం ఎప్పటికీ మరిచిపోలేము” అంటూ పలువురు సంతాప సందేశాలు పోస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com