సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- November 29, 2025
అమరావతి: సీఎం చంద్రబాబు సమక్షంలో నిన్న క్యాబినెట్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. అందులో సాదా బైనామాల రిజిస్ట్రేషన్ అంశం ఉంది. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు గడువును 2027 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఒప్పంద పత్రాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే, ఈ సౌకర్యం కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది.
భూమిని అమ్మే వ్యక్తి తప్పనిసరిగా చిన్న లేదా సన్నకారు రైతు అయి ఉండాలి. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా, అర్హులైన రైతులకు కొన్ని రాయితీలు కూడా లభిస్తాయి. బదిలీ సుంకం, రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీ వంటివి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మినహాయింపుల వల్ల చిన్న, సన్నకారు రైతులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. భూ రికార్డులను సరి చేసుకోవడం వారికి మరింత సులభం అవుతుంది. ఈ నిర్ణయం రైతుల సంక్షేమానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సాదా బైనామా అంటే అధికారికంగా రిజిస్టర్ కాని, తెల్ల కాగితాలపై చేసుకున్న భూముల కొనుగోలు ఒప్పందాలు. భూమిని కొన్న వారు, అమ్మిన వారు ఒక ఒప్పందంపై సంతకాలు చేస్తారు. అయితే దీన్ని అధికారికంగా ప్రభుత్వ కార్యాలయంలో నమోదు చేయరు.
చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు చేసినప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌పై కాకుండా తెల్ల కాగితాలపై లావాదేవీల ఒప్పందం రాసుకుంటారు. దాని ఆధారంగానే భూముల క్రయ విక్రయాలు జరిగిపోతుంటాయి. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని క్రయవిక్రయాలలో ఇలా జరుగుతోంది. ఇలా తెల్లకాగితాలపై ఒప్పందం రాసుకోవడాన్నే సాదా బైనామాగా పిలుస్తుంటారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







