ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!

- December 20, 2025 , by Maagulf
ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!

మనామా: శ్రీలంకలో ఒక అడవి ఏనుగుకు నిప్పు పెడుతున్న వీడియో వైరల్ అయిన తర్వాత, జంతువుల పట్ల క్రూరత్వానికి పాల్పడిన ముగ్గురిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. 42 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల నిందితులను కొలంబోకు ఉత్తరాన సుమారు 200 కిలోమీటర్ల (125 మైళ్లు) దూరంలో ఉన్న అనురాధపుర ఉత్తర-మధ్య జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో ఈ ఫుటేజ్ షేర్ అయిన తర్వాత ఈ సంఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  అడవి జంతువుకు నిప్పు పెట్టడానికి ముందు దానిని కాల్చి గాయపరిచారని, దాని ప్రాణాలను కాపాడటానికి పశువైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని వన్యప్రాణి అధికారులు తెలిపారు. శ్రీలంకలో ఏనుగులను పవిత్రంగా భావిస్తారు. అయితే మారుమూల గ్రామాలలో పంటలను నాశనం చేసే అడవి ఏనుగులపై కొన్నిసార్లు రైతులు దాడి చేసే ఘటనలు నమోదవుతుంటాయి.

శ్రీలంక చట్టం ప్రకారం ఏనుగులను చంపిన వేటగాళ్లకు మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అయితే, ఆ దేశం 1976 నుండి మరణశిక్షను అమలు చేయలేదు. అనంతర కాలంలో మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. గత ఐదేళ్లుగా మానవ-ఏనుగుల సంఘర్షణ కారణంగా ఏటా సుమారు 400 ఏనుగులు మరియు 200 మంది మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. శ్రీలంకలో సుమారు 7,000 అడవి ఏనుగులు ఉన్నాయని అంచనా.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com