తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు

- December 30, 2025 , by Maagulf
తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులకు మరింత సౌకర్యం కల్పించేలా ప్రత్యేక ఆర్జిత సేవలను ప్రారంభించేందుకు ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ సేవలను దశలవారీగా అమలు చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి నుంచి కొన్ని సేవలు, 2026 ఫిబ్రవరి నుంచి మరికొన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ చర్యతో యాదగిరిగుట్ట ఆలయానికి ఆధ్యాత్మికంగా మరింత ప్రాధాన్యం లభించనుంది.

కొత్తగా ప్రవేశపెట్టనున్న సేవల్లో భాగంగా ప్రతి బుధవారం ఉదయం తోమాల సేవ నిర్వహించనున్నారు. దంపతులు కలిసి పాల్గొనే ఈ సేవకు రూ.500 టికెట్ ధర నిర్ణయించారు. అలాగే తులాభారం సేవను కొత్త విధానంలో అమలు చేస్తూ, అవసరమైన వస్తువులను ఆలయ అధికారులు స్వయంగా అందించనున్నారు. వైకుంఠ ఏకాదశి అనంతరం ప్రతిరోజూ సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ ప్రారంభమవుతుంది. ఈ సేవకు కూడా రూ.500 టికెట్ ధర ఉండగా, భక్తులకు రెండు లడ్డూ ప్రసాదాలు ఉచితంగా అందజేయనున్నారు.

ఇప్పటి వరకు రథసప్తమికే పరిమితమైన సూర్యప్రభ వాహన సేవను ఇకపై ప్రతి ఆదివారం ఉదయం నిర్వహించనున్నారు. ఈ సేవకు దంపతుల కోసం రూ.1,000 టికెట్ ధర నిర్ణయించగా, శాలువా మరియు కనుమ ప్రసాదంగా అందజేస్తారు. అలాగే ఆలయ చరిత్రలో తొలిసారిగా చంద్రప్రభ వాహన సేవను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు వాహన సేవలు 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రత్యేక సేవలతో యాదగిరిగుట్టలో భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి లభించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com