ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- January 18, 2026
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్థంతి (జనవరి 18) సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి తన తాతను స్మరించుకున్నారు. లోకేష్ వెంట పలువురు తెలంగాణ టీడీపీ నేతలు సైతం ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు.
ప్రముఖ సినీ నటుడు నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా ఈరోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. ఇక, ఎన్టీఆర్ 30వ వర్దంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు నిర్వాహకులు ఆయన సమాధిని పూలతో అలంకరించారు. ఆ పరిసరాల్లో ఎన్టీఆర్ రాజకీయ, సినీ ప్రయాణం విశేషాలను తెలిపే ఫొటోలతో కూడా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇక, ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా నివాళులర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు.
ఎన్టీఆర్ 30వ వర్దంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ‘‘కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి, ‘అన్న’ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నాను. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శం. ఆయన వేసిన బాట అనుసరణీయం. మరొక్కమారు ఆయనకు స్మృత్యంజలి ఘటిస్తూ….’’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా కూడా ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహా నాయకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కిన అరుదైన వరం అని పేర్కొన్నారు. ‘‘మీరు భౌతికంగా దూరమై ఇన్నేళ్లయినా, తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్న తాతయ్యా.. మీ జన్మ ధన్యమయ్యా!’’ అని లోకేష్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







