ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్
- February 12, 2026
అమరావతి:ఆంధ్రప్రదేశ్ శాసనమండలి 49వ సెషన్ సందర్భంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మరియు ఇతరులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ సమాధానమిచ్చారు. రేనాటి గడ్డపై జన్మించిన వీరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దాతృత్వ శిఖరం బుడ్డా వెంగళరెడ్డిల సేవలను ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 1857 సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ల ముందే, భారత ప్రజల స్వేచ్ఛ కోసం బ్రిటీష్ పాలకులపై పోరాడిన ధీశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు. రేనాడు ప్రాంత ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. అదేవిధంగా 1866లో రాయలసీమలో సంభవించిన భయంకరమైన కరువు సమయంలో, తన యావదాస్తిని ప్రజల ఆకలి తీర్చడానికి ధారబోసిన మహానుభావుడు బుడ్డా వెంగళరెడ్డి అని గుర్తుచేశారు. ఆయన చూపిన చొరవ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మ్యూజియంల ఏర్పాటు అనేది పురావస్తు ఆధారాలు, చరిత్రపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆధునిక సాంకేతికతను జోడించి *వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి పద్ధతులలో చారిత్రక ఘట్టాలను భవిష్యత్తు తరాలకు అందించే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే జయంతి, వర్ధంతి కార్యక్రమాల క్యాలెండర్లో ఈ ఇద్దరు మహానాయకుల వివరాలను పొందుపరుస్తామని, వారిని తగు రీతిలో గౌరవించుకుంటామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.ఈ మహనీయుల సేవలపై కూటమి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని, వారి కీర్తిని పది కాలాల పాటు నిలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









