రాజీనామాకు సిద్ధపడ్డ గుజరాత్ ముఖ్యమంత్రి

- August 01, 2016 , by Maagulf
రాజీనామాకు సిద్ధపడ్డ గుజరాత్ ముఖ్యమంత్రి

గుజరాత్ ముఖ్యమంత్రి అనందీబెన్ పటేల్ రాజీనామాకు సిద్ధపడ్డారు. వయసు మీదపడడంతో ముఖ్యమంత్రి బాధ్యతలు మోయలేకపోతున్నానని, బాధ్యతల నుంచి తప్పించాలని అనందీబెన్ పటేల్ బీజేపీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాలను ఆమె తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. ఆనందిబెన్ వచ్చే నవంబర్‌లో 75వ ఏట అడుగుపెట్టబోతున్నారు. మరోవైపు వచ్చే ఏడాది గుజరాత్‌లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌ అభివృద్ధి నమూనాను దేశమంతటా ప్రచారం చేసి నరేంద్రమోదీ ప్రధానిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టడంతో ఆయన స్థానంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్‌ ప్రమాణం స్వీకరించారు. ఆనందిబెన్‌ హయాంలోనే పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళన గుజరాత్‌ను కుదిపేసింది. దీనికితోడు గుజరాత్‌ ఉనాలో దళిత యువకులపై జరిగిన దాడి దేశమంతటా గగ్గోలు రేపింది. ఈ నేపథ్యంలో ఆనందిబెన్ రాజీనామాకు సిద్ధపడటం గమనార్హం. కాగా, పటేల్ ఉద్యమం తీవ్రతరం కావడంతో అనందీబెన్ పటేల్ పై ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో పార్టీ అధిష్ఠానం నుంచి కూడా ఒత్తిడి పెరిగింది.

ఈ దశలో అనందీ బెన్ పటేల్ పని తీరుపై బీజేపీ గుర్రుగా ఉన్నట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి గుజరాత్ ముఖ్యమంత్రి మారనున్నారని, రేసులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని ఆ సందర్భంలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఆమె తాజా వ్యాఖ్యలతో గుజరాత్ బీజేపీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొత్త సిఎం రేసులో నితిన్ పటేల్, విజయ్ రూపాణి ఉన్నారు.​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com