అమ్మతనం

- April 13, 2015 , by Maagulf

అక్షర జ్ఞానం అసలు లేదు !

అయితేనేమీ…….

ఆదర్శంగా బ్రతకడం ఆమె సొత్తు !

లక్ష్మీకటాక్షం ఆమెకు ఆమడ దూరం !

అయినా .. నిండుకుండలా 

ఎప్పుడూ ఆమెలో లేనితనం కనిపించదు !

‘ప్రేమ’కు అర్ధాన్ని…..

ఆవిడ ప్రేమలోనించి వెతుక్కోవాలి !

చూడ్డానికి అమాయకురాలే !

కానీ -సమయం వస్తే అంతటి తెలివి 

ఒళ్ళంతా డిగ్రీలు చుట్టుకున్న

వనితామణుల్లో కన్పించదు !

తెలిసో తెలియకో, తనమాట చెల్లకో,

పెద్దలమాటను ప్రక్కకు నేట్టలేకనో,

గంపెడుపిల్లల సంసారానికి సారధి  అయింది !

అయినా…ఆత్మ విశ్వాసమే తన పెట్టుబడిగా,

ఆదర్శ కుటుంబంగా తీర్చి దిద్ది,

అందరూ ప్రయోజకులయ్యేవరకూ,

ఆమె క్రొవ్వొత్తిలా కరిగిపోయింది,

ఆ పైన..  కొడిగట్టిన దీపమై ఆరిపోయింది !

ఆనక, అనంత వాయువుల్లో కలిసిపోయింది. 

బ్రతుకు పోరాట ఆరాటంలో…….. 

రెక్కలొచ్చిన పక్షుల్లా…… 

తలోదారి పట్టిన ఆమె పేగుబంధాలు 

ఆమెను తలుచుకొవడమే 

ఒక పెద్ద తంతు అయిపొయింది !

యాంత్రిక స్వప్నమయిపోయింది !!

‘ఆమె’ఎవరంటే ఏమి చెప్పాలి ?

‘ఆమె’ – మా అమ్మ కావచ్చు !

 మీ అమ్మ కావచ్చు !

 ఎవరి అమ్మయినా కావచ్చు !!

 ఆ… అమ్మతనానికి వందనం.

                             ----డా. కె. ఎల్. వి. ప్రసాద్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com